రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ

ABN , First Publish Date - 2022-07-06T04:44:25+05:30 IST

విద్యలో బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందున

రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ
నందిగామ : చేగూర్‌ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి

  • త్వరలో ప్రారంభించబోతున్నామన్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 

షాద్‌నగర్‌/నందిగామ/కొందుర్గు/కొత్తూర్‌/షాద్‌నగర్‌అర్బన్‌, జూలై 5 : విద్యలో బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందున త్వరలోనే రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ప్రారంభించబోతున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామ, నర్సప్పగూడ, చేగూరు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.27కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ సురభివాణిదేవితో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే కొందుర్గు మండల పరిధిలోని ముట్పూర్‌ గ్రామంలో రైతువేదిక, వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా షాద్‌నగర్‌ పట్టణంలోని పరిగి రోడ్డులో నూతనంగా నెలకొల్పిన ఏబీవీ మల్టిస్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి తిమ్మాపూర్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనస్వాగతం పలికి శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వెలువడిన ఇంటర్‌, పదోతరగతి పరీక్షల్లో విద్యార్థినిలు సాధించిన ఫలితాలు, ర్యాంకులు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తు అంతా బాలికలదేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో విద్యను మరింత బోలోపేతం చేసేందుగాను సర్కారు ‘మన ఊరు..మన బడి’ ప్రణాళిక కింద రూ.7వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. వీటితో 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించనున్నట్లు చెప్పారు. మొదటి విడతగా రూ.3వేల కోట్లు మంజూరయ్యాయన్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ఛైర్మన్‌ ఈటగణేష్‌, జడ్పీటీసీలు ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, తాండ్ర విశాల, ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌ గౌడ్‌,  డీసీసీబీ డైరెక్టర్‌ కంకటి మంజులరెడ్డి, రాజేష్‌ పటేల్‌, బి. దేవేందర్‌యాదవ్‌, శివశంకర్‌గౌడ్‌, డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-06T04:44:25+05:30 IST