అన్నంపెట్టిన ఇంటికే కన్నం

ABN , First Publish Date - 2022-07-17T16:08:26+05:30 IST

కూకట్‌పల్లి వివేకానందనగర్‌కాలనీలోని వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఇంటికి కాపలాగా ఉం టున్న దంపతులే చోరీకి పాల్పడినట్లు తేల్చారు.

అన్నంపెట్టిన ఇంటికే కన్నం

వాచ్‌మన్‌గా పనిచేస్తూ రూ. కోటి సొత్తు చోరీ

కదలికలు కనిపెట్టి పట్టుకున్న పోలీసులు

దంపతులు సహా మరొకరు అరెస్ట్‌


హైదరాబాద్/కూకట్‌పల్లి: కూకట్‌పల్లి వివేకానందనగర్‌కాలనీలోని వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఇంటికి కాపలాగా ఉం టున్న దంపతులే చోరీకి పాల్పడినట్లు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.కోటి విలువైన బంగారు, వెండి నగలు, నగదును స్వాధీనం చేసుకొన్నారు. వివరాలను కూకట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో శనివారం సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీలోని ఫ్లాట్‌ నెంబర్‌ 780లో నివాసముండే వడ్డేపల్లి దామోదర్‌రావు ఇంట్లో నేపాల్‌కు చెందిన చక్రధర్‌ దర్జి అలియా స్‌ చక్రి(32), సీత(25) దంపతులు 8 నెలల క్రితం పనికి చేరారు. వీరు అదే ఇంట్లోని గదిలో నివాసముంటున్నారు. సంపాదన సరిపోకపోవడంతో యజమాని ఇంట్లోనే దొంగతనం చేయాలని నిర్ణయించుకొన్నారు. దంపతులు ఇటీవల పదిరోజులు సెలవు పెట్టి పుణెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. నేపాల్‌లో ఉంటూ హోటల్‌లో పనిచేసే ఉపేంద్ర ప్రదీప్‌ షాహీ (38)కి తమ ప్లాన్‌ చెప్పి... అతడిని కూడా రమ్మని ఫోన్‌ చేశారు. దీంతో ఉపేంద్ర నేపాల్‌ నుంచి లక్నో.. అక్కడి నుంచి ఈ నెల 9న విమానంలో నగరానికి వచ్చాడు. చక్రధర్‌, సీత దంపతులు కూడా ఈ నెల 10న పుణె నుంచి నగరానికి వచ్చారు.


వీరంతా సికింద్రాబాద్‌లోని లాడ్జ్‌లో దొంగతనం ఎలా చేయాలో ప్లాన్‌ వేసుకొన్నారు. ఎర్రగడ్డ వెళ్లి తాళాలు, తలుపులు పగులగొట్టేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. ముగ్గురు ఈ నెల 12న దామోదర్‌రావు ఇంటికి వచ్చి.. తమ గదిలో ఉన్నారు. అదేరోజు రాత్రి ఇంటి యజమాని దామోదర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి కొంపల్లిలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇదే అదునుగా చక్రధర్‌, ఉపేంద్ర, సీత తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు.  యజమాని దాచుకొన్న రూ.30లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.


 పట్టుబడిందిలా..

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న కూకట్‌పల్లి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. వాచ్‌మన్‌ చక్రధర్‌, సీతతోపాటు మరోవ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు ఎస్‌ఓటీ, సీసీఎస్‌, కూకట్‌పల్లి పోలీసులు బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు. నిందితులు లక్డీకాపూల్‌ వరకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు నిఘా ఉంచారు. నిందితులు బస్సులో బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి నేపాల్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకొన్నారు. నిందితుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టిన పోలీసులు వారిని బెగళూరులో అదుపులోకి తీసుకొన్నా రు. నిందితుల నుంచి రూ.28.90లక్షల నగదు, రూ.71లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. దొంగలించిన నగదులో రూ.1.10లక్షలు ఖర్చు చేశారు.

Updated Date - 2022-07-17T16:08:26+05:30 IST