మహిళా దీప్తి

ABN , First Publish Date - 2022-06-01T10:16:10+05:30 IST

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తొలిస్థానాలను అమ్మాయిలు కైవసం చేసుకోవడం సంతోషించవలసిన పరిణామం....

మహిళా దీప్తి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తొలిస్థానాలను అమ్మాయిలు కైవసం చేసుకోవడం సంతోషించవలసిన పరిణామం. మొదటి మూడుర్యాంకులూ సాధించడమే కాక, తొలి పాతికర్యాంకుల్లోనూ పదిమంది మహిళలే. దాదాపు 11లక్షలమంది దరఖాస్తు చేసుకొని, ఓ ఐదులక్షలమంది పరీక్షకు కూచుంటే, మూడుదశల వడపోత ప్రక్రియలనూ దాటి తుదిఫలితాల్లో నిలిచి నిగ్గుతేలిన 685 మందిలో మహిళలు 177మంది. అత్యున్నతమైన, అత్యంతకఠినమైన ఈ పరీక్షలో నెగ్గుకురావడానికి కృషి, పట్టుదలతో పాటు అత్మవిశ్వాసం కూడా అధికంగానే ఉండాలి. గతంలోనూ మహిళలు తొలివరుసలో నిలిచినా, మొదటి మూడుర్యాంకులూ దక్కడమన్నది ఏడేళ్ళ తరువాత ఇదే.


విజేతలు ఎంపిక చేసుకున్న ఐచ్ఛికాలనుంచి, ఏళ్ల తరబడి వారు పడిన కష్టాలవరకూ మీడియా వివరిస్తున్నది. తొలిర్యాంకు సాధించిన శృతిశర్మకు జెఎన్‌యూతో ఉన్న బంధాన్నీ, ఆమె జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్న విషయాన్నీ కొందరు ప్రత్యేకంగా గుర్తుచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందచేసే ఈ సంస్థను ‘యూపీఎస్సీ జిహాద్’ కేంద్రంగా అభివర్ణిస్తూ రెండేళ్ళక్రితం ఒక టెలివిజన్ ఛానెల్ పాలకుల పరోక్ష అండదండలతో ఓ సిరీస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఫలితాల్లో ఈ సంస్థనుంచి 23మంది విజేతలుగా నిలిచారట. ఇక, సివిల్స్ సాధించడానికి ఎవరైనా శ్రమించవలసిందే కానీ, ఈ మారు తొలిస్థానాలు అమ్మాయిలవే కావడంతో మొత్తంగా మహిళా విజేతల నేపథ్యాలను, విజయసాధనలో వారు పడిన శ్రమనూ, ఎదుర్కొన్న కష్టనష్టాలను మీడియా విశేషంగా వివరిస్తున్నది. సివిల్ సర్వీసెస్‌లో ఇప్పటికీ కూడా ఆధిపత్యం, ఆధిక్యత మగవారిదే కనుక, ఈ మహిళా విజయాలను గుర్తించి గౌరవించడం సముచితం. 1951లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తొలి మహిళ చేరినప్పటినుంచి రెండేళ్ళక్రితం వరకూ మొత్తం ఐఏఎస్ అధికారుల్లో మహిళలున్నది ఐదోవంతు లోపే. పరీక్ష పాసై ఇంటర్వ్యూకు వచ్చిన రాజమ్ జార్జి అనే ఆ తొలి మహిళను ఇంటర్వ్యూ బోర్డు వేరే సర్వీసులు ఎంచుకోమంటూ నిరుత్సాహపరచేందుకు ఎంతగానో ప్రయత్నించి, చివరకు వివాహం చేసుకున్న మరుక్షణం ఉద్యోగం తీసేస్తామన్న నిబంధనతో అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చిందని అంటారు. తరువాతి కాలంలో పలు నిబంధనలు మారినప్పటికీ, 1970 వరకూ సివిల్స్‌లోకి మహిళల ప్రవేశం పెద్దగా ఊపందుకోలేదు. లింగసమానత్వం గురించి మాట్లాడటం వేరు, తదనుగుణంగా చర్యలు తీసుకోవడం వేరు. మహిళల ప్రాతినిథ్యం పెరిగినప్పుడు ప్రజాపాలనలో నాణ్యమైన మార్పు వస్తుందని పార్లమెంటులో పాలకులు ఒప్పుకుంటారు కానీ, తదనుగుణమైన నిర్ణయాలు కనబడవు. అసలు పరీక్షకు కూచొనేవారిలో మహిళల సంఖ్య ముప్పైశాతం ఉండటమన్న విచిత్రం కూడా ఇటీవలి కాలంలో 2017లో మాత్రమే జరిగిందని అంటారు. తయారీకి సుదీర్ఘకాలం పట్టడం, కొద్ది ప్రయత్నాల్లోనే విజేతలు కాలేని పక్షంలో పెళ్ళీడు దాటిపోతున్నదని తల్లిదండ్రులు భయపడటం మహిళలకు మాత్రమే ఉన్న ఓ పెద్ద అడ్డంకి. ఎక్కడో నగరాల్లో ఉన్న శిక్షణా కేంద్రాలకు ఆడపిల్లలను పంపడానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం కూడా ఈ సంఖ్య స్వల్పంగా ఉండటానికి మరో కారణం. నిజానికి ఐఎఎస్‌కు ఎంపికైన అమ్మాయిల్లో కనీసం సగం మంది 26 ఏళ్ళలోగానే లక్ష్యాన్ని సాధించగలిగినప్పటికీ, మొత్తంగా అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు తక్కువసార్లు మాత్రమే ప్రయత్నించి వదిలివేస్తున్నట్టు డేటా చెబుతోంది.


ఇక, ఐఎఎస్ అయిన తరువాత కూడా ఆడవారి విషయంలో పైకి కనిపించని వివక్ష అమలవుతోందని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఉన్నతస్థానాల్లో మహిళలకు చోటివ్వని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. యావత్‌ దేశంలో రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మహిళా అధికారుల సంఖ్య మహా అయితే రెండు మూడులోపే ఉండవచ్చు. కేంద్రంలో కూడా భిన్నమైన వాతావరణమేమీ లేదు. కీలకమైన విభాగాల్లోనూ వారికి స్థానం ఉండదు. స్వచ్ఛంద పదవీవిరమణలో కూడా మహిళలే ముందంజలో ఉంటున్నారట. అందువల్ల, ఈ జెండర్ వివక్షను సమూలంగా సర్వనాశనం చేసే ప్రత్యేక ప్రయత్నం ఒకటి జరగడం అవసరం. మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేదిశగా కేంద్రప్రభుత్వం చొరవ చూపినప్పుడు మొదటి మూడుస్థానాలే కాదు, పాతికస్థానాలూ గెలుచుకొనే శక్తి మహిళలకు ఉంది.

Updated Date - 2022-06-01T10:16:10+05:30 IST