ఆసీస్‌.. వరుసగా ఆరోసారి

ABN , First Publish Date - 2020-03-06T10:09:39+05:30 IST

నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్ర్లేలియా జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగింది. గురువారం జరిగిన రెండో సెమీ్‌సలో దక్షిణాఫ్రికాపై డక్‌వర్త్‌ లూయిస్‌ ..

ఆసీస్‌.. వరుసగా ఆరోసారి

తుది పోరుకు కంగారూలు

రెండో సెమీ్‌సలో దక్షిణాఫ్రికాపై విజయం


సిడ్నీ: నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్ర్లేలియా జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగింది. గురువారం జరిగిన రెండో సెమీ్‌సలో దక్షిణాఫ్రికాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఆసీస్‌ వరుసగా ఆరోసారి మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఫైనల్లో అడుగుపెట్టింది. సిడ్నీ మైదానంలోనే జరగాల్సిన భారత్‌-ఇంగ్లండ్‌ సెమీస్‌ భారీ వర్షంతో రద్దయింది. రోజంతా వర్షం ఇలాగే కురిస్తే అటు దక్షిణాఫ్రికాకు కూడా అదృష్టం కలిసి వచ్చి ఫైనల్‌కు చేరేది. కానీ తమ పురుషుల జట్టు మాదిరే వీరినీ దురదృష్టం వెంటాడినట్టుంది. ఈ మ్యాచ్‌ సమయానికి వరుణుడు తెరిపినివ్వడంతో టాస్‌ గెలిచిన సఫారీలు ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసీస్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (49), బెత్‌ మూనీ (28), హీలీ (18) రాణించారు. డిక్లెర్క్‌కు మూడు వికెట్లు దక్కాయి. 


లక్ష్యం 13 ఓవర్లలో 98

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగియగానే మరోసారి భారీ వర్షంతో సిడ్నీ మైదానం తడిసి ముద్దయింది. దీంతో ఆసీస్‌ శిబిరంలో ఆందోళన నెలకొంది. అటు అంతర్జాతీయ టీ20ల్లో ఆసీ్‌సపై ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని ప్రొటీస్‌ మాత్రం మ్యాచ్‌ రద్దు అయితే ఫైనల్‌కు వెళ్లచ్చనే ఆనందంలో ఉంది. కానీ గంట తర్వాత వర్షం ఆగడంతో మ్యాచ్‌ను 13 ఓవర్లలో 98 పరుగుల లక్ష్యానికి కుదించారు. ఈ ఛేదనలో పోరాడిన దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి ఓడింది. ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు రావాల్సి ఉండగా 13 రన్స్‌ మాత్రమే సాధించడంతో ఓటమిపాలైంది.


సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 134/5 (లానింగ్‌ 49; డిక్లెర్క్‌ 3/19).

దక్షిణాఫ్రికా: 13 ఓవర్లలో 92/5 (వోల్వార్ట్‌ 41 నాటౌట్‌; షట్‌ 2/17). 

Updated Date - 2020-03-06T10:09:39+05:30 IST