కార్మికులు కుదేలు

ABN , First Publish Date - 2022-05-01T08:12:05+05:30 IST

కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణదారుల నుంచి ఒక శాతం సెస్‌ వసూలు చేస్తున్నారు. గత మూడేళ్లలో ఏటా రూ.800 కోట్ల చొప్పున దాదాపు రూ.2500 కోట్లు వసూలు చేశారు. అయితే, ఆ నిధులు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి. ఇతర పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టుగానే

కార్మికులు కుదేలు

సంక్షేమాన్ని గాలికొదిలేసిన సర్కారు

భవన నిర్మాణ, ఇతర కార్మికుల బోర్డ్డు నిర్వీర్యం

గతంలో ఉన్న పథకాలకు మంగళం 

పెళ్లికానుక, ప్రసూతి ప్రయోజనాల్లేవ్‌

ప్రమాద మరణాలకూ అందని బీమా

గాయపడితే ఆదుకునే దిక్కే లేదు 

కరోనా కల్లోలంలోనూ పట్టించుకోని వైనం 

వసూలైన సెస్‌ రూ.2500 కోట్లు పక్కదారి!


భవన నిర్మాణ, ఇతర కార్మికులకు అందించే పెళ్లికానుక ఏదీ? ప్రసూతి ప్రయోజనం కింద అందజేసే రూ.20 వేల సాయం ఏమైంది? జగనన్న అధికారంలోకి వచ్చాక అటకెక్కాయి. గతంలో కార్మికులు ప్రమాదంలో మరణించినా, వైకల్యం సంభవించినా సాయం చేసేవారు. ఇప్పుడు అవన్నీ బంద్‌ చేశారు. చివరకు కార్మికుల అంత్యక్రియలకు ఇచ్చే రూ.20 వేల సాయం కూడా ఆపేశారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు వైసీపీ సర్కారు మంగళం పాడేసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణదారుల నుంచి ఒక శాతం సెస్‌ వసూలు చేస్తున్నారు. గత మూడేళ్లలో ఏటా రూ.800 కోట్ల చొప్పున దాదాపు రూ.2500 కోట్లు వసూలు చేశారు. అయితే, ఆ నిధులు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి. ఇతర పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టుగానే ఏపీ భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు నిధులనూ పక్కదారి పట్టించిందనే విమర్శలున్నాయి. కార్మికుల సంక్షేమ కోసం వినియోగించాల్సిన నిధులను వాడుకుని వారి కడుపు కొడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి కార్మికులను ఆదుకునే బోర్డును నిర్వీర్యం చేసింది.


అంతేగాక నవరత్నాల మాటున కార్మికుల సంక్షేమానికి గండి కొట్టింది. ఓ వైపు ఇసుక కొరత.. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభణతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఉపాధి లేక కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోగా.. గతంలో ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేసింది. కార్మికులకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లను ఎత్తేసింది. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలనూ ఆపేసింది. దీంతో 22 లక్షల మంది భవన నిర్మాణ, ఇతర కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 


పేరుకే కార్మికుల సంక్షేమ బోర్డు 

కార్మికుల సంక్షేమానికి కల్పతరువుగా ఉన్న ఏపీ భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బోర్డుకు సంబంధించి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందనే విమర్శలున్నాయి. బోర్డు చైర్మన్‌గా కార్మిక శాఖ మంత్రిని, ముఖ్య అధికారిగా ఆ శాఖ కమిషనర్‌ను నియమించి ఇష్టారీతిగా పాలన సాగిస్తున్నారు. వాస్తవానికి ఈ బోర్డుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 22 లక్షల మంది కార్మికులు రిజిస్టర్‌ అయిన ఈ బోర్డుకు భవన నిర్మాణదారులు చెల్లించే వందల కోట్ల రూపాయిలు ఏటా సెస్‌ రూపంలో ఆదాయం వస్తుంది. 


పెళ్లికానుక కట్‌ 

ఏపీ భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డులో 33 రకాల నిర్మాణ పనులకు చెందిన 20 లక్షల మందికి పైగా కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బోర్డు ద్వారా వారికి అందాల్సిన ఏ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. గతంలో భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుక కింద బోర్డు రూ.20 వేల రూపాయిలు అందించేది. కార్మికులుగా నమోదైన వారికి, వారి ఇద్దరి ఆడపిల్లలకు వర్తింపజేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రకులాలకు మినహాయించి మిగిలిన అన్ని కులాలకు చంద్రన్న పెళ్లికానుక పేరుతో రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా అందించారు. అగ్రవర్ణాల కార్మికులకు బోర్డు ద్వారా వివాహ కానుక అందించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న పెళ్లికానుక పేరును వైఎ్‌సఆర్‌ పెళ్లికానుకగా మార్చింది. కొన్నికులాలకు కానుక మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయితే మొత్తంగా పథకం అమలు కాకుండా నిలిపేసింది. వైఎ్‌సఆర్‌ పెళ్లి కానుక రాకపోగా, బోర్డు ఇస్తున్న వివాహ కానుకనూ ఆపేసింది. 


ప్రసూతి ప్రయోజనం బంద్‌ 

గతంలో కార్మికులకు ప్రసూతి ప్రయోజనం కింద బోర్డు రూ.20 వేలు అందజేసేది. కార్మికులకు, వారి ఆడబిడ్డలు ఇద్దరికి ప్రయోజనం కల్పించేది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లయిం కోసం ఏ దరఖాస్తునూ స్వీకరించలేదు. మొదట్లో స్వీకరించిన రెండున్నర లక్షల దరఖాస్తులకు అతీగతీ లేదు. 


పరిహారం లేదు.. సాయమూ లేదు 

గతంలో ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు బోర్డు బీమా పరిహారం అందజేసేది. సహజ మరణమైతే రూ.60 వేలు, ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా రూ.5 లక్షల పరిహారం ఇచ్చేది. ఈ ఏడాదిలో ఒక్క క్లయిం కూడా కార్మికుల కుటుంబాలకు దక్కలేదు. దరఖాస్తులను స్వీకరించే దిక్కే లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. గతంలో కార్మికులు ప్రమాదంలో గాయపడిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకున్న సమయానికి బోర్డు పరిహారం అందజేసేది. రోజుకు రూ.100 చొప్పున మూడు నెలల పాటు రూ.9 వేలు ఇచ్చేది. దీంతో కార్మికులకు ఉపశమనం కలిగేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. బోర్డులో రిజిస్టర్‌ కాని కార్మికులను కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గతంలో ఆదుకునేవారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలు, 50 శాతం పైన వైకల్యం చెందిన వారికి రూ.20 వేలు, 50 శాతం లోపు వైకల్యం చెందిన వారికి రూ.10 వేలు పరిహారం అందించేవారు. ఇప్పుడు ఇవేవీ అమలు కావడం లేదు. చివరకు మరణించిన కార్మికులకు అంత్యక్రియలకు ఇచ్చే రూ.20 వేలు కూడా చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్పులు సైతం ఆపేశారు. 


ఆత్మహత్యలపైనా బుకాయింపు 

ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక పాలసీ అంటూ ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించింది. దీంతో నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేయాల్సి వచ్చింది. దీనికితోడు సిమెంట్‌, స్టీల్‌ ధరలు పెరగడంతో నిర్మాణ భారం పెరిగిపోయింది. ఇక కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో భవన నిర్మాణ, ఇతర కార్మికులు ఉపాధి లేక వీధిన పడ్డారు. కార్మికుల పరిస్థితి దుర్భరమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇతర కారణాలతో మరణించారని బుకాయించింది. కేంద్ర భవన నిర్మాణ బోర్డు చొరవతో గుంటూరు జిల్లాలో మాత్రం కొన్ని బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించగలిగారు. ఇతర జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను పట్టించుకోలేదు. కరోనా లాక్‌డౌన్‌లో ఉపశమనం కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఇచ్చిన నిధుల్లో ఒక్కపైసా కూడా కార్మికులకు చెల్లించలేదు. కార్మికులందరికీ బ్యాంకు అక్కౌంట్లు లేవని, ఆధార్‌తో అనుసంధానం కాలేదని కేంద్రానికి నివేదిక పంపారు. 

Updated Date - 2022-05-01T08:12:05+05:30 IST