తగ్గుముఖం పడుతోన్న ‘వర్క్ ఫ్రం హోం’

ABN , First Publish Date - 2021-08-04T19:05:49+05:30 IST

రోనా నేపధ్యంలో ఏడాదికి పైగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.

తగ్గుముఖం పడుతోన్న ‘వర్క్ ఫ్రం హోం’

హైదరాబాద్ : కరోనా నేపధ్యంలో ఏడాదికి పైగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతుండడం, థర్డ్ వేవ్ ప్రభావం పట్ల అప్రమత్తత పనెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావొస్తుండడం తదితర పరిణామాల నేపధ్యంలో తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఐదు  శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారని, డిసెంబరు  నాటికి ఇది 50 శాతానికి చేరుకోవచ్నని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వేలో వెల్లడైంది. ఈ క్రమంలో నిర్వహించిన ‘ఫ్యూచర్ వర్క్ మోడల్’ సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి.


మార్చి నాటికి 90 శాతం ఉద్యోగులు...

500 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న ఐటీ సంస్థలలో ఇప్పటికే 20 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక 76 శాతం కంపెనీల్లో తొమ్మిది శాతం మంది, మధ్యస్థాయి, పెద్ద, అతి పెద్ద కంపెనీల ఉద్యోగులలో 5 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నారని ఈ సర్వే పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్స్‌కు అణుగుణంగా హైబ్రిడ్ విధానంలో పని చేయించేందుకు 70 శాతం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబరు  నాటికి 73 శాతం కంపెనీలు కనీసం 10-50 శాతం మందితో... కార్యాలయాల్లోనే పని చేయించాలని భావిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి 79 శాతం కంపెనీలు గరిష్టంగా 90 శాతం ఉద్యోగులతో కార్యాలయాల నుంచే పని ప్రారంభించాలని యోచిస్తున్నాయి. 

Updated Date - 2021-08-04T19:05:49+05:30 IST