ఉపాధి కూలీలు విలవిల

ABN , First Publish Date - 2022-05-13T05:08:12+05:30 IST

కేంద్రం కొత్త నిబంధనలు అమలు చేయడంతో ఉపాధిహామీ కూలీలు విలవిలలాడుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేసి కేంద్రం నేరుగా పనుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఎండ తీవ్రతను తట్టుకుంటూ పనులు చేపడుతున్న కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. చెల్లించాల్సిన వేతనాలు కూడా రెండు నెలలుగా ఖాతాల్లో జమకాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించడం వల్లే వేతనాలు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉపాధి కూలీలు విలవిల
మహ్మదాపూర్‌లో ఫిష్‌పాండ్‌ పని చేస్తున్న కూలీలు

కొత్త నిబంధనలతో ఇబ్బందులు

పనిచేసే చోట నీడ కరువు 

సకాలంలో అందని కూలి


హుస్నాబాద్‌రూరల్‌, మే 12 : కేంద్రం కొత్త నిబంధనలు అమలు చేయడంతో ఉపాధిహామీ కూలీలు విలవిలలాడుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేసి కేంద్రం నేరుగా పనుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఎండ తీవ్రతను తట్టుకుంటూ పనులు చేపడుతున్న కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. చెల్లించాల్సిన వేతనాలు కూడా రెండు నెలలుగా ఖాతాల్లో జమకాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించడం వల్లే వేతనాలు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

హుస్నాబాద్‌ మండలంలో 5,413 జాబ్‌కార్డులు ఉండగా నిబంధనల ప్రకారం గ్రామాల్లో చెరువుల్లో  పూడిక తీయడం, కాల్వల నిర్మాణం, ట్రెంచ్‌కటింగ్‌, సోంపార్క్‌, ఫిష్‌ఫాండ్‌, నర్సరీలతో పాటు, అటవీ ప్రాంతంలో కందకాల తవ్వకాల పనులను చేపడుతున్నారు. 15 రోజుల నుంచి 1600 నుంచి 1750 కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో ఎంపిక చేసిన పనులను చేపిస్తున్నారు. అయితే గతంలో లాగా వేసవి అలవెన్స్‌ ఇవ్వకపోవడం వల్ల కూలీలకు వేతనం ఎక్కువగా రావడం లేదు. గత సంవత్సరం మార్చి నుంచి జూన్‌ వరకు సమ్మర్‌ అలవెన్స్‌ కింద 30 శాతం అదనంగా అందేది. ప్రతీరోజూ పనులకు వెళుతున్న ఉపాధి కూలీలకు మాత్రం రూ.50 నుంచి 100 దాటడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఉపాధి కూలీలకు ప్రతిరోజూ రూ.256 వరకు వచ్చే విధంగా అధికారులు చూడాలి. వారం రోజులు పనిచేసినా వెయ్యి రూపాయలు దాటడంలేదు.


పెరుగుతున్న ఎండ.. సాగని పనులు

రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ఉపాధి పనులు ముందుకు సాగడం లేదు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు పనులు చేసేందుకు అధికారులు అవకాశం కలిపస్తున్నా ఎక్కువ శాతం ఉదయం పూటనే పనులకు వస్తున్నారు. భూమి గట్టిదనంతో ఉండడంతో పనులు ఎక్కువగా జరగపోవడంతో కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండకాలంలో పని చోట టెంట్లు, తాగునీటి సౌకర్యం, మెడికల్‌ కిట్లు, పనిముట్లు  ఏర్పాటు చేసి కూలీల కష్టసుఖాలను గుర్తించే వారు. ప్రస్తుతం వాటి ఊసేలేక కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీటికి డబ్బు చెల్లించడం లేదు.


కూలి గిట్టుబాటు కావడం లేదు

రెండు నెలలుగా ఉపాధి పనులకు వస్తున్నాం. కందకాల తవ్వకం పనులకు కూలి రూ.124 నుంచి 225 వరకు వచ్చేది. ప్రస్తుతం ఫిష్‌పాండ్‌ పనులు చేస్తున్నాం. కాని నెత్తిమోత, గట్టి తనంతో పని జరగడం లేదు. కనీసం వంద రూపాయలు రావడం లేదు. ఈ పనితో కూలి గిట్టుబాటు కావడం లేదు. వేరే పని కల్పించాలి.

- కత్తెర లింగయ్య, మహ్మదాపూర్‌


దివ్యాంగులపై పని ఒత్తిడి

గతేడాది దివ్యాంగులకు పనిలోకొంత వెసులుబాటు కలిగేది. ప్రస్తుతం కొత్త సాఫ్ట్‌వేర్‌తో కొత్త నిబంధనలతో పని ఒత్తిడి పెరిగింది. దివ్యాంగులకు 30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చి, కొలతల శాతం తగ్గించాలి.

- రాజిరెడ్డి, మహ్మదాపూర్‌


Read more