సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-08-08T08:06:30+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు చాలా ఉన్నాయని సంబంధితశాఖలకు పంపి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌ అన్నారు. గవర్నర్‌ ఆదివారం తెలంగాణ విశ్వ విద్యాలయాన్ని సందర్శించి అధ్యాపకులతో సమీక్షించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌  

టీయూ సందర్శన 

విద్యార్థులతో ముఖాముఖి 

సమస్యలను ఏకరువు పెట్టిన విద్యార్థులు

నిజామాబాద్‌,ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు చాలా ఉన్నాయని సంబంధితశాఖలకు పంపి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌ అన్నారు. గవర్నర్‌ ఆదివారం తెలంగాణ విశ్వ విద్యాలయాన్ని సందర్శించి అధ్యాపకులతో సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో పేరు వచ్చేవిధంగా తన వంతు కృషిచేస్తానని అన్నారు. ఛాన్స్‌లర్‌ హోదాలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో కనిస వసతులను కల్పించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని ఆమె అన్నారు. విశ్వవిద్యాయాలనికి కనీసం ఆడిటోరియం కూడా లేని పరిస్థితి ఉందని విద్యార్థులకు క్రీడలు, పరిశోధన రంగంలో ప్రోత్సాహం అందించాలని వాటికి సంబంధించిన ఏర్పాట్లను విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేయాలని అన్నారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, సిబ్బంది వీటిపై దృష్టిపెట్టాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులమీదే కాకుండా పూర్వ విద్యార్థుల సహాయంతో వసతులు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. విశ్వవిద్యాలయం న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఉండే విధంగా అధ్యాపకులు అకాడమిక్‌ రంగంలో కృషిచేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంతో పాటు ప్లేస్‌మెంట్‌ వచ్చే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. పరిశోధనలకు అవసరమైన నిధులను రాబట్టేందుకు అధ్యాపకులు కృషిచేయాలని అన్నారు. విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ హోదాలో విద్యార్థులు తనకు ఇచ్చిన విన్నపాలను పరిశీలించడంతో పాటు అవి పరిష్కారం అయ్యేవిధంగా కృషిచేస్తానని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంను ఉన్నత విద్యలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. అన్ని విభాగాలలో మౌలిక వసతులను కల్పించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు జాతీయ స్థాయిలో పోటిపడే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆమె ఆదేశించారు. ఛాన్స్‌లర్‌ హోదాలో తాను విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా అధ్యాపకులు ఇతర సంస్థల నుంచి నిధులు తీసుకువచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులను పరిశోధన సంస్థలకు తీసుకువెళ్లాలన్నారు. అక్కడ జరిగే పరిశోధనలను వారికి వివరించడంతో పాటు వారి సబ్జెక్టుల్లో అత్యధునిక పరిశోధనలు ఏం జరుగుతున్నాయో వివరించాలని సూచించారు. ఇతర విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేసి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపైన విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.

సమస్యలను విన్నవించిన విద్యార్థులు

విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి దశాబ్దంన్నర గడిచిన ఇంకా సౌకర్యాలు సరిపడా లేవని విద్యార్థులు గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు. విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు ఏ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీచేయలేదని గవర్నర్‌కు విన్నవించారు. విశ్వవిద్యాలయంలో కనీస వసతులు లేవని వచ్చేందుకు రవాణా పరమైన ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కారించాలని గవర్నర్‌ కోరారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు కరోనా వచ్చి వీసీ పట్టించుకోలేదని గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. ఇంటర్‌నేషనల్‌ కాన్పరెన్స్‌ పెట్టి విద్యార్థులను ఇళ్లకు పంపించారని అన్నారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు అవకాశం ఇస్తూనే స్పోర్ట్స్‌, ప్లేస్‌మెంట్‌లకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని ఆమెను కోరారు. 

కార్యక్రమంలో పాల్గొనని కలెక్టర్‌, సీపీ

జిల్లాకు మొదటిసారి వచ్చిన గవర్నర్‌ తమిళి సై కార్యక్రమంలో కలెక్టర్‌, సీపీ పాల్గొనలేదు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీపీ అరవింద్‌ బాబుతో పాటు ఇతర అధికారులు రైల్వెస్టేషన్‌లో స్వాగతం పలికారు. బాసర వరకు అన్ని ఏర్పాట్లను చేశారు. అక్కడి నుంచి తెలంగాణ విశ్వ విద్యాలయం వచ్చిన సమయంలో కూడా వారు పాల్గొనలేదు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డీవో రవి, ఏసీపీలు వెంకటేశ్వర్లు, రామారావులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనేక మంది విద్యార్థులు బయటే

విశ్వవిద్యాలయానికి గవర్నరు వచ్చి విద్యార్థులతో ఇంటరాక్షన్‌ జరిగే సమయంలో ఆడిటోరియం సరిపోకపోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు బయటనే ఉన్నారు. విశ్వవిద్యాలయానికి మొదటిసారి వచ్చిన గవర్నరును కలిసేందుకు ప్రయత్నంచేసిన స్థలం సరిపోకపోవడంతో ఎక్కువ మందిబయటనే ఉన్నారు. విశ్వవిద్యాలయంలో పెద్ద ఆడి టోరియం లేకపోవడం వేరే ఇతర ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-08-08T08:06:30+05:30 IST