కుప్ప‘కూలి’..పోతున్నారు!

ABN , First Publish Date - 2022-05-22T05:18:05+05:30 IST

ఎండల తీవ్రతతో ఉపాధిహామీ కూలీలు కుప్పకూలిపోతున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పనులు జరిగే చోట కనీస సౌకర్యాలు కరువయ్యాయి. టెంట్లు, చలువ పందిర్లు లేకపోవడంతో వేతనదారులు మండుటెండలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పనులు చేసిన దగ్గర తాగునీరు, మజ్జిగను అందించేవారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీటికి నిధులు ఇవ్వడం లేదు.

కుప్ప‘కూలి’..పోతున్నారు!
మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

 పనుల వద్ద కానరాని టెంట్లు
 వడదెబ్బతో మృతి చెందుతున్న కూలీలు
(మెళియాపుట్టి)

 గత నెల 13న మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి చెందిన పొందర పార్వతి అనే వేతనదారురాలు ఎండలో పని చేస్తూ వడదెబ్బకు గురై కింద పడిపోయింది. తోటి కూలీలు వెళ్లి చూసేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

 ఈ నెల 4న హిరమండలం మండలం మర్రిగూడ పంచాయతీ బొండిగూడ గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారుడు సవర లింగయ్య పనులు చేస్తుండగా.. వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డాడు. ఎండకు తట్టుకోలేక పని చేసిన చోటే కుప్పకూలిపోయాడు.

 ఈ నెల 20న మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలరావు.. ఉపాధి పనులు చేస్తూ వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన కాలు దెబ్బతినగా.. ప్రస్తుతం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

ఇలా.. జిల్లాలో చాలా మండలాల్లో వేతనదారులు మండు టెండలో చెమటోడ్చి వడదెబ్బకు గురవుతున్నారు. వీరిలో కొందరు ఆస్పత్రుల పాలవ్వగా.. మరికొందరు అక్కడికక్కడే మృతి చెందుతున్నారు.  

ఎండల తీవ్రతతో ఉపాధిహామీ కూలీలు కుప్పకూలిపోతున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పనులు జరిగే చోట కనీస సౌకర్యాలు కరువయ్యాయి. టెంట్లు, చలువ పందిర్లు లేకపోవడంతో వేతనదారులు మండుటెండలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పనులు చేసిన దగ్గర తాగునీరు, మజ్జిగను అందించేవారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీటికి నిధులు ఇవ్వడం లేదు. కొలతల ప్రకారం పనులు చేయకపోతే కూలీ గిట్టుబాటు కాదని వేతనదారులు ఎండలో పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 5,25,499 జాబ్‌కార్డు దారులు, 32,958 శ్రమైక్యసంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం జాబ్‌కార్డులు ఉన్న వారందరికీ పనులు దొరకడం లేదు. కేవలం 9 వేల మందే ప్రతిరోజూ పనులకు వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం రోజుకు ఏడు గంటలు పనిచేయాలి. వేసవిలో మట్టిని తవ్వడం కష్టం కనుక వేతనదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో తాగునీటికి రూ.5, గునపాంకి రూ.10, తట్టకి రూ.13 చెల్లించేది. 70 శాతం పనులు చేస్తే మిగిలిన 30 శాతం వేసవి భత్యం కింద కలిపి మొతం 100 శాతం కూలీలకు చెల్లించేవారు. ఈ ఏడాది వేసవి భత్యాన్ని రద్దు చేశారు. దీంతో అధికంగా శ్రమిస్తే తప్ప రోజుకు రూ.200 వేతనం రాని పరిస్థితి నెలకొంది. అందుకే మండు టెండలో సైతం పని చేస్తూ వడదెబ్బకు గురవుతున్నారు. కాగా, ఇటీవల 748 టెంట్లను సరఫరా చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచినా ఇంతవరకు అవి పంపిణీ జరగలేదు. ప్రతి ఏడాది తాగునీరుకు రూ.30 లక్షలు, మజ్జిగకు రూ.30 లక్షలు, టెంట్లు కొనుగోళ్లకు రూ.60లక్షలు ఖర్చు చేసేవారు. ప్రస్తుతం కేంద్ర పభుత్వం వీటికి నిధులు ఆపేసింది. దీంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. ‘ఉపాధి’ పనులు చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.  

 సౌకర్యాలు కల్పిస్తున్నాం
పనులు చేసే ప్రదేశంలో సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.  నీరు, మజ్జిగ పంపిణీకి నిధులు రావడం లేదు.  పనులకు వచ్చినప్పుడు నీరు తీసుకురావాలని  వేతదారులకు చెబుతున్నాం.
- టి.రవి, ఏపీవో మెళియాపుట్టి

 వేసవి భత్యం ఇవ్వాలి
గతంలో వేసవిలో ఉదయం, సాయంత్రం రెండు గంటలు పనిచేస్తే రూ.400 వరకు వచ్చేది. ప్రస్తుతం 5 గంటల వరకు పని చేస్తున్నా రూ.200 వేతనం దాటడం లేదు. దీంతో  కష్టంగా అనిపిస్తుంది.  
 - కవిటి రామస్వామి, పట్టుపురం, మెళియాపుట్టి 

కష్టంగా ఉంటుంది
వేసవిలో పని చేయడం కష్టమవుతుంది.  కొలతల ప్రకారం పనులు చేయకపోతే వేతనం గిట్టుబాటు కాదు. అందుకే మండుటెండలో కూడా పని చేస్తున్నాం. దీంతో కొందరు వడదెబ్బకు గురవుతున్నారు. తాగునీరు, మజ్జిగకు  డబ్బులు ఇస్తే మంచిది.
-కె.వనజాక్షి, పట్టుపురం, మెళియాపుట్టి
 
 
 

Updated Date - 2022-05-22T05:18:05+05:30 IST