Abn logo
Sep 24 2021 @ 23:14PM

ఉపాధి కోసం ఆందోళన చేస్తూ కార్మికుడి మృతి

మృతదేహం వద్ద కార్మికులు, కుటుంబ సభ్యులు

పెందుర్తి రూరల్‌, సెప్టెంబరు 24: కోల్పోయిన ఉపాధిని తిరిగి కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టి ఆ శిబిరంలోనే గుండెపోటుతో మృతి చెందిన ఓ కార్మికుడి ఉదంతమిది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం ఆటో నగర్‌ పీఎస్‌ఎల్‌ కంపెనీ వద్ద శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పీఎస్‌ఎల్‌ కంపెనీలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కార్మికులు కొన్ని రోజుల నుంచి కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం ఆందోళనలో పాల్గొన్న అక్కిరెడ్డిపాలేనికి చెందిన సూర్యప్రకాశ్‌ పట్నాయక్‌ గుండెపోటుతో శిబిరంలోనే కుప్పకూలి పోయారు. దీంతో తోటి కార్మికులు, మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను ఉధృతం చేశారు. సమాచారం తెలిసి ఏసీపీ శ్రీపాదరావు, పెందుర్తి సీఐ అశోక్‌ కుమార్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.