ఆ తెలుపు సహజమేనా?

ABN , First Publish Date - 2022-07-19T16:41:10+05:30 IST

‘తెలుపుగానే ఉంది కదా, ఫర్వాలేదులే’ అనుకుని వైట్‌ డిస్చార్జ్‌ను నిర్లక్ష్యం చేసే మహిళలు ఎక్కువ

ఆ తెలుపు సహజమేనా?

‘తెలుపుగానే ఉంది కదా, ఫర్వాలేదులే’ అనుకుని వైట్‌ డిస్చార్జ్‌ను నిర్లక్ష్యం చేసే మహిళలు ఎక్కువ. కానీ పలు రకాల ఇన్‌ఫెక్షన్లకు సూచనగా కనిపించే తెల్ల స్రావాన్ని తీవ్రంగానే పరిగణించి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. మరీ ముఖ్యంగా ఏది సహజమో, ఏది అసహజమో తెలుసుకోవాలి.


స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందన్నందుకు సూచనే తెలుపు స్రావం! యోని, గర్భాశయ ముఖద్వారంలోని గ్రంథులు తెల్లని స్రావంతో ఆ ప్రదేశాల్లోని మృతకణాలను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. అదే వైట్‌ డిస్చార్జ్‌! ఈ ఏర్పాటు యోనిని శుభ్రంగా ఉంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కోసమే! మహిళల్లో తెలుపు స్రావం అత్యంత సహజం. ఇది వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు పరిమాణాల్లో రంగుల్లో, గాఢతలో విడుదలవుతూ ఉంటుంది. హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవడం మూలంగా రుతుస్రావానికి ముందు, తర్వాత, అండం విడుదలయ్యే సమయంలో, చనుబాలు ఇస్తున్నప్పుడు, లైంగికోద్రేకం చెందినప్పుడు... ఈ స్రావం ఎక్కువగా విడుదలవుతుంది. అయితే ఈ లక్షణాలన్నీ ఆరోగ్యకరమైనవి కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఇది ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లకు సూచన కావచ్చు. స్రావం సహజమేనని సరిపెట్టుకుని, నెలల తరబడి ఆలస్యం చేయకూడదు. 


మహిళల జీవితంలో తెలుపు స్రావం

పసికందు మొదలుకుని, రుతుక్రమం మొదలయినప్పటి టీనేజీ వయసు నుంచి బహిష్టు ఆగిపోయే మెనోపాజ్‌ దశ వరకూ ప్రతి మహిళ జీవితంలో సహజసిద్ధమైన లేదా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా, ఏదో ఒక సందర్భంలో వైట్‌ డిస్చార్జ్‌ కనిపిస్తుంది.


పసికందులు: ఆడపిల్లలు పుట్టుకతోనే తల్లి నుంచి కొంత ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ వెంట తెచ్చుకుంటారు కాబట్టి, వీరి యోని ప్రదేశంలో కొంత వైట్‌ డిస్చార్జ్‌ కనిపించవచ్చు. కానీ దీన్ని చూసి భయపడవలసిన పని లేదు. ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఈ వైట్‌ డిస్చార్జ్‌ దానంతటదే పోతుంది.

పిల్లలు: లోదుస్తులు లేకుండా మట్టిలో, సముద్రతీరాల్లో ఆడడం వల్ల యోనిలోకి ఇసుక లాంటి ఫారిన్‌ బాడీ ప్రవేశించడం వల్ల చిన్న పిల్లల్లో కూడా వైట్‌ డిస్చార్జ్‌ కనిపించవచ్చు.

టీనేజర్లు: ఈ వయసు యువతుల్లో బహిష్టు సమయంలో శుభ్రత పాటించకపోవడం వల్ల, టాంపూన్‌, శానిటరీ న్యాప్కిన్స్‌కు చెందిన సూక్ష్మ అవశేషాలు యోనిలో మిగిలిపోవడం వల్ల, గాలి చొరబడే వీలు లేని బిగుతైన జీన్స్‌, చమట పీల్చుకోలేని లోదుస్తులు ధరించడం వల్ల వెజైనల్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. కొందరిలో యోనిని ఆరోగ్యంగా ఉంచే గుడ్‌ బ్యాక్టీరియా సంఖ్య తరిగి, పిహెచ్‌ బ్యాలెన్స్‌ తప్పడం వల్ల ‘బ్యాక్టీరియల్‌ వెజైన్మిసిస్‌’ అనే సమస్య మొదలవుతుంది. ఈ రెండు సందర్భాల్లో అసహజ వైట్‌ డిస్చార్జ్‌ కనిపించవచ్చు.

పెళ్లీడు పిల్లలు: వీళ్లలో వైట్‌ డిస్చార్జ్‌ ఎక్కువగా ఉంటుంది. లైంగికంగా చురుగ్గా ఉండడం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తరచుగా తలెత్తుతూ, ఆ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కూడా వైట్‌ డిస్చార్జ్‌ కనిపిస్తుంది. 

మెనోపాజ్‌: ఈ దశలో ఉన్న మహిళల్లో గర్భాశయ ముఖద్వారం ఎర్రగా మారి, పుండ్లు ఏర్పడి తెలుపు స్రావం కనిపించవచ్చు. ఇలాంటప్పుడు వైద్యుల్ని కలవాలి!


చికిత్స అవసరం

ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి.

  • దురద
  • మంట
  • దుర్వాసనరంగులో మార్పు (లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ)
  • కొన్ని రోజులపాటు ప్యాడ్స్‌ వాడవలసిరావడం


డయాగ్నొసిస్‌ ఇలా

శారీరక పరీక్ష, స్రావం రంగు, లక్షణాల ఆధారంగా సమస్య ఎలాంటిదనేది తేలికగానే కనిపెట్టవచ్చు. బ్యాక్టీరియల్‌, ఫంగల్‌, ట్రెకొమోనస్‌.... వీటిలో ఏ రకం ఇన్‌ఫెక్షన్‌ అనేది తెలుస్తుంది. అయితే వయసును బట్టి ఇన్‌ఫెక్షన్‌ కారణాన్ని, రకాన్ని అంచనా వేయడం కోసం కొన్ని పరీక్షలు చేయించడం తప్పనిసరి. అవేంటంటే....


టీనేజర్లు: ఈ వయసులో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణం. కాబట్టి లోకల్‌ ఎగ్జామినేషన్‌, వెజైనల్‌ స్వాబ్‌ పరీక్ష, లక్షణాల ఆధారంగా సమస్యను నిర్ధారించవచ్చు. 

మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలైతే: ప్రత్యేకమైన పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారాన్ని పరీక్షించి ఏర్పడిన తేడాలను గమనించడం, అవసరాన్నిబట్టి పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించడం. 


మధుమేహం - ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు

మధుమేహానికి వెజైనల్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు దగ్గర సంబంధం ఉంది. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో తరచుగా వైట్‌ డిస్చార్జ్‌ కనిపిస్తూ ఉంటే వైద్యులు మధుమేహ పరీక్షను సూచిస్తారు. మధుమేహం కొందర్లో వైట్‌ డిస్చార్జ్‌ ద్వారా నిర్ధారణ అవుతూ ఉంటుంది. తెల్లని, చిక్కని, పెరుగులాంటి వైట్‌ డిస్చార్జ్‌ ఉంటే అది మధుమేహం అదుపుతప్పడం వల్ల వచ్చిన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌గానే భావించాలి. వైట్‌ డిస్చార్జ్‌ సమస్యను ఎదుర్కొంటూ వైద్యులను సంప్రతించినప్పుడు, ఎక్కువ సందర్భాల్లో మధుమేహం ఉన్నట్టు నిర్ధారణ అవుతూ ఉంటుంది. కాబట్టి రక్తసంబంధీకుల్లో మధుమేహం ఉంటే, వైట్‌ డిస్చార్జ్‌ తో కూడిన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సుగర్‌ టెస్ట్‌ చేయుంచుకుని మందులు వాడాలి. ఫలితంగా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లూ అదుపులోకొస్తాయు.


నిర్లక్ష్యం ప్రమాదకరం 

మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల గర్భాశయ ముఖద్వారం లేతగా, పచ్చిగా ఉంటుంది. కాబట్టి తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లను వెంటనే గ్రహించి చికిత్స చేయకుండా వదిలేయడం తగదు. ఈ దశలో ఉన్న మహిళలు తెలుపు స్రావాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఇన్‌ఫెక్షన్‌ క్రమేపీ పెరుగుతూ కొన్ని సంవత్సరాలకు (సుమారుగా ఐదేళ్లు) గర్భాశయ ముఖద్వార కేన్సర్‌గా కూడా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి మెనోపాజ్‌ దశలో వైట్‌ డిస్చార్జ్‌ కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవాలి.


చికిత్స సులువే

  • ఇన్‌ఫెక్షన్లకు నోటి మాత్రలు, పైపూతలు ఉంటాయి.
  • బ్యాక్టీరియల్‌, వైరల్‌, ఫంగల్‌ ఈ మూడు కలిసిన మిశ్రమ ఇన్‌ఫెక్షన్లకు మూడిటికి కలిపి ఒక కిట్‌ ఉంటుంది. ఈ మాత్రలతో మొత్తం ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
  • గర్భాశయ ముఖద్వారంలో వాపు, మంట, పుండ్లు ఉన్నా మందులతో సరిదిద్దవచ్చు. 




Updated Date - 2022-07-19T16:41:10+05:30 IST