Abn logo
Sep 26 2021 @ 00:17AM

కూతురే కానుక

కంటే కూతురినే కనాలంటున్న తల్లిదండ్రులు

కాలానుగుణంగా ఆడపిల్ల వైపే మొగ్గు

గతంలో కూతురంటే భారంగా భావించేవారు..

వారసత్వం కోసం కొడుకును కనాలని తపన

కానీ.. మారిన పరిస్థితుల్లో మలిదశలో కూతుళ్లే చూస్తారని నమ్మకం

నేడు అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం

 

కూతురు ఉన్న ఇల్లు కాంతిమయం. కుమార్తెను కన్నవారి జన్మ ధన్యం... కూతురంటే గౌరవం.. నమ్మకం.. అవును.. కూతురు పుట్టింది.. అని ఆనందంగా చెప్పుకొనే రోజులు వచ్చాయి. మలిదశలో తమను చూసుకునేది కన్నకూతురేననే భావనలోకి తల్లిదండ్రులు వచ్చారు. అందుకే.. కంటే కూతుర్నే కనాలి అని ఆశ పడుతున్నారు. 

 

గుంటూరు(సంగడిగుంట), సెప్టెంబరు 25: కంటే కూతుర్నే కనాలిరా.. తెలుగు సినిమాలోని ఈ పాట నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది. కూతురు పుడితే ఒకప్పుడు తల్లిదండ్రుల్లో నూన్యత భావం ఉండేది. అదేదో భారంగా భావించేవారు. అదిప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒక్క కూతుర్నయినా కనాలని ప్రతి దంపతులు ఆశిస్తున్నారు. ఇది ఒక ఏడాదిలోనే, ఒక తరంలోనే వచ్చిన మార్పు కానేకాదు. పాతుకుపోయిన పురుషాధిక్య ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను, అవమానాలను ఎదుర్కొని ఎన్నో ఒత్తిడిలను తట్టుకొన్ని ఎందరో కుమార్తెలు తమ కుటుంబాలను నిలబెట్టారు. తల్లిదండ్రులకు వెన్నెముకగా నిలిచారు. 

 


వారసత్వమే అసలు సమస్య..

ఓ కుమారుడిని కనాలి అనుకునేవారు బలంగా నమ్మే కారణం వారసత్వం..! ఇటువంటి వారసత్వాన్నే సమాజం కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కారణంగా ఎక్కువ మంది అబ్బాయి వైపు మొగ్గు చూపుతుంటారు. ఇక రెండో కారణం ఆర్థిక పరిస్థితి. ఇది కొన్ని దశాబ్దాల్లో క్రమంలో క్రమంగా మారింది. ఒకప్పుడు ఆడపిల్లను పెద్దగా చదివించేవారు కాదు. పైగా పెళ్లికి కట్నం ఇవ్వాలి. కానీ నేటి పరిస్థితుల్లో కుటుంబ పోషణలో ఆడపిల్లకూడా భాగస్వామిగా మారింది. మలిదశలో చేదోడువాదోడుగా ఉండేది కూడా కూతురే అని కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి. కుమారుడుకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా కోడళ్ల మాట విని.. లేదంటే ఉద్యోగ, సంపాదన బాధ్యతల్లో బిజీ అయి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికీ అనుభవం అయింది. ఇదే క్రమంలో తమ అత్తమామలను చూసుకునేందుకు అల్లుళ్లు కూడా తమ భార్యకు ఎటువంటి షరతులు పెట్టడం లేదు. దీంతో కుమార్తె అయితేనే బాగుంటుందనే భావన ఏర్పడింది.  


70శాతం కూతుళ్లే.. 

గుంటూరు నగరంలో ఏ ఆస్పత్రికి అయినా వెళ్లండి. 60ఏళ్ల పైబడి చికిత్స పొందుతున్న వారి ఆలనాపాలనా చూసే కూతుళ్లే కనపడతారు.  అంతెందుకు ఇటీవల కరోనా విజృంభించిన రెండు దశల్లోను ఎంతోమంది విగతజీవులయ్యారు. కనీసం చనిపోయిన వ్యక్తి మొహం చూసే పరిస్థితి కూడా లేదు. ఈ దుస్థితిలో కూడా తల్లిదండ్రుల అంతక్రియల కార్యక్రమాలను ఎక్కువమంది కూతుళ్లే జరిపించారని గుంటూరులోని అమ్మ ట్రస్ట్‌ ప్రతినిధి తెలిపారు. 

 

 దత్తతకూ కూతురే..

ఎవర్ని కనాలనేది మనం నిర్ణయించలేం. కానీ పలు కారణాల చేత బిడ్డలు కనలేని తల్లిదండ్రులు ఆడపిల్లలనే దత్తత తీసుకునేందుకు మందుకు వస్తున్నారు. మహిళా సంక్షేమ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 100మంది దంపతులు దరఖాస్తు చేస్తే అందులో 90మంది ఆడపిల్లనే కావాలి అని అడుగుతున్నరంటే.. తల్లిదండ్రుల ఆలోచన విధానం ఏవిధంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కూతురైతే మలిదశలో తమని బాధ్యతగా చూసుకుంటుందనే భావన సమాజంలో బలపడుతోందనే దానికి ఇది నిదర్శనం

 

కుమార్తెల దినోత్సవ నేపథ్యం..

అంతర్జాతీయంగా ముఖ్యంగా అగ్రరాజ్యాలలో సైతం ఒకప్పుడు మహిళలకు కనీసం ఓటుహక్కు కూడా లేని పరిస్థితి. దానిని దాటుకుని పురుషునితో సమానంతా స్ర్తీ అన్ని రంగాల్లో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటున్న సందర్భంలో కుమార్తెల దినోత్సవాన్ని నిర్వహించాలని 2010లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అయితే ఏ రోజున నిర్వహించాలనే నిర్ణయాన్ని ఆయా దేశాలకు వదిలేసింది. మనదేశంలో సెప్టెంబరు చివరి ఆదివారాన్ని కుమార్తెల దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు.  

 

మగపిల్లలున్నా.. వృద్ధాశ్రమాల్లో..

పాత గుంటూరులోని డొంకరోడ్డులో రెండు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అక్కడ మొత్తం  50 మంది పండుటాకులు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 20 శాతంమంది అసలు పిల్లలు లేనివారు.. లేదా పుట్టి చనిపోయినవారు. మిగిలిన 80 శాతం మంది ఒకరు లేదా ఇద్దరు మగపిల్లలు ఉన్నావారే. వృద్ధులైన తల్లిదండ్రులపై కొంతమంది మగపిల్లలు ఎలాంటి ఆదరణ చూపుతున్నారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.  


పరిస్థితులు మారాయి...

నేను 1989నుంచి గైనకాలజిస్ట్‌గా ఎన్నో కాన్పులను చేశాను. తొలినాళ్లలో పుట్టింది ఆడపిల్ల అని తల్లిదండ్రులకు చెబితే మనస్ఫూర్తిగా సంతోషించే వారి సంఖ్య తక్కువగా కనబడేది. రెండోకాన్పులో కూడా ఆమెకు ఆడపిల్లే పుడితే కాన్పు సమయంలోనే తల్లి కూడా కొంత బాధపడేది. అప్పుడు సమాజంలో ఆడపిల్లల తల్లి అన్న చిన్నచూపే ఉండేది. మగ పిల్లవాడి కోసం నాలుగు కాన్పులో ఆడపిల్లలను కన్నవాళ్లను కూడా చూశాను  ఆడపిల్లను వదిలేసి వెళ్లేవారు కూడా ఉన్నారు.  కానీ నేడు పరిస్థితులు మారాయి. ఒక్క అమ్మాయి అయినా కావాలి అని దంపతులు కోరుకుంటున్నారు. కూతుళ్లయితే మలి దశలో అండగా నిలుస్తారనే బలమైన అభిప్రాయామే దీనికి ప్రధాన కారణం.

- డాక్టర్‌ నీలం ప్రభావతి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌