చట్టాలకే పరిమితమైన మహిళా హక్కులు

ABN , First Publish Date - 2021-10-08T07:27:32+05:30 IST

నిర్భయ కేసు తరువాత మహిళలకు ఏదో ఉపకారం జరుగుతుందనుకున్నా ఇప్పటికీ ఎలాంటి ఉపశమనం కలగలేదు. పైగా రోజుకో నిర్భయ వంటి కేసు ఎక్కడో అక్కడ నమోదవుతూనే ఉంది...

చట్టాలకే పరిమితమైన మహిళా హక్కులు

నిర్భయ కేసు తరువాత మహిళలకు ఏదో ఉపకారం జరుగుతుందనుకున్నా ఇప్పటికీ ఎలాంటి ఉపశమనం కలగలేదు. పైగా రోజుకో నిర్భయ వంటి కేసు ఎక్కడో అక్కడ నమోదవుతూనే ఉంది. అలాగే గృహహింస చట్టం–2005 వల్ల కూడా ఒరిగిందేమీ లేదు. నేర విచారణ చట్టం ద్వారా వచ్చే మనోవర్తి విషయంలో కూడా స్త్రీలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498(--ఎ) వల్ల కూడా పెద్దగా స్త్రీలు లాభపడలేదు. అంతెందుకు భారత రాజ్యాంగం వల్ల కూడా స్త్రీలు సమానత్వం చవిచూడ లేదు. 


నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం 2020లో 3,71,503 మంది స్త్రీల పట్ల నేరాలు నమోదయ్యాయి. ఇందులో భర్త, అతని బంధువులు భార్యలను వేధించిన కేసులు 30 శాతం. స్త్రీలకు మానహాని కలిగించిన కేసులు 23 శాతం. స్త్రీలు, బాలికల అపహరణ కేసులు 16.8 శాతం. అత్యాచారాలు 7.5 శాతం. ప్రతి లక్ష మంది స్త్రీలలో 56.5 శాతం ఏదో ఒక హింసకు గురవుతున్నారని కేంద్రప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 


ఇతర చట్టాలలో స్త్రీలకు న్యాయం కలిగిస్తున్నట్లు భ్రాంతి కలిగించేవి కూడా ఉన్నాయి. గృహహింస చట్టాన్ని ఉదాహరణగా తీసుకుంటే, దాని వల్ల స్త్రీలకు ఒరిగిందేమీ లేదు. బాధిత స్త్రీకి ఒక మధ్యంతర సహాయంగా ఆర్డరు వేస్తూ బాధితుల ఇంట్లోనే ఒక భాగంలో ఆమెను ఉండమని కోర్టు చెబుతుంది కానీ ఎలాంటి రక్షణ ఆ చట్టం కల్పించదు. బాధితురాలు నేరస్థుని ఇంట్లోనే ఉండమనడం ఎంతవరకు సమంజసమో తెలియదు. అలాగే భారత శిక్షాస్మృతి 498(ఎ) కూడా స్త్రీలకు ఎటువంటి న్యాయం చేకూర్చలేకపోతున్నది. ఆ సెక్షన్ కింద కేసు వేసినప్పుడు నిందితుడు బయటపడటానికి అనేక పక్కదారులు, లొసుగులు ఉన్నాయి. విడాకుల విషయంలో కూడా స్త్రీలే మోసపోతున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 విడాకులు పొందిన స్త్రీకి భర్త మనోవర్తి ఇవ్వాలని చెప్పినా, ఒకటి రెండు నెలలు మాత్రమే మనోవర్తి చెల్లించి, తరువాత మానివేస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. మూడో నెల నుంచి మళ్ళీ వారు కోర్టు చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 


స్త్రీల హక్కులకు, వారి పట్ల జరిగే నేరాలను అరికట్టేందుకు అనేక చట్టాలున్నాయి. అయితే అవి అమలవుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఉదాహరణకు నిర్భయ చట్టం. అలాంటి చట్టం ఏదీ లేదు. భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 376ను నిర్భయ అత్యాచారం, హత్యల తరువాత సవరించారు. దానికి నిర్భయ చట్టం అని పేరు పెట్టారు. ఇలాంటి నిర్భయలను రోజూ దేశవ్యాప్తంగా లెక్కకు మిక్కిలిగా చూస్తున్నాం. ఖథువా కేసు అయితేనేమి, దిశ కేసు అయితేనేమి, సింగరేణి కాలనీ కేసు అయితేనేమి, ప్రతిరోజు వార్తాపత్రిక చూస్తేనే భయం వేసి, ఒళ్లు జలదరిస్తుంది. కొత్త కొత్త పద్ధతుల్లో అత్యాచారాలు, తరువాత హత్యలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటి వెళ్లాలంటే భయం. ఒక్కతే బస్సు ఎక్కలన్నా, ఆటో ఎక్కాలన్నా, రైలు, విమానం ఏది ఎక్కాలన్నా భయమే. అలానే, శిక్షాస్మృతిలోని 363, 373 సెక్షన్‌లు అపహరణ గురించి, 302/304(బి), 354లు ఇలాంటి విషయాల్లోనే స్త్రీల రక్షణ, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఇతర నేరాలు చేసినా శిక్ష తప్పదని స్పష్టం చేస్తున్నా, నేరాలు ఆగడం లేదు. 


నిర్భయ కేసు తరువాత శీఘ్ర విచారణ (ఫాస్ట్ ట్రాక్) కోర్టులు ఏర్పడ్డాక కూడా సత్వర న్యాయం జరగడం లేదు. దిశ కేసులో ఈ కోర్టుల వ్యవస్థను ఉపయోగించుకోకుండా, మానవ హక్కులను భంగపరిచారా అనే అనుమానం వచ్చేట్టు పోలీసు వ్యవస్థ ప్రవర్తించిందని హక్కుల సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అలాగే సింగరేణి కాలనీ సంఘటనను కూడా అనేకులు ప్రశ్నిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఉద్దేశం నిందితుడి నేరాన్ని రుజువు చేసి శిక్షించడం. కానీ వాటి ఉద్దేశాలను గ్రహిస్తున్నట్టు లేదు. నేరస్తుడు నేరం చేయడం ఒక విపరీత చర్య అయితే, అతడిని శిక్షించకుండా చంపేయడం అంతే నేరమవుతుంది. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఔచిత్యం ఏమిటో తెలియడం లేదు. 


ఇవేకాకుండా స్త్రీలు పనిచేసే ప్రదేశాలలో ఎన్నో సమస్యలున్నాయి. సమాన వేతనాల నుంచి సెలవుల వరకు స్త్రీల పట్ల వివక్ష కనిపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలో, తమిళనాడు, మిజోరంలలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు వివిధ ప్రైవేటు ఉద్యోగాలలో దాదాపు 33 శాతం పని చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వారికి ఎలాంటి రక్షణ కానీ, సమాన వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ, సెలవులు కానీ లేవు. వీరిపై లైంగిక అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ అమ్మాయిలు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఉద్యోగాలు చేసి తమ పెద్దలకు సాయం చేయాలి కనుక, తమ పట్ల జరుగుతున్న నేరాలను కడుపులో దాచుకుని, గుడ్ల నీరు కుక్కుకుని సమాజంలో తమ స్థానం ఏమిటో తెలియక బతుకుతున్నారు. ఇలా స్త్రీలు పనికి, ఉద్యోగాలకు, సినిమాలకు, ఇతర అవసరాల కోసం బయటికి వెళితే లేదా బాలకల వసతి గృహాలలోనో, హాస్టళ్లలోనో ఉంటే ఏదో ఒక అవమానాన్ని భరించాల్సి వస్తోంది. 


మహిళల పట్ల జరిగే నేరాల గురించి ప్రజల్లో అవగాహన ఉందా లేదా అన్న విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగినా, ఎంతమందిని అరెస్టు చేసినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు మగ తృష్ణకు బలి అవుతున్న వైనం హృదయాలను కలచివేస్తోంది. గ్రామస్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు స్త్రీల చట్టాలు మరోసారి తిరగేసి, లొసుగులు సవరించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హైస్కూలు, జూనియర్ కాలేజీ స్థాయి నుంచి అబ్బాయిలకు స్త్రీల హక్కుల చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. మోటార్ బైక్, కారు, లారీ లాంటి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేముందు తప్పనిసరిగా జెండర్ సెన్సిటివిటీ శిక్షణ నిర్వహించి, తప్పుచేస్తే, ఎలాంటి శిక్ష విధిస్తారో అవగాహన కలిగించి, లైసెన్సులు ఇవ్వాలి. ఆడపిల్లలను అదుపులో పెట్టే సంస్కృతి నుంచి దృష్టి మళ్లించి మగపిల్లలకు బుద్ధులు నేర్పుకోవాల్సిన సమయమొచ్చింది. ప్రతి టీవి ప్రోగ్రామ్ కింద తప్పనిసరిగా నేరాలు, శిక్షల గురించి స్క్రోలింగ్ వేయాలి. ఊరూరా అవగాహన సభలు నిర్వహించి ఎల్లప్పుడూ ప్రచారాలు చేస్తూనే ఉండాలి.

జి. జ్యోతిరావు

అమిక మధ్యవర్తిత్వ కేంద్రం

Updated Date - 2021-10-08T07:27:32+05:30 IST