రైతు శ్రేయస్సు కోసమే పని చేయాలి

ABN , First Publish Date - 2022-09-22T05:21:12+05:30 IST

దేశాన్ని పాలించే ప్రభుత్వాలు రైతు శ్రేయస్సు కోసమే పని చేసేలా ఉండాలని, రైతులను నట్టేట ముంచే విధంగా విధివిధానాలు రూపొందించరాదని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పీకర్‌ రాకతో నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు.

రైతు శ్రేయస్సు కోసమే పని చేయాలి
మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ టౌన్‌, సెప్టెంబరు 21: దేశాన్ని పాలించే ప్రభుత్వాలు రైతు శ్రేయస్సు కోసమే పని చేసేలా ఉండాలని, రైతులను నట్టేట ముంచే విధంగా విధివిధానాలు రూపొందించరాదని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పీకర్‌ రాకతో నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నెర్రె నర్సింలు, వైస్‌ చైర్మెన్‌ రాజశేఖర్‌, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికే వెన్నెముకలా నిలిచిన రైతన్నను కేంద్రం తమ విధివిధానాలతో నడ్డీ విరుస్తోందని, దేశానికి అన్నం పెట్టాలనుకుంటున్నారా.. సున్నం పెట్టాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కోరుతుందని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒప్పుకోలేదన్నారు. అంతేకాకుండా పంటల ఉత్పత్తుల కొనుగోలు నుంచి తప్పుకోవాలని కేంద్రం చూస్తోందని, పంట ఉత్పత్తుల కొనుగోళ్లను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి కుట్రలు చేస్తోందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 30.47 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తయితే 2021 నాటికి 1.23 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో వ్యవసాయ విస్తీర్ణం పెరుగుదలలో 190 శాతంతో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. మార్కెట్‌ కమిటీలు రైతులకు అండగా నిలవాలని, రైతుల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చాలన్నారు. అంతేకాకుండా రైతులకు పంట సాగుపై, పంట మార్పిడి విఽధానంపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించడానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్‌ కల్పిస్తోందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పుణ్యమా అని రైతులకు 24 గంటల కరెంటు, సాగునీరు, ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి సహాయం అంద జేయడంతో పాటు రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ నేనే పోటీ చేస్తా..
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో బాన్సువాడ నుంచి తానే పోటీ చేస్తానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన పట్టణంలోని సరస్వతీ ఫంక్ష న్‌హాల్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. అది కేవలం సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమవుతుందన్నారు.

Updated Date - 2022-09-22T05:21:12+05:30 IST