Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరసనోద్యమం

సంఘటితంగా కదిలిన ఉద్యోగవర్గాలు

జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన

కార్యాలయాల ఎదుట మెరుపు ధర్నాలు

అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

మీ కోసమే పోరాటమంటూ నినాదాలు 


తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సంఘటితంగా కదిలారు. తమకు ఇచ్చిన వాగ్దానాలను మరిచిన ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, జేఏసీ ఐక్య వేదిక పిలుపు మేరకు మంగళవారం నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. కార్యాచరణలో భాగం కాకున్నా కార్యాలయాల ఎదుట  ధర్నాలు నిర్వహించారు. అడ్డగించిన పోలీసులకు ఉద్యమ ఆవశ్యకతను విడమరచి చెప్పారు. ఉద్యోగులు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఆచరణలో చూపించారు. చివరికి ఇంత కాలం సాచివేత ధోరణిని అవలంభించిన జేఏసీ నేతలను కూడా ఇలా ఎందుకు చేశారని నిలదీశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరుబాటలో సాగుతామని ఉద్యమ స్ఫూర్తితో నినదించారు. 


  (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రవాణా, ఆర్టీసీ, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగులు, ఎన్జీవోలు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు ఎక్కడికక్కడ ఐక్యంగా ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనడం ఉద్యమ కార్యాచరణలో భాగం కాగా, అనేక ప్రాంతాల్లో విధులకు హాజరయ్యే ముందు తమ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసుల అభ్యంతరాలను కూడా ఖాతరు చేయలేదు. నేతలు కార్యాలయాలకు వచ్చినపుడు కొందరు ఉద్యోగులు ఇప్పటి వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించారు. 


కార్యాలయాల ఎదుట ధర్నాలు

విజయవాడలో సబ్‌ కలెక్టరేట్‌, ఇరిగేషన్‌, రవాణా శాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యే ముందు కార్యాలయాల ఎదుట కొద్ది సమయం ధర్నాలు కూడా నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుతో 95 శాతం ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ నల్లబ్యాడ్జీల నిరసన ఉంటుంది. 


ఆర్టీఏ కార్యాలయంలో అడ్డుకున్న పోలీసులు  

రవాణా శాఖ కార్యాలయ ఉద్యోగుల ఆందోళనను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వచ్చి ఆందోళనలు చేయటానికి అనుమతులు లేవన్నారు. దీంతో ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ఉద్యమంలో మీరు కూడా ఉన్నారని మరిచిపోవద్దంటూ పోలీసులను హెచ్చరించి, తోసుకుంటూ బయటకు వచ్చారు. ఉద్యోగుల వ్యాఖ్యలతో పోలీసులు కూడా మౌనం వహించారు. దీంతో ఉద్యోగులు కొద్దిసేపు నిరసన కొనసాగించి, కార్యాలయంలోకి వెళ్లిపోయారు. 


చర్చలు జరిపే సంప్రదాయమేది?

ఏపీ ఎన్జీవో జేఏసీ నేత విద్యాసాగర్‌ 

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యలపై జేఏసీలతో చర్చలు ప్రారంభించేదని ఏపీ ఎన్జీవో జేఏసీ పశ్చిమ కృష్ణా అఽధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. మంగళవారం ఇరిగేషన్‌ కార్యాలయాల ఆవరణలో జరిగిన ఉద్యోగుల ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఎవరైనా ఆందోళనలకు దిగినపుడు ముందుగా వారితో చర్చించటం సంప్రదాయమని, ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. ఉద్యోగులు రెండున్నర సంవత్సరాలుగా ఆర్థిక, ఆర్థికేతర సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులను చవిచూశారని, అయినా ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తూ, ప్రభుత్యానికి చాలా సమయాన్ని ఇచ్చారన్నారు. అయినా ప్రభుత్వం వారి ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. 


ఉద్యోగులను అవమానిస్తున్నారు 

జేఏసీ అమరావతి నేత వై.వి.రావు 

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వై.వి.రావు అన్నారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ నేతృత్వంలో జరిగిన ఉద్యోగుల ఉద్యమ సన్నాహక కార్యక్రమంలో వై.వి.రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల జేఏసీలు ఏడాది కాలంగా ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించుకుంటున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు కార్యాచరణకు పిలుపు ఇచ్చిన తరువాత కూడా పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తానని ఎవరో కొందరు ఉద్యోగులతో చెప్పటం ఏమి మర్యాద? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ముఖ్యమా? మీ జీతాలు ముఖ్యమా? అని మంత్రులు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఐదు డీఏలు అందకపోవటం వల్ల, జీపీఎఫ్‌ నిధులు వాడేసుకోవటం వల్ల, ఏపీజీఎల్‌ఐ సొమ్ములు చెల్లించకపోవటం వల్ల ఉద్యోగులు ఎన్నో సమస్యలను చవిచూస్తున్నారని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి, ఆ ఆలోచనే చేయడం లేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో, కారుణ్య నియామకాలను అమలు చేయటంలో సమస్యలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ విలీనం తర్వాత ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. వాటిని పరిష్కరించుకుందామంటే వినే నాథుడే లేడన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎంతో సమయం ఇచ్చిన తర్వాతే ఆందోళనలకు సిద్ధమవ్వాల్సి వచ్చిందన్నారు.

రవాణా శాఖ కార్యాలయంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా


Advertisement
Advertisement