కోటలు దాటిన మాటలు, గడప దాటని చేతలు

ABN , First Publish Date - 2020-05-28T07:47:28+05:30 IST

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలనలో ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించుకొంటే మిగిలేది నిర్వేదం, నిరాశే. అసమర్థులకు అవకాశాలు అందివచ్చినా ఏమీ చేయలేరని రుజువైంది. నాకు అధికారం ఇస్తే ఇరగ తీస్తాను అంటూ పాదయాత్రలో ప్రజలను...

కోటలు దాటిన మాటలు, గడప దాటని చేతలు

జగన్ పనితీరులోకానీ, ఆలోచనల్లోకానీ ప్రజాస్వామ్య సంస్కృతి కనపడదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు కానీ ప్రజల పేరుచెప్పి అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెట్టడం అందరినీ కలచి వేస్తోంది. నాకు అధికారం ఇస్తే స్వర్ణయుగం తెస్తాను అన్నారు. కానీ మాటల్లో చూపిన నమ్మకం చేతల్లో చూపలేదు. జగన్ అధికారంలోకి రావడం కోసం పడిన ఆరాటం, ఆడిన అబద్ధాలు దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఆడలేదు. జనహితం లేని జగన్నాటకం ఆడి ఆంధ్రప్రదేశ్‌ను ఏడాదిలోనే ఎడారి చేశారు. ఏడాది పాలన గొప్పగా వుందని తమకి తాము 100కి 100 మార్కులు వేసుకోవడం గురివింద తన అందాన్ని తాను గొప్పగా వర్ణించుకొన్న చందంగా వుంది.


‘అబద్ధాలతో మోసం చెయ్యడం కంటే

ఓటమి పొందడం గౌరప్రదం’ – అబ్రహం లింకన్

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలనలో ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించుకొంటే మిగిలేది నిర్వేదం, నిరాశే. అసమర్థులకు అవకాశాలు అందివచ్చినా ఏమీ చేయలేరని రుజువైంది. నాకు అధికారం ఇస్తే ఇరగ తీస్తాను అంటూ పాదయాత్రలో ప్రజలను పరవశింపచేసిన జగన్ తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం వుంది. అన్నీ కోటలు దాటిన మాటలు, గడప దాటని చేతలు! అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకోవడం వారి బరితెగింపుకు నిదర్శనం. 90శాతం కాదు కదా 9శాతం కూడా హామీలు అమలు కాలేదు. అబద్ధాలతో పుట్టిన ప్రభుత్వం, అబద్ధాలతోనే జీవిస్తుంది. ఏ విధంగా అయినా ప్రజలను మోసం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం, జన వంచనలో జగన్ ఘనుడు. బండెడు భారాలు మోపి, గుప్పెడు సంక్షేమంతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.


ఒక 100 అబద్ధాలు బట్టీపట్టి, ఏడాది పాటు పాదయాత్ర చేసి, ఆహాభావ ప్రసంగాలు చేస్తూ, గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ద్వారా, అమోఘమైన హామీల ద్వారా ఎన్నికల్లో గెలుపొందడం సాధ్యమని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ఎవరైనా కొత్త వాగ్దానాలతో ముందుకు వచ్చినప్పుడు జనానికి వింతగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆదర్శాలు కొత్తగా విన్నప్పుడు జనం సమ్మోహితులు కావడం సహజమే. అధికారం కొరకు అబద్ధాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడం అద్భుతమమైన కళగా మార్చుకొన్నారు జగన్‌. కానీ చేతకాని రాజు కోటలో వున్నా ఒక్కటే, పేటలో వున్నా ఒక్కటే అని నేడు రుజువైంది.


జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 30వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది. సీయం జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలన రాష్ట్రాన్ని ఎంతగా భ్రష్టు పట్టించిందో ప్రతి ఒక్కరికీ కళ్ళకుకట్టినట్టు కనపడుతున్నా ఏడాదిలో తాము ఏదో ఉద్ధరించినట్లు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏడాదిలో జగన్ పరిపాలన ద్వారా రాష్ట్రానికి, ప్రజలకు చేకూరిన ప్రయోజనం ఏమిటంటే రాష్ట్రంపై రూ.77వేలకోట్ల అప్పులు, ప్రజలపై రూ.50వేల కోట్ల భారాలు మోపారు. తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్లలో రూ.లక్షా40వేలకోట్లు అప్పుచేస్తేనే అప్పులు చేస్తున్నారని గుండె లు బాదుకొన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రూ.మూడు లక్షల 80వేల కోట్ల అప్పులు చెయ్యబోతున్నది. దీనికి ఏమి సమాధానం చెబుతారు? ‘ఒక్క ఛాన్స్’ అన్న నినాదానికి ఆకర్షితులై జగన్‌కి అధికారం ఇచ్చిన ఏడాదికే తెలుగు ప్రజలు తెల్లబోయారు. రాజకీయంగా ఉపయోగపడితే చాలు, ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు.. అన్న విధంగా వ్యవహరించి కోర్టులతో 64 సార్లు చీవాట్లు తిని ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిపారు. చరిత్రలో ఏడాదిలో ఇన్నిసార్లు కోర్టులతో చివాట్లు తిన్న ప్రభుత్వం లేదు.


అహంకారం, ప్రతీకారం, నియంతృత్వం వంటి అవలక్షణాలు ప్రజలు ఇచ్చిన అపూర్వ అధికారాన్ని అభాసుపాలు చేశాయి. ఏడాదిలో జగన్ సాధించిన విజయాలేమిటయ్యా అంటే ఛిద్రమైన ఆర్థిక రంగం, కుదేలైన వ్యవసాయరంగం, అస్తవ్యవస్థమైన గ్రా మీణ జీవనం, పతనమైన పారిశ్రామిక రంగం, గుట్టలుగా పేరుకున్న నిరుద్యోగం, పడకేసిన సాగునీటి రంగం, మితిమీరిన అవినీతి, బస్సు ఛార్జీలు పెంపు, విద్యుత్ ఛార్జీల పెంపు, మద్యం ధరల పెంపు, నిర్వీర్యమైన మౌలిక సదుపాయాలు, ప్రమాదంలో ప్రజారోగ్యం, కునారిల్లుతున్న విద్యారంగం... మొత్తంగా ప్రజాస్వామ్యం అపహా స్యం; చట్టం, ధర్మం, న్యాయం, నీతి, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు. రంగులు వేయడం, రద్దులు చేయడం, కూల్చివేతలు, కక్షసాధింపులు, అణచివేతలు, దాడులు, అక్రమ కేసులు, ప్రశ్నించిన వారిపై దుర్భాషలు, మీడియా గొంతు నొక్కేందుకు చీకటి చట్టాలు, పాలనలో అసమర్థత.. వీటన్నిటిపైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ! ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారం ప్రజలకే శాపమైంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు తిరోగమన బాట పట్టాయి. పాలనాపరంగా పోగొట్టుకొన్న పరువును కాపాడుకోవడానికి కడుపు నింపని పథకాలతో విన్యాసాలు చేస్తున్నారు. నవరత్నాలు అంటూ కొండంత రాగం తీసి అధికారంలోకి వచ్చి నవరత్నాల అమలులో నైవేద్యం పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. 


ఏ విధంగా అయినా అధికారంలోకి రావడం కొరకు ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు బేషరతు హామీలు, పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక అనేక నిబంధనలు విధించి వీలైనంతమేర లబ్ధిదారుల సంఖ్యను కుదించి, ఆ మేరకు ఖర్చు తగ్గించుకొన్నారు. అమలు చేస్తున్న ప్రతి పథకం అరకొరే తప్ప ఏదీ ప్రజల కడుపులు నింపేది కాదు. ఇంతమాత్రం దానికే ఎంతో ఉద్ధరిస్తున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు. మా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ప్రజలను బులిపించారు. అందులో చెప్పినదానికి అమలుచేస్తున్న దానికి పొంతన లేదు. అన్నదాతకు అరచేతిలో వైకుంఠం చూపించారు. రాష్ట్రంలో కోటిమంది రైతులు వున్నారని, రైతు భరోసా ద్వారా రూ.13,500 ఇస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను 49 లక్షల మందికి కుదించారు. తరువాత కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తున్న రూ.6వేలతో కలిపి రూ.13,500 ఇస్తామన్నారు. చివరికి రూ.7,500 ఇస్తున్నారు. అవి కూడా మూడు సార్లు ఇస్తున్నారు. మరి ఈ రైతు భరోసా పథకం ఏ రైతుని ఆదుకొంటుంది?వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ఇలా కరి మింగిన వెలగపండు చందంగానే వున్నాయి. అన్నీ మోసపూరితమైన హామీలే. మద్యపాన నిషేధం అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని బురిడీ కొట్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను 75శాతం పెంచి పేదల జీవితాలను గుల్లచేస్తున్నారు, మద్యం ఆదాయాన్ని కళ్ళకు అద్దుకొంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీ దశలవారీ మద్య నిషేధం. దానికి తూట్లు పొడిచారు. 75శాతం ధర పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.9000కోట్లు ఆదాయం రానున్నది. తాము మాత్రమే ప్రజాహితమని ప్రచారం చేసుకొంటున్న వారు ఈ విధంగా మద్యం ధరలు పెంచి పేదల జేబుకొట్టి ఆదాయం పోగేసుకోవడం ప్రజాహితమా? ప్రజాహతమా? లాక్‍డౌన్ మూలంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి భాధల్లో వున్న సమయంలో ప్రభుత్వం ఇలా పేదలను బుగ్గిపాలు చేయటం న్యాయమా? లాక్‍డౌన్ మూలంగా సమస్త రంగాలు మూతపడి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఆకలి తీర్చుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరవడం ఏ విధమైన ప్రజాహితం? ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదిక పైనే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన జగన్ ఏడాదిలో రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల డబ్బు గుంజడం ఏ విధమైన ప్రజాహితం?


జగన్ ఏడాది పాలనలో రద్దు అన్న పదం తప్ప మరో పదం వినపడలేదు. రద్దుల రాజకీయం, ప్రతీకార రాజకీయం పరాకాష్ఠకు చేరింది. గత ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్ళు, విజయ చిహ్నాలు, పథకాలు రద్దు చేశారు. అక్రమ కట్టడమని రూ.9 కోట్లతో నిర్మించిన ప్రజావేదికను నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రి కూల్చి వేశారు. అయిదు కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతిని అగాధంలోకి నెట్టారు. రివర్స్ టెండర్స్ పేరుతో 70శాతం పూర్తి అయిన పోలవరాన్ని నిలిపి వేశారు. పనులు ప్రారంభమైన బందర్ పోర్టును రద్దు చేశారు. రోజుకు 3 లక్షలమందికి పైగా అభాగ్యుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాల్నీ రద్దు చేసారు.


వైకాపా అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర వృద్ధి రేటు 11.2 శాతంగా నమోదు అయింది. ఈ 12 నెలల జగన్ పాలనలో 5 శాతానికి పడిపోయి రాష్ట్రం తిరోగమనం బాట పట్టింది. ఆదర్శవంతమైన రాజకీయాలకు నాంది పలికి దేశానికే దిక్సూచిగా నిలుస్తామని అసెంబ్లీ సాక్షిగా నీతులు చెప్పి నేడు అసెంబ్లీని దుర్భాషలకు వేదిక చేశారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలను తన రాజకీయ అవసరాలకు రాళ్ళెత్తే కూలీలుగా మార్చారు. మీడియా గొంతు నులిమేందుకు జీఓ.2430 జారీ చేశారు. పాలనా వైఫల్యాలను, అక్రమాలను దాచిపెట్టి జనాన్ని కుడి ఎడమల దగా చేయాలన్న దురుద్దేశంతో ఏబీఎన్, టీవి 5 ఛానళ్ళను నిషేధించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించకపోగా వాటి గురించి మాట్లాడే వారి గొంతునొక్కుతున్నది ప్రభుత్వం.


జగన్ పనితీరులో కానీ, ఆలోచనల్లో కానీ ప్రజాస్వామ్య సంస్కృతి కనపడదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు కానీ ప్రజల పేరుచెప్పి అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలు బలిపెట్టడం అందరినీ కలచి వేస్తోంది. నాకు అధికారం ఇస్తే స్వర్ణయుగం తెస్తాను అన్నారు. కానీ మాటల్లో చూపిన నమ్మకం చేతల్లో చూపలేదు. జగన్ అధికారంలోకి రావడం కోసం పడిన ఆరాటం, ఆడిన అబద్ధాలు దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఆడలేదు. జనహితంలేని జగన్నాటకం ఆడి ఏపీను ఏడాదిలోనే ఎడారి చేశారు. అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారో, ఏమి చేస్తున్నారో ముఖ్యమంత్రి ఒకసారి అవలోకనం చేసుకోవాలి. మీ అందమైన, ఆకర్షణీయమైన అబద్ధాలు నమ్మి ప్రజలు నెత్తిన పెట్టుకొన్నారు. ప్రజల బాగుకోసం ఇచ్చిన అధికారాన్ని రాజకీయ ప్రయోజనాలు, సాధింపులు, వేధింపులు, కూల్చివేతలు, ప్రతీకార రాజకీయాలకు ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే చరిత్ర క్షమించదు. ఏడాది పాలన గొప్పగా వుందని తమకి తాము 100కి 100 మార్కులు వేసుకోవడం గురివింద తన అందాన్ని తాను గొప్పగా వర్ణించుకొన్న చందంగా వుంది.



యనమల రామకృష్ణుడు

(ప్రతి పక్షనాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి)

Updated Date - 2020-05-28T07:47:28+05:30 IST