ఆడకుండానే ఆఖరాటకు

ABN , First Publish Date - 2020-03-06T09:54:32+05:30 IST

మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత జట్టు మొదటిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం పటిష్ఠ ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి సెమీస్‌ మ్యాచ్‌ టాస్‌ ...

ఆడకుండానే ఆఖరాటకు

ఫైనల్‌ చేరిన భారత్‌

ఇంగ్లండ్‌తో సెమీస్‌ వర్షార్పణం

ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ

మహిళల టీ20 ప్రపంచకప్‌


టీ20 ప్రపంచక్‌పలో తలపడిన ఐదుసార్లూ ఇంగ్లండ్‌పై గెలిచింది లేదు.. ఇక ఈసారి ఏం జరుగుతుందో అని సెమీ్‌సకు ముందు భారత అభిమానుల్లో ఒకటే టెన్షన్‌.. కానీ మరేం ఫర్వాలేదంటూ వరుణుడి రూపంలో అవకాశం కలిసివచ్చింది. అంచనాలకు మించి గ్రూప్‌ దశను అజేయంగా ముగించడం హర్మన్‌ప్రీత్‌ సేనకు వరమైంది. ఊహించినట్టుగానే భారీ వర్షంతో మ్యాచ్‌ రద్దు కాగా.. రూల్స్‌ ప్రకారం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. అటు మనకన్నా రన్‌రేట్‌ మెరుగ్గానే ఉన్నా ఒక్క ఓటమి ఇంగ్లండ్‌ జట్టుకు శాపంగా మారి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక రెండో సెమీస్‌లో గెలిచిన ఆసీ్‌సతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.


సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత జట్టు మొదటిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం పటిష్ఠ ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి సెమీస్‌ మ్యాచ్‌ టాస్‌ కూడా వేయకుండానే వర్షంతో రద్దయింది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డే లేనందున నిబంధనల ప్రకారం గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన జట్టును విజేతగా ప్రకటించారు. ఫలితంగా హర్మన్‌ప్రీత్‌ సేన తమ కెరీర్‌లోనే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించినట్టయింది. గతంలో నాలుగు సార్లు భారత జట్టు సెమీ్‌సకు చేరినా నిరాశే ఎదురైంది. గ్రూప్‌ దశలో భారత మహిళలు ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై గెలిచారు. 2018 టోర్నీలోనూ సెమీస్‌ చేరిన భారత జట్టు ఇంగ్లండ్‌ చేతిలోనే ఓడి నిష్క్రమించగా, ఈసారి ఇలా బదులు తీర్చుకున్నట్టయింది. మరోవైపు గురువారమే జరిగిన రెండో సెమీ్‌సలో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్‌-ఆసీ్‌స మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.


కన్నీటి పర్యంతమైన ఇంగ్లండ్‌ అమ్మాయిలు 

భారత జట్టు సంబరాలు ఎలా ఉన్నా అటు ఇంగ్లండ్‌ అమ్మాయిలు మాత్రం ఈ ‘ఓటమి’ని  తట్టుకోలేకపోతున్నారు. 2018 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లిష్‌ జట్టు భారత్‌ను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. కచ్చితంగా ఓడిస్తామనే ధీమాతో ఉన్నా.. ఊహించినట్టుగానే భారీ వర్షం కురవడం ఇంగ్లండ్‌ అమ్మాయిల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఉదయం నుంచే వరుణుడు తడాఖా చూపడంతో టాస్‌ కూడా వీలు కాలేదు. తెరిపినిచ్చే అవకాశం కూడా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ రద్దు వైపే మొగ్గు చూపారు. దీంతో పలువురు ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ కన్నీటి పర్యంతమయ్యారు.


ఫైనల్‌ చేరడం ఇలా కాదు..

లీగ్‌ దశను అద్భుతంగా ఆడిన భారత జట్టు చివరకు వర్షం కారణంగా ఫైనల్‌కు చేరడంపై అటు క్రికెట్‌ విశ్లేషకుల నుంచి అభిమానుల వరకు సోషల్‌ మీడియాలో మిశ్రమంగా స్పందించారు. ‘ఫైనల్‌కు ఇలా చేరడం ఆమోదయోగ్యం కాకపోయినా టేబుల్‌ టాపర్‌గా నిలిచిన భారత్‌కు ఇది రివార్డు. ఆసీస్‌, కివీ్‌సపై గెలవడం ప్రత్యేకం’ అని హర్షా భోగ్లే ట్వీట్‌ చేయగా.. ‘మ్యాచ్‌ జరిగితే గొప్పగా ఉండేది. అయినా ఫైనల్‌కు చేరిన భారత జట్టుకు శుభాకాంక్షలు. వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచినందుకు ఇది బహుమతి’ అని లక్ష్మణ్‌ స్పందించాడు. అలాగే భారత్‌ తుదిపోరుకు అర్హత సాధించినందుకు కెప్టెన్‌ కోహ్లీ,  సెహ్వాగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనల్లోనూ గెలవాలని ఆకాంక్షించారు. ఇక ఇంతపెద్ద టోర్నీలో సెమీస్‌కు రిజర్వ్‌ డే లేకపోవడం దారుణమని, ఇది క్రికెటర్ల జీవితకాల కలను భగ్నంచేయడమేనని ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌ వా విమర్శించాడు.


  నిబంధనలు మార్చాలి

చాలా నిరాశగా ఉంది. ప్రపంచక్‌పను ఇలా ముగిస్తామనుకోలేదు. రిజర్వ్‌ డే లేకుండా, మ్యాచ్‌ ఆడకుండానే ఓడిపోవడం దారుణం. మా తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా చేతిలో ఓడడంతో మూల్యం చెల్లించుకున్నాం. అయితే నిబంధనలు అలా ఉన్నాయి కాబట్టి చేసేదేమీ లేదు. కాకపోతే భవిష్యత్‌లోనైనా ఇలాంటి పరిస్థితి మరో జట్టుకు రాకుండా రిజర్వ్‌ డే కేటాయిస్తే బావుంటుంది. కేవలం వర్షం కారణంగా ఒక జట్టు ఇలా టోర్నీ నుంచి నిష్క్రమించడం సరికాదు. 

- హీథర్‌ నైట్‌ (ఇంగ్లండ్‌ కెప్టెన్‌)

సంతోషంగా ఉంది

తొలిసారి ఫైనల్‌కు చేరడంతో జట్టు చాలా సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ మేం మ్యాచ్‌ ఆడలేకపోయాం. అయితే ఎవరైనా నిబంధనలను పాటించాల్సిందే. వచ్చే టోర్నీల్లో నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌డే ఉంటుందని ఆశిస్తున్నా. కానీ తొలి మ్యాచ్‌ నుంచే మేం వ్యూహం ప్రకారం ఆడాం. ఒకవేళ సెమీస్‌ వీలు కాకపోతే ఎలా అనే ఆలోచనతో గ్రూప్‌ దశను అజేయంగా ముగించాలని భావించాం. ఇందుకు మా ప్లేయర్స్‌ను అభినందించాల్సిందే. 

- హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (భారత కెప్టెన్‌)

Updated Date - 2020-03-06T09:54:32+05:30 IST