వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారిలో చాలా మందికి ఇదే సమస్య..

ABN , First Publish Date - 2021-05-07T13:17:21+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తరువాత చాలామంది ఇళ్ల నుంచి పని చేస్తున్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారిలో చాలా మందికి ఇదే సమస్య..

  • ఇంటి నుంచి పని.. వెన్నుకు హాని
  • బ్యాక్‌పెయిన్‌ బారిన పడుతున్న నవతరం
  • ఏకధాటిగా వర్క్‌ చేయడం శ్రేయస్కరం కాదంటున్న డాక్టర్లు
  • వ్యాయామాలతో  వెన్నునొప్పి బారిన పడకుండా..
  • ఉండొచ్చంటున్న ఫిట్‌నెస్‌ నిపుణులు

కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తరువాత చాలామంది ఇళ్ల నుంచి పని చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు మాత్రమే కాదు.. ఇతర రంగాలలోనూ ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేయడానికే ఆసక్తి చూపుతున్నారు. వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ ఆరంభించిన తొలి నాళ్లలో అంతా ఆనందంగానే కనిపిస్తుంది కానీ, తరువాతనే అసలు సమస్యలు ఆరంభమవుతున్నాయి. మెడ పట్టేయడం, వెన్ను నొప్పి, కళ్లు లాగడం... ఒకటేమిటి, ఎన్నో సమస్యలు  కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరిట ఇళ్లకే పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులలో ఇప్పటికే చాలామంది వెన్ను సమస్యలతో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్లు తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌ల ముందు గడపడం, వెన్నుకు సరిపడా మద్దతునందించే కుర్చీ లేకపోవడం, కూర్చునే భంగిమ వంటి అంశాలు ఈ వెన్నునొప్పికి కారణాలుగా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు.


పనిమీదే ప్రేమ... శరీరంపై లేదా..

నగరంలోని ఓ ఆస్పత్రిలో సేవలనందిస్తోన్న కుమార్‌ మాట్లాడుతూ తన దగ్గరకు వస్తోన్న వారిలో అధికశాతం మంది మెడ, వెన్ను సమస్యలతో వస్తున్న వారే ఉంటున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఆఫీసులో డెస్క్‌లపై ఉన్న సౌకర్యం ఇంట్లో లభించదని, చాలామంది వేళ్ల నొప్పులు, వెన్నునొప్పి సమస్యలతో వస్తున్నారన్నారు. అది పోవాలంటే సౌకర్యవంతంగా కుర్చీలో కూర్చుని, వెన్ను కుర్చీ వెనుకకుతాకుతూ, చెవులు రెండు భుజాల మీద ఉంటూనే ల్యాప్‌టా్‌పను నేరుగా చూడగలిగేలా ఉండాలని సూచించారు. ఇలా కాకుండా మరీ మెడ కిందకు వంచితే అది మెడ, భుజాల నొప్పులకు కారణమవుతుందన్నది డాక్టర్ల భావన. ఈ నవతరం యువత పనిమీద ఉన్న శ్రద్ధ తమ ఒంటిమీద ఎక్కడా చూపదని యోగా శిక్షకులు రవి ప్రశ్నిస్తున్నారు. సింపుల్‌ యోగా, లేదంటే స్ట్రెచె‌స్‌తో వెన్ను సమస్యలకు దూరంగా ఉండొచ్చన్నారు.


మూడు అంశాలు కీలకం..

బ్యాక్‌ లేదంటే నెక్‌ పెయిన్‌ లాంటి వాటి బారిన పడకుండా  ఉండాలంటే ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నది నిపుణుల మాట. అందులో మొదటిది పోశ్చర్‌ (భంగిమ) అయితే రెండవది పొజిషన్‌ (స్థానం) మార్పులు. మూడవది కూర్చునే ఆసనం ఎత్తు. ఈ మూడు సరిగా ఉంటే వెన్నునొప్పి బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. -హైదరాబాద్‌ సిటీ


ఇలా చేయండి...

  • ల్యాప్‌టాప్‌ ఉంది కదా అని అన్నీ టైప్‌ చేయటానికి ప్రయత్నించవద్దు. వాయిస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించండి. కనీసం కొంత టెక్ట్స్‌, ఈమెయిల్స్‌ కోసం దీనిని వాడినా ఆ మేర మీ చేతులకు విశ్రాంతి లభించినట్లే.
  • కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చోవాలి. ఒకవేళ మీ కుర్చీకి మీ వెన్ను దిగువ భాగంలో సరైన మద్దతు లభించకపోతే, కుషన్‌‌లు వాడొచ్చు.
  • కుర్చీలో కూర్చున్నప్పుడు మీ పాదాలు పూర్తిగా నేలపై ఆనించి ఉండాలి. అలా కుదరనప్పుడు ఫుట్‌ రెస్ట్‌ వాడొచ్చు.
  • ఒకే భంగిమలో కూర్చోవడం మంచిది కాదు. మెడ, భుజం, వెన్నునొప్పి కలుగ కూడదనుకుంటే ఇంటిలో డైనింగ్‌ టేబుల్‌ మొదలు స్టడీ టేబుల్‌ వరకూ అన్నీ వాడేయాల్సిందే. ఒకే స్థానంపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం కీలకం.
  • ఇంట్లో సౌకర్యంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. మీ సీటు కింద సౌకర్యం కోసం దిండు కూడా ఉంచుకోవాలి. కుర్చీలో మరింత సౌకర్యం కోసం మీ సాధారణ కుర్చీలో టవల్స్‌ లాంటివి పెట్టుకోవచ్చు.
  • కనీసం ప్రతి 30-40 నిమిషాలకూ ఒకసారి కుర్చీలో నుంచి లేచి కాస్త నడవడం చేస్తే మంచిది. అలాగే స్ట్రెచెస్‌ కూడా చేయొచ్చు. దీనితో ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.

వెన్నుబలంగా ఉండాలంటే...

వ్యాయామాలతో శరీరం ఫిట్‌గా చేసుకోవచ్చు. వెన్ను బలంగా ఉండటానికీ వ్యాయామాలు తోడ్పడతాయి. రోజూ 30నిమిషాల నడకతో వెన్నుముక కూడా శక్తివంతం అవుతుంది. అలాగే వెన్నుకు మద్దతునందించే కండరాలు కూడా శక్తివంతం అవుతాయి. ఇది కాకుండా బ్రిడ్జెస్‌, కామ్‌షెల్స్‌, బర్డ్‌ డాగ్స్‌ లాంటి వ్యాయామాలు కూడా చేయొచ్చు. ఇవిగాక స్ట్రెచెస్‌, యోగా కూడా సహాయపడతాయి. యోగాలో ముఖ్యంగా బాలాసనం (చైల్డ్‌ పోజ్‌), భుజంగాసనం (కోబ్రా పోజ్‌) వంటివి ప్రయత్నించవచ్చు.


ప్రతి 45 నిమిషాలకూ చేయడం మంచిది

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇప్పుడు సాధారణమైంది. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ మాత్రమే కాదు ఆన్‌లైన్‌ క్లాస్‌లంటూ పిల్లలు కూడా గాడ్జెట్స్‌తో అతుక్కుపోతున్నారు. తప్పుడు భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నెక్‌ పెయిన్‌, బ్యాక్‌ పెయిన్‌ వస్తుంది. అదే కొనసాగితే సర్వికల్‌ స్పాండిలోసిస్‌, లుంబార్‌ రాడిక్యులోపతి లాంటివి వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలంటే వెన్నుకు చక్కటి మద్దతునందించే రీతిలో కుర్చీ ఉపయోగించాలి. అలాగే 45 నిమిషాలకోమారు అయినా స్ట్రెచెస్‌, నెక్‌ వ్యాయామాలు చేయాలి. తగినంతగా నీరుతాగడం, ల్యాప్‌టాప్‌ నుంచి తగిన దూరంలో ఉండటం అవసరం. కళ్లను కాపాడుకోవడం కోసం స్ర్కీన్‌ గార్డ్స్‌ వాడొచ్చు. వ్యాయామాల కోసం తగిన సమయం కేటాయించడంతో పాటుగా సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. - డాక్టర్‌ అనీష్‌ ఆనంద్‌, కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసన్‌, అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌.



Updated Date - 2021-05-07T13:17:21+05:30 IST