వైసీపీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-29T07:47:05+05:30 IST

అప్పుల బాధ తాళలేనంటూ ఓ మహిళ వైసీపీ కార్యాలయం ఎదుట రోడ్డులో విషం తాగిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం కలకలం రేపింది.

వైసీపీ కార్యాలయం ఎదుట    మహిళ ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధతో విషం తాగిన వైనం

చికిత్స పొందుతున్న మైసూరు బత్తెమ్మ

శ్రీకాళహస్తి, జూన్‌ 28: అప్పుల బాధ తాళలేనంటూ ఓ మహిళ వైసీపీ కార్యాలయం ఎదుట రోడ్డులో విషం తాగిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం కలకలం రేపింది. బాధితురాలి రెండవ కుమార్తె కుమారి కథనం మేరకు... శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట శీతాలాంబ ఆలయ ప్రాంతానికి చెందిన మైసూరు బత్తెమ్మ(55)రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ముగ్గురు ఆడ పిల్లలున్నారు.వారు చిన్నవయసులో ఉండగానే భర్త వదిలి వెళ్లిపోవడంతో బత్తెమ్మ సంపాదనే కుటుంబానికి ఆధారమైంది.మొదటి కుమార్తె సావిత్రిని 7వ తరగతి వరకూ చదివించి పెళ్లి చేసింది. ఇక రెండవ కుమార్తె కుమారిని 10వ తరగతి వరకూ చదివించి నాలుగు నెలల క్రితం వివాహం చేసింది.మూడో కుమార్తె ప్రశాంతి ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతోంది.కొత్తపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నాలుగు నెలల క్రితం బత్తెమ్మ రూ.2లక్షలు అప్పు చేసింది.అప్పటి నుంచి కుటుంబపోషణకే సంపాదన సరిపోతుండడంతో వడ్డీ కూడా చెల్లించలేకపోయింది. దీంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో దిక్కుతోచక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని కలిసి తన సమస్యను విన్నవించి అప్పుల వారినుంచి కొంత గడువు పొందాలని భావించింది.మంగళవారం రెండవ కుమార్తె కుమారిని వెంటబెట్టుకుని స్థానిక వైసీపీ కార్యాలయంలోకి వెళ్లింది. వైసీపీ జిల్లా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే తిరుపతి వెళ్లిన విషయం తెలిసి కార్యాలయం నుంచి వెలుపల రోడ్డుపైకి వచ్చింది. వెంట తెచ్చుకున్న విషం(వెంట్రుకలు నల్లబడేందుకు వినియోగించే తైలం) సేవించి కుప్పకూలింది. కూతురు గట్టిగా కేకలు వేయడంతో వైసీపీ కార్యాలయ సిబ్బంది గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాస్పత్రికి పంపారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2022-06-29T07:47:05+05:30 IST