Abn logo
Apr 7 2021 @ 23:52PM

మహిళా పురోహితులు!

పౌరోహిత్యం పురుషులకే ఎందుకు పరిమితం?

బ్రాహ్మణులు, పురుషులు కాని వారు పౌరోహిత్యం ఎందుకు చేయకూడదు?

ఇలాంటి ప్రశ్నలతో పురాణాలు, చారిత్రక 

పుస్తకాలను శోధించిన ఓ మహిళ...

మరో ముగ్గురు మహిళలతో కలిసి పౌరోహిత్యం చేపట్టింది!

శుభమస్తు పేరుతో ఎన్నో జంటలను ఒక్కటి చేసిన ఆ మహిళా పురోషితురాలు, పూజారి... 

కోల్‌కతాకు చెందిన 59 ఏళ్ల నందిని భౌమిక్‌!


‘‘పెళ్లి పేరుతో అమ్మాయి తలను పవిట చెంగుతో కప్పి, జీవితాంతం భర్త తప్ప పరాయి పురుషుల కంట పడడానికి వీలు లేకుండా చేస్తారు. ఇక పాపిట సింధూరం దిద్దిన వెంటనే ఆమె ముఖాన్ని దాచేస్తారు. పెళ్లి తంతు ముగిసేవరకూ సమాజం కోసం ఆమె సిగ్గుతో తల దించుకునే ఉండాలి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇదే తరహా సంప్రదాయం ఆచరించడం అవసరమా? ఇలాంటివే కొన్ని భారతీయ సంప్రదాయాలు లోతైన పరిశోధన వైపు నన్ను పురిగొల్పాయి. భారతీయ వివాహ సంప్రదాయాల గురించిన నా పరిశోధనలో రూమా రాయ్‌, సేమంతి బెనర్జి, పౌలోమి చక్రవర్తి నాకు తోడయ్యారు. మేమంతా ఒకే రకమైన ఆలోచనా ధోరణి కలిగినవాళ్లం. రూమ, నేను సంస్కృత విద్యార్ధులం. ఇద్దరం కలిసి చారిత్రక పుస్తకాలు తిరగేసి, మహిళలు చేయదగిన గౌరవప్రదమైన వృత్తుల గురించి పరిశోధించాం. దొరికిన వాటిలో మాకు నచ్చినవి ఎంచుకున్నాం. సేమంతి, పౌలోమి స్త్రీపురుష తారతమ్యాలు లేని పూర్వ సమాజానికి సంబంధించిన కొన్ని ఠాగూర్‌ గేయాలు, ఆధునిక బెంగాలీ పాటలు ఎంచుకున్నారు. నేను పౌరోహిత్యాన్ని ఎంచుకున్నాను. ఈ నిర్ణయానికి మూలాలు నా కాలేజీ రోజుల్లోనే పడ్డాయని చెప్పవచ్చు. 


పెళ్లి మంత్రాలన్నీ అర్థమయ్యే భాషల్లోనే...

సంస్కృతం ప్రొఫెసర్‌ గౌరీ ధర్మపాల్‌ అభ్యుదయ భావాలు కలిగిన మహిళ. రూమ, నేను ఆవిడ విద్యార్థులం. వేదపారాయణం, శ్లోకాల పఠనం, క్రతువులు మొదలైనవెన్నో ఆవిడ మాకు నేర్పించేవారు. అయితే పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఆవిడను చాలా ఏళ్ల తర్వాత కలిశాం. ఆ సమయంలో ఆవిడ మాకు భారతీయ బెంగాలీ వివాహ తంతును సులువైన తీరులో ఎలా జరిపించవచ్చో నేర్పించారు. అప్పటికి కొద్ది రోజుల్లో నా కూతురు వివాహం ఉంది. ఆ పెళ్లికి నేనే పౌరోహిత్యం చేయాలనే ఆలోచన ఉండడంతో పెళ్లి తంతు మొత్తం ఆసక్తిగా నేర్చుకున్నాను. అలా పురోహితురాలిగా మొట్టమొదటి పెళ్లి జరిపించాను. నాతో పాటు నా ముగ్గురు స్నేహితురాళ్లు కలిశారు. అలా పెళ్లి తంతుతో పాటు, పరలౌకిక పూజ, అన్నప్రాసన, గృహప్రవేశం... ఇలా మా శుభమస్తు సంస్థ ద్వారా 2009 నుంచి నాలుగు రకాల వేడుకలను జరిపిస్తున్నాం. ఈ వేడుకల్లో మంత్రాలన్నీ అందరికీ తేలికగా అర్థమయ్యేలా సంస్కృతానికి బదులు హిందీ, లేదా బెంగాలీ భాషల్లో, రవీంద్రసంగీతంతో కలిసి సాగుతాయి.


పెళ్లిళ్లలో చదివే సంస్కృత మంత్రాలకు కొత్త దంపతులు అడిగి మరీ అర్థం తెలుసుకుంటూ ఉంటారు. ఎవరికీ అర్థం కాని సంస్కృత మంత్రాలతో పెళ్లి జరిపించడం కంటే మరీ ముఖ్యంగా పెళ్లి బాసలు దంపతులిద్దరూ అర్థం చేసుకునే ఆచరించేలా ఉండాలనే ఆలోచనతోనే ఇలా తంతును జరిపిస్తూ ఉంటాం. అయితే మా ప్రయాణ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. మమ్మల్ని, మా పనులను తేలికగా చూసిన సందర్భాలూ ఉన్నాయి. పూర్వం నుంచీ మనుగడలో ఉన్న వేడుకలు కావడంతో, వాటి నిర్వహణ పట్ల ఓ స్థిరాభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నాం. హఠాత్తుగా పురుషుల స్థానంలో మహిళా పురోహితులను ఊహించుకోవడం ఎవరికైనా కష్టమే! కాబట్టి ఓర్పుతో మసులుకున్నాం. ప్రారంభంలో ఇబ్బందులు పడినా, మా ప్రయత్నం గురించి వివరించిన తర్వాత క్రమేపీ ఆదరణ పెరిగింది.


పవిత్రత మహిళల్లోనే...

మహిళలు పూజారులుగా పనికిరారు అంటారు. నెలసరిలో ఐదు రోజులు మహిళలు అపవిత్రులుగా పరిగణించబడుతూ ఉంటారు. అలాగే నెలసరి వయసులో ఉన్న మహిళలు పూజలు ఆచరించడానికీ, నిర్వహించడానికీ, ఎటువంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికీ వీలుండదు. ఈ ఆచారాలన్నిటికీ 21వ శతాబ్దంలో స్థానం లేదు. నెలసరి అనేది ప్రకృతిసహజంగా మహిళల శరీరాల్లో జరిగే ఓ జీవక్రియ. నిజానికి మాతృత్వం దక్కేది దాన్నుంచే కాబట్టి, ప్రతి మహిళా నెలసరిని సెలబ్రేట్‌ చేసుకోవాలి. మాతృత్వ గుణాలు మహిళల ఔన్నత్యాన్ని పెంచుతాయి. అలాంటప్పుడు మహిళలు అపవిత్రులు ఎలా అవుతారు? పవిత్రతను అలా లెక్కించడం సరి కాదు. అబద్ధం చెప్పడం, దెబ్బలాడడం లాంటి గుణాలు మనిషిని అపవిత్రపరుస్తాయి.

నేను చేపట్టిన వృత్తికి నా కుటుంబం నుంచి నాకు పూర్తి మద్దతు ఉంది. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు నా పౌరోహిత్యంలోనే జరిపించాను. ప్రారంభంలో నా నిర్ణయానికి కుటుంబసభ్యులు కొంత భయపడిన మాట వాస్తవం.  అయితే క్రమేపీ నామీద వారికి నమ్మకం పెరిగింది. ఎంతోమంది మహిళలు నా స్ఫూర్తితో పౌరోహిత్యం నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement