కరెంట్‌కు కలిసొచ్చిన Work From ‘Home’.. ‘స్మార్ట్‌’గా ఆలోచిస్తున్న శాఖ

ABN , First Publish Date - 2021-12-27T16:59:10+05:30 IST

ఈ ఏడాదిలో గ్రేటర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. కొత్త కనెక్షన్లు రికార్డు స్థాయిలో ఇచ్చారు.

కరెంట్‌కు కలిసొచ్చిన Work From ‘Home’.. ‘స్మార్ట్‌’గా ఆలోచిస్తున్న శాఖ

  • గృహాల్లో 60 శాతానికి పైగా డిమాండ్‌
  • కమర్షియల్‌లో డౌన్‌

ఈ ఏడాదిలో గ్రేటర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. కొత్త కనెక్షన్లు రికార్డు స్థాయిలో ఇచ్చారు. 2021లో గ్రేటర్‌జోన్‌ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 2,75,622 కనెక్షన్లు మంజూరు చేసినట్లు విద్యుత్‌శాఖ లెక్కలు చెబుతున్నాయి. స్టాఫ్‌వేర్‌ కంపెనీలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో కమర్షియల్‌ డిమాండ్‌ కొంత తగ్గినా, వర్క్‌ ఫ్రం హోం కారణంగా గృహ విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో 2019లో భారీ నష్టాలు మూటగట్టుకున్న టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ గ్రేటర్‌జోన్‌కు 2021లో కాస్త ఊరట లభించింది. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా గృహ విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. 2020 వేసవిలో గరిష్ఠ డిమాండ్‌ 67.88 మిలియన్‌ యూనిట్లు నమోదవ్వగా, 2021 వేసవిలో రికార్డు స్థాయిలో 73.84 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం కూడా 60 శాతానికి పైగా విద్యుత్‌ డిమాండ్‌ డిమాండ్‌  గృహాల్లోనే నమోదవుతోంది. ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న హెచ్‌టీ కనెక్లన్ల కోసం ప్రత్యేకంగా మూడు స్విచ్చింగ్‌ స్టేషన్లను విద్యుత్‌శాఖ అందుబాటులోకి తెచ్చింది. జీడిమెట్లలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ను టీఎస్‌ ఈఆర్సీసీ చైర్మన్‌, సభ్యులు పరిశీలించి విద్యుత్‌ అధికారులను అభినందించారు. ఇతర రాష్ర్టాల ప్రతినిధులు కూడా స్కాడా ప్రత్యేకతలు తెలుసుకునేందుకు కార్యాలయాన్ని సందర్శించారు.


ఐదేళ్ల అవసరాలకు అనుగుణంగా..

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో భవిష్యత్‌ ప్రణాళికలపై డిస్కం దృష్టి సారించింది. స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను పెంచేందుకు ఉన్నతాధికారులు చర్యలు మొదలుపెట్టారు. బిల్లుల జారీ ఆలస్యమైనా సమస్యలు తలెత్తకుండా ఉండేలా టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ యాప్‌లో సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే ఐదేళ్ల విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సబ్‌స్టేషన్లపై ఓవర్‌ లోడ్‌ పడకుండా పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం రెట్టింపు చేశారు. కొత్త కనెక్షన్ల జారీ నుంచి ఫిర్యాదుల స్వీకరణ వరకు ఆన్‌లైన్‌ సేవలను విద్యుత్‌శాఖ విస్తరించింది. అధికారులు, సిబ్బందికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేసింది.


శివార్లలో భారీగా..

గ్రేటర్‌ జోన్‌ మొత్తం 54 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వాటిలో 49 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాలు విస్తరిస్తుండటంతో పలు సర్కిళ్లలో 12 నెలల్లో 40 వేల కొత్త కనెక్షన్లు మంజూరయ్యాయి. 9 సర్కిళ్లలోనూ ఏడాదిలో 2.75 లక్షల కొత్త విద్యుత్‌కనెక్షన్లు పెరిగాయి.


ఆన్‌లైన్‌ సేవల విస్తరణ.. 

ఏడాది మెదట్లో కరోనా భయం ఉన్నా అధికారులు, సిబ్బంది సహకారంతో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించగలిగాం. గతేడాదితో పోల్చితే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌ సేవలను విస్తరించాం. 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ను మరింత బలోపేతం చేశాం. స్కాడా కార్యాలయం నుంచి పరిశీలిస్తూ ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తినా నిమిషాల్లో గుర్తించి పరిష్కరిస్తున్నాం. 2022లో డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగినా అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా అందించేలా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌లైన్లు బలోపేతం చేశాం. - రఘుమారెడ్డి, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ.

Updated Date - 2021-12-27T16:59:10+05:30 IST