అలా కూర్చుంటే కుదరదు!

ABN , First Publish Date - 2020-05-06T05:30:00+05:30 IST

ఈ ‘కొవిడ్‌’ కాలంలో చాలామంది ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’లో తలమునకలై... గంటలకు గంటలు గ్యాడ్జెట్‌లపై గడుపుతున్నారు. అయితే ఒక పద్ధతి పాడూ లేకుండా ఎలా పడితే అలా కూర్చొని పని చేయడమంటే...

అలా కూర్చుంటే కుదరదు!

ఈ ‘కొవిడ్‌’ కాలంలో చాలామంది ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’లో తలమునకలై... గంటలకు గంటలు గ్యాడ్జెట్‌లపై గడుపుతున్నారు. అయితే ఒక పద్ధతి పాడూ లేకుండా ఎలా పడితే అలా కూర్చొని పని చేయడమంటే లెక్కకు మించిన ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


  1. ఇంటి నుంచి పని అనగానే చాలామంది మంచంపైనో, సోఫాలోనో కూర్చొని చేస్తుంటారు. మరికొందరు ఒక పక్కకు వాలిపోయి కష్టపడుతుంటారు. వీటివల్ల వెన్ను, భుజం, మెడ నొప్పులు వస్తాయి. 
  2. ఒకేచోట గంటల తరబడి కదలకుండా కూర్చోవడం కూడా మంచిది కాదు. రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. కూర్చొనే భంగిమ సరిగ్గా లేకపోతే ఊపిరితిత్తులలోకి శ్వాస సరిగ్గా అందదు. ఇది భవిష్యత్తులో ఎన్నో వ్యాధులకు కారణమవుతుందని ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ అశ్విన్‌ బోర్కర్‌ చెబుతున్నారు. 
  3. ఎక్కువసేపు ముందుకు కూలబడి కూర్చోవడం వల్ల కడుపులో ఉండే అవయవాలు కుంచించుకుపోయి జీర్ణకోశంలో సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో అలసట, జీవక్రియ మందగించడం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి. 
  4. గ్యాడ్జెట్లు ఎక్కువగా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఏ భంగిమలో కూర్చోవాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? 
  5. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా అటూ ఇటూ కదులుతుండాలి. అలాగే భంగిమలు కూడా మారుస్తుండాలి. 
  6. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, లేదా మొబైల్‌పై పనిచేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వంగిపోకూడదు. మెడ కూడా మరీ కిందకు వంచకూడదు. దానివల్ల మెడ, వెన్ను, భుజం నొప్పులు వస్తాయి. 
  7. సరైన పొజిషన్‌లో కూర్చోవడంవల్ల శరీరానికే కాదు, మీరు మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఆఫీసులో ఎలా కూర్చొనేవారో అదే పద్ధతిలో ఇంట్లో కూడా ప్రయత్నించండి. 
  8. కంప్యూటర్‌పై పని చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది అరచేతులకు సపోర్ట్‌. అలాగే మోచేతులు 90 డిగ్రీలు వంచి, హ్యాండ్‌ రెస్ట్‌ ఉండేలా ఏర్పాట్లు చేసుకోండి. 
  9. రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి ప్రతి 20 నిమిషాలకొకసారి లేచి, కాసేపు నిలుచోండి. 
  10. కూర్చొన్న చోట కూడా అప్పుడప్పుడూ కాస్త తల పక్కకు తిప్పి, చేతులకు విశ్రాంతి ఇస్తుండండి. సరైన శ్వాస పద్ధతులు అవలం బించండి. 

Updated Date - 2020-05-06T05:30:00+05:30 IST