జోరు సాగాలి..

ABN , First Publish Date - 2022-03-16T09:14:36+05:30 IST

తొలి టైటిల్‌ వేటలో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు బుధవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఎదుర్కొనబోతోంది.

జోరు సాగాలి..

ఉదయం 6.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో...

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ మ్యాచ్‌

మహిళల వన్డే వరల్డ్‌కప్‌


మౌంట్‌ మాంగనుయ్‌: తొలి టైటిల్‌ వేటలో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు బుధవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఎదుర్కొనబోతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలుపులతో మిథాలీ సేన జోష్‌లో ఉంది. ముఖ్యంగా తమ చివరి మ్యాచ్‌లో విండీ్‌సను 155 పరుగుల తేడాతో ఓడించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ భారీ విజయంతో పట్టికలోనూ మూడోస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు అదే నిలకడైన ఆటతీరును ఇంగ్లండ్‌పైనా చూపాలనుకుంటోంది. కివీ్‌సతో మందకొడి ఆటతీరుతో విమర్శలపాలైనప్పటికీ.. విండీ్‌సపై మాత్రం భారత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్‌ స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్‌ శతకాలతో తమ వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేయగలిగింది. అయితే సెమీ్‌సకు చేరే క్రమంలో ఈ ఇద్దరితో పాటు ఆల్‌రౌండర్‌ దీప్తీ శర్మ, కెప్టెన్‌ మిథాలీ కూడా బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల రిచా ఘోష్‌ ఈ టోర్నీలో మెరుగ్గా ఆడలేకపోతోంది.


బౌలింగ్‌ విభాగంలో పేసర్లు జులన్‌, మేఘనా సింగ్‌, పూజ జట్టుకు అండగా ఉంటున్నారు. స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్‌, స్నేహ్‌ రాణా పొదుపుగా బౌలింగ్‌ చేస్తుండడంతో పాటు వికెట్లను సాధిస్తుండడం సానుకూలాంశం. మరోవైపు హీథర్‌ నైట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఏడో స్థానానికి దిగజారింది. అలాగే డెత్‌ ఓవర్లలో వేగంగా ఆడలేక పోతుండడం, పేలవ ఫీల్డింగ్‌ జట్టు ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఓపెనర్‌ టామీ బ్యూమంట్‌ రాణిస్తుండగా.. స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌, ఆల్‌రౌండర్‌ నాట్‌ స్కివర్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఏదేమైనా సెమీస్‌ ఆశలు నిలుపుకోవాలంటే ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ ఓడితే రేసు నుంచి వైదొలిగినట్టే.


జట్లు (అంచనా)

భారత్‌:

యాస్తిక, మంధాన, దీప్తీ శర్మ, మిథాలీ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌, రిచా ఘోష్‌, స్నేహ్‌ రాణా, పూజా వస్త్రాకర్‌, జులన్‌ గోస్వామి, మేఘనా సింగ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌.


ఇంగ్లండ్‌:

టామీ బ్యూమంట్‌, డానియల్‌ వ్యాట్‌, హీథర్‌ నైట్‌ (కెప్టెన్‌), స్కివర్‌, ఎలెన్‌ జోన్స్‌, సోఫియా డంక్లే, బ్రంట్‌, ఎకెల్‌స్టోన్‌, కేట్‌ క్రాస్‌, చార్లెట్‌ డీన్‌, ష్రబ్‌సోల్‌. 

Updated Date - 2022-03-16T09:14:36+05:30 IST