వర్క్‌ ఫ్రమ్‌ హోం : ఇది చాలా సింపుల్‌.. పవర్‌ఫుల్‌..!

ABN , First Publish Date - 2021-05-27T17:06:13+05:30 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలమిది. ఇంట్లోనే వర్క్‌ స్టేషన్‌ ఏర్పాటుచేసుకుని రోజుకు

వర్క్‌  ఫ్రమ్‌ హోం : ఇది చాలా సింపుల్‌.. పవర్‌ఫుల్‌..!

  • ‘డెస్క్‌’ ముందు కూర్చొని వ్యాయామం 
  • వర్క్‌  ఫ్రమ్‌ హోంకు అనుకూలం

హైదరాబాద్‌ సిటీ : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలమిది. ఇంట్లోనే వర్క్‌ స్టేషన్‌ ఏర్పాటుచేసుకుని రోజుకు కనీసం 8-10 గంటలు కదలకుండా పనిచేసే వారు ఎంతోమందిప్పుడు. ప్రతి రోజూ అలా కదలకుండా పనిచేయడం వల్ల ఆరోగ్య పరంగా సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. డెస్క్‌ జాబ్‌లు చేసేవారితో పాటుగా మొబైల్‌ ఫోన్లకు అంటిపెట్టుకుపోతున్న నేటి తరం కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు వీలైనంత వరకూ రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. డెస్క్‌లకు అతుక్కుపోయే వారికి ఆ డెస్క్‌ వద్దనే అతి సులభంగా చేసే వ్యాయామాలూ కూడా ఉన్నాయి. ప్రతి 20-30 నిమిషాలకు బ్రేక్‌ తీసుకునే సమయంలో ఈ వ్యాయామాలలో కొన్ని అయినా అనుసరించి ఫిట్‌గా ఉండొచ్చంటున్నారు రీబాక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ హరీష్‌. అందుకు ఆయన అందిస్తున్న సూచనలేమిటంటే...


మణికట్టుకూ వ్యాయామం కావాలి...

కీబోర్డ్‌ మీద టైప్‌ చేసేటప్పుడు ఎక్కువ పనిచేసేది ముంజేతులే. అందువల్ల వాటికి వీలైనప్పుడల్లా రెస్ట్‌ ఇవ్వాలి. ముందుగా ఓ చేతిని స్ట్రెచ్‌ చేయాలి. ముంజేతిని భుజాల వరకూ తీసుకువచ్చి పూర్తిగా స్ట్రెచ్‌ చేయాలి. ఆ తరువాత చేతులను పూర్తిగా కిందికి వదిలేయాలి. ఈ విధంగా ఒకటి రెండుసార్లు చేస్తే చాలు.


కష్టపడేది భుజాలే...

నిజానికి డెస్క్‌జాబ్‌ చేసే వారికి భుజాలు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. వీలైనప్పుడల్లా వీటికి విశ్రాంతి కల్పించాల్సి ఉంటుంది. ఈ భుజాలకు అతి సులభంగా వ్యాయామం అందించాలంటే.. నిటారుగా నిల్చుని భుజాలను వీలైనంతగా వెనక్కి ఉంచి ఒకటి రెండు సెకన్లు ఉంచడం. శరీర ఒత్తిడికి ఇది ఉపశమనం కల్పిస్తుంది.


ఎక్కువసేపు కూర్చుంటే.. 

ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటే లోయర్‌ బ్యాక్‌ నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. కుర్చీలో కూర్చునే అప్పుడప్పుడూ మీకు సౌకర్యంగా ఉన్నంత మేరకు శరీరాన్ని తిప్పడం ద్వారా ఈ నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.


డెస్క్‌ కూడా ఉపయోగమే.. 

చేతులను డెస్క్‌పై ఉంచి కాళ్లు, నడుం వంచడం ద్వారా వ్యాయామాలు చేయవచ్చు. డెస్క్‌ సాయంతో స్ట్రెచెస్‌, బెండ్స్‌ వంటివన్నీ కూడా చేసుకోవచ్చు.


కాళ్లకూ పని కల్పించాలి..

ఎనిమిది గంటలు పనిచేసినప్పుడు చేతులే కాదు.. కాళ్లు కూడా ఎక్కువగా అలిసిపోతాయి. కాబట్టి వాటికి వీలైనంతగా వ్యాయామం కల్పించడానికి స్ట్రెచెస్‌ లేదంటే పాదాలను క్లాక్‌ వైజ్‌ లేదంటే యాంటీ క్లాక్‌ వైజ్‌గా తిప్పితే చాలు. వీటితో పాటుగా లెగ్‌ లిఫ్ట్స్‌ కూడా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. 


పుస్తకాలతోనూ చేయొచ్చు 

మీ డెస్క్‌ వద్ద ఎవరూ లేకపోతే కాస్త లావుగా ఉన్న పుస్తకం నెత్తి మీద పెట్టుకుని చేతులను పైకి లేపి కొన్ని సెకన్లు ఉంచడం చేసి ఆ తరువాత నెమ్మదిగా తల వెనుక పెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడం వల్ల ట్రైసె్‌ప్సకు మంచి వ్యాయామం లభిస్తుంది.

Updated Date - 2021-05-27T17:06:13+05:30 IST