త్యాగమయి

ABN , First Publish Date - 2021-03-06T06:05:35+05:30 IST

ఆమె.. అన్న రెండక్షరాలు సృష్టికే స్థితిలయలు అయ్యాయి జగతికే జన్మకారకురాలయిన మాతృత్వశక్తి ఆమెలోనే ఉంది....

త్యాగమయి

ఆమె..

అన్న రెండక్షరాలు

సృష్టికే స్థితిలయలు అయ్యాయి

జగతికే జన్మకారకురాలయిన

మాతృత్వశక్తి ఆమెలోనే ఉంది

పాలన ఆమెదే లాలన ఆమెదే!

పురుషుడి అధికారరథం

ఇరుసు ఆమెయే..


ఆమె పాత్ర లేనిదే జీవితరంగస్థలం

మీద ఏదీ రక్తి కట్టదు 

కానీ లైంగిక వివక్ష ఆమె పాలిట శాపం!


ఆమె పుట్టుక 

కన్న తల్లిదండ్రులకే అయిష్టం

ఆమె పోషణ రక్షణ 

వాళ్ళ దృష్టిలో పెద్ద భారం

సమాజం తప్పులు వెదకటానికి

ఆమె జీవితం ఓ జవాబు పత్రంలా

రెపరెపలాడుతుంటుంది

తప్పు పురుషుడిదే అయినా 

అగ్నిపరీక్ష మాత్రం ఆమెకే..


సంఘం కుళ్లిపోయినా 

భర్త కుష్టురోగి అయినా

సహనశీలియై భరించింది.. 

‍చనిపోయినా యముడితో

పోట్లాడి పతిని దక్కించుకుంది

మగాడు తాళలేనన్ని బాధలకు

గురి చేసినా తాను కాలిపోతూ కూడా

వెలుగయ్యే గొప్ప త్యాగమయి స్త్రీ..!!


భీమవరపు పురుషోత్తం

(మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

Updated Date - 2021-03-06T06:05:35+05:30 IST