స్వర్ణ భారత్‌

ABN , First Publish Date - 2020-08-31T09:27:59+05:30 IST

మొదటిసారి చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్‌ చేరిన భారత్‌..రష్యాతో కలిసి స్వర్ణ పతకం గెలుపొందింది. అయితే అంతిమ సమరంలో నాటకీయ పరిణామాలు ..

స్వర్ణ భారత్‌

రష్యాతో కలిపి సంయుక్త విజేత

తొలిసారి చాంపియన్‌షిప్‌ కైవసం

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌


చెన్నై: మొదటిసారి చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్‌ చేరిన భారత్‌..రష్యాతో కలిసి స్వర్ణ పతకం గెలుపొందింది. అయితే అంతిమ సమరంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫేవరెట్‌ రష్యాతో ఆదివారం నాటి ఫైనల్‌ తొలి రౌండ్‌ను 3-3తో డ్రా చేసుకున్న ఏడోసీడ్‌ భారత్‌.. రెండో రౌండ్‌లో 4.5-1.5తో ఓడిపోయింది. దాంతో రష్యాను విజేతగా ప్రకటించడమే తరువాయి..అనుకున్న తరుణంలో సర్వర్‌ సమస్యలపై భారత్‌ ఫిర్యాదు చేసింది. దాంతో ఫిడే రంగంలోకి దిగింది. భారత్‌ ఫిర్యాదుపై సమీక్షించి..రెండు జట్లను విజేతలుగా ప్రకటించింది.

ఏం జరిగిందంటే..

టోర్నీలో ఇంతకుముందు మాదిరే కీలకమైన తుదిపోరుకూ ఇంటర్నెట్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండోరౌండ్‌.. ఐదో బోర్డులో నిహాల్‌ సరీన్‌, దివ్య దేశ్‌ముఖ్‌ల గేమ్‌ల సందర్భంగా సర్వర్‌ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఎసిపెంకోతో గేమ్‌ను డ్రా చేసుకొనే పరిస్థితుల్లో ఉన్న సరీన్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక షువలోవాతో మ్యాచ్‌లో దివ్య తిరుగులేని విజయం సాధించే స్థితిలో నిలిచింది. ఈ దశలో ఇంటర్నెట్‌ డిస్కనెక్ట్‌ అవడంతో మ్యాచ్‌లో దివ్య ఓటమిపాలైంది. ఫలితంగా భారత జట్టు కీలకమైన పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. మూడో బోర్డుపై కోనేరు హంపి సైతం సమస్యలు ఎదుర్కొంది. ఇంటర్నెట్‌ ఇబ్బందులతో ఆమె కొంత సమయాన్ని కోల్పోయింది. లేదంటే రెండో రౌండ్‌లో భారత్‌ మెరుగైన స్థితిలో ఉండేది. సర్వర్‌ సమస్యలపై ఫిడే సమీక్ష కమిటీకి భారత్‌ ఫిర్యాదు చేసింది. దాంతో పరిస్థితులను సమీక్షించి రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తూ ఫిడే అధ్యక్షుడు అర్కడీ డ్వోర్కోవిచ్‌ నిర్ణయం తీసుకున్నారు. రెండో రౌండ్‌ పోరులో గొర్యాచ్కినాతో గేమ్‌లో హంపి ఓడిపోగా.. కోస్టెన్యుక్‌తో గేమ్‌ను హారిక డ్రాగా ముగించింది. ఇక నెపోమ్నియాచితో గేమ్‌ను విశ్వనాథన్‌ ఆనంద్‌, దుబోవ్‌తో గేమ్‌ను విదిత్‌ గుజరాతి డ్రా చేసుకున్నారు.  

మొదటి రౌండ్‌లో భారత్‌ భేష్‌..

అంతకుముందు తొలిరౌండ్‌ గేముల్లో టాప్‌సీడ్‌ రష్యాకు భారత్‌ గట్టి పోటీ ఇచ్చింది. ఈ రౌండ్‌లో గేమ్‌లన్నీ డ్రాగా ముగిశాయి. దాంతో మొదటి రౌండ్‌ 3-3తో సమమైంది. విశ్వనాథన్‌ ఆనంద్‌ మొదటిరౌండ్‌ పోరుకు దూరంగా ఉన్నాడు. దాంతో వరల్డ్‌ నెంబర్‌ 4 ర్యాంకర్‌ ఇయాన్‌ నెపోమ్నియాచితో భారత్‌ కెప్టెన్‌ విదిత్‌ గుజ్‌రాతి తలపడ్డాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మహిళల్లో కేటరినాతో హంపి, కోస్టెన్యుక్‌తో హారిక, వాదిస్లావ్‌తో హరికృష్ణ, అలెక్సీతో ప్రజ్ఞానంద, పొలినాతో దివ్య గేమ్‌లను డ్రాగా ముగించారు. 


మోదీ అభినందనలు

‘స్వర్ణం గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకమవుతుంది. అలాగే రష్యా బృందానికి కూడా అభినందనలు’

- ప్రధాని  నరేంద్ర మోదీ 


ఇదే తొలిసారి..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి. గతంలో అత్యుత్తమంగా 2014 నార్వే ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. మొత్తం 163 దేశాలు తలపడిన ఆన్‌లైన్‌ ఒలింపియాడ్‌లో టాప్‌సీడ్‌ రష్యాతో సమవుజ్జీగా నిలవడం భారత్‌ చెస్‌ చరిత్రలో మైలురాయి. 

Updated Date - 2020-08-31T09:27:59+05:30 IST