ఎస్పీఎం గేటు ఎదుట కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2021-04-18T04:44:13+05:30 IST

కార్మికులకు, ఎస్పీఎం యాజమాన్యానికి మధ్య శనివారం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.

ఎస్పీఎం గేటు ఎదుట కార్మికుల నిరసన
మిల్లు గేటు ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులు, కార్మికులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 17:  కార్మికులకు, ఎస్పీఎం యాజమాన్యానికి మధ్య శనివారం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. యాజమాన్యం ఒత్తిడితేవడంతోనే చర్చలు వాయిదా వేశారని కార్మికులు మిల్లు గేటు ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మిల్లు ప్రారంభించినప్పుటి నుంచి కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయితే శనివారం జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ చర్చలు జరిపేందుకు  వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. కానీ జేఎల్‌సీ పర్యటనవాయిదా పడింది. ఈసందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ మిల్లు ప్రారంభమై రెండేళ్లు దాటినప్పటికీ తమను ఇంకా విధుల్లోకి తీసుకోవడం లేదన్నారు. కేవలం యాజమాన్యం నిరంకుశ వైఖరివల్లనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, అధికారులు స్పందించి తమను విధుల్లోనికి తీసుకునేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.కార్యక్రమంలో నాయకులు, కార్మికులు సూర్యప్రకాష్‌, యాదగిరి, షబ్బీర్‌ హుస్సేన్‌, అంబాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T04:44:13+05:30 IST