ఈక్వీటిల్లో పెట్టుబడులకు మహిళల సై

ABN , First Publish Date - 2020-09-07T06:46:17+05:30 IST

నిన్న మొన్నటి వరకు స్టాక్‌ మార్కెట్‌ అంటే అంతగా ఇష్టపడని మహిళలు ఇప్పుడు ఒక్కసారిగా ఈక్విటీ బాటపట్టారు...

ఈక్వీటిల్లో పెట్టుబడులకు మహిళల సై

  • కొవిడ్‌ కాలంలో భారీగా పెట్టుబడులు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ మారిన ట్రెండ్‌


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఈక్విటీ మార్కెట్లో పెను మార్పులు తీసుకువచ్చింది. నిన్న మొన్నటి వరకు స్టాక్‌ మార్కెట్‌ అంటే అంతగా ఇష్టపడని మహిళలు ఇప్పుడు ఒక్కసారిగా ఈక్విటీ బాటపట్టారు. కొవిడ్‌-19 కారణంగా వేతనాల్లో కోత, లేఆ్‌ఫలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న తమ జీవిత భాగస్వాములకు చేదోడువాదోడుగా నిలిచేందుకు మహిళలు ఈక్విటీ మార్కెట్లోకి అడుగుపెట్టారని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ ట్రెండ్‌ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, విశాఖపట్నం, రంగారెడ్డి వంటి ప్రాంతాలున్నాయి. ఇంటి ఖర్చుల్లో ఎంతో కొంత ‘భారం’ తీసుకునేందుకు చాలా మంది మహిళలు.. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు దిగారని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.  


ప్రత్యామ్నాయంగా..

చాలా మంది మహిళలు ఈక్విటీ పెట్టుబడులంటే జూదం గా భావిస్తుంటారు. ఎక్కడ ‘అసలు’కే మోసం వస్తుందనే భయంతో మార్కెట్‌ జోలికే వెళ్లేందుకే భయపడేవారు. చేతిలో ఉన్న మిగులు నిధులను పెద్దగా నష్ట భయం లేని బంగారం, బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో (ఎఫ్‌డీ) మదుపు చేసేవారు.  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి. బంగారం ధర అందుబాటులో లేకుండా పోయిం ది. ఇదే సమయంలో స్థిరాస్తి మార్కెట్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో చాలా మంది మహిళలు స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులను ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట్‌గా చూస్తున్నారని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న లేదా ట్రేడింగ్‌ చేస్తున్న మహిళల్లో 35 శాతానికంటే ఎక్కువ మంది గృహిణులు కావటం విశేషం. దీన్నిబట్టి చూస్తే ఈక్విటీ పెట్టుబడులపై మహిళామణులు ఎంత ఆసక్తితో ఉన్నారో అర్ధమవుతోందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. 


పెరిగిన అవగాహన  

కొవిడ్‌ని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో చాలా మంది స్త్రీలు, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులపై అవగాహన పెంచుకున్నారు. మార్కెట్లో మహిళల పెట్టుబడులు పెరగడానికి ఇది కూడా కారణమని బీఎన్‌పీ పారిబా నిర్వహణలోని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ‘షేర్‌ఖాన్‌’ డైరెక్టర్‌ శంకర్‌ వైలాయ చెప్పారు. అంతేకాకుండా మహిళలు ప్రారంభించిన డీమ్యాట్‌  ఖాతాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయన్నారు. కాగా ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మహిళలు ప్రారంభించిన డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 32 శాతం పెరిగాయని ఆన్‌లైన్‌ బ్రోకరేజీ సంస్థ అప్‌స్టాక్స్‌ వెల్లడించింది.  ఇందులో 70 శాతం మంది తొలిసారిగా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు దిగిన మహిళలు కావటం విశేషమని పేర్కొంది. కాగా 74 శాతం మహిళా కస్టమర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన విశాఖపట్నం, గుంటూరు, రంగారెడ్డి, జైపూర్‌, సూరత్‌ నాసిక్‌, నాగ్‌పూర్‌ వంటి నగరాల నుంచే ఉన్నారని అప్‌స్టాక్స్‌ తెలిపింది. మరోవైపు యాక్టివ్‌గా ఉన్న మహిళా కస్టమర్లలో 55 శాతం ట్రేడర్లుగా ఉంటే 45 శాతం మంది ఇన్వెస్టర్లుగా ఉన్నారని జెరోధా కో ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌ తెలిపారు.

Updated Date - 2020-09-07T06:46:17+05:30 IST