మహిళల ఐపీఎల్‌ వచ్చేస్తోంది..

ABN , First Publish Date - 2022-08-13T09:32:53+05:30 IST

పధ్నాలుగేళ్లుగా భారత క్రికెట్‌ అభిమాను లను అలరిస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఇప్పుడు మహిళల విభాగంలోనూ రాబోతోంది

మహిళల ఐపీఎల్‌  వచ్చేస్తోంది..

మార్చిలో నిర్వహణ 

బరిలో ఆరు జట్లు!

న్యూఢిల్లీ: పధ్నాలుగేళ్లుగా భారత క్రికెట్‌ అభిమాను లను అలరిస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఇప్పుడు మహిళల విభాగంలోనూ రాబోతోంది. వచ్చే ఏడాది మార్చిలో తొలి సీజన్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే మహిళల దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌లో ఈ మేరకు మార్పులు చేశారు. నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు ఉండే ఈ క్యాలెండర్‌ను ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఒక నెల ముందుకు జరిపారు. దీంతో 2022-23 సీనియర్‌ మహిళల సీజన్‌ అక్టోబరు 11న టీ20 టోర్నీతో ఆరంభమై వచ్చే ఫిబ్రవరిలో ఇంటర్‌ జోనల్‌ వన్డే పోటీలతో ముగుస్తుంది. 2018 నుంచి ఐపీఎల్‌ మధ్యలో మూడు జట్లతో మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తోంది.


ఇందులో స్వదేశ క్రికెటర్లే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్లేయర్స్‌ పాల్గొంటు న్నారు. అయితే కొవిడ్‌ కారణంగా 2021లో మాత్రం సాధ్యం కాలేదు. కానీ పురుషుల తరహాలోనే మహిళలకు కూడా ఐపీఎల్‌ నిర్వహిస్తే బావుంటుందని చాలా కాలంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తద్వారా భారత క్రికెటర్ల ఆటతీరులోనూ గణనీయమైన మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికి తగ్గట్టు గానే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యుఐపీఎల్‌) ఏర్పాటు గురించి బోర్డు అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్‌ కచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. మరోవైపు సెప్టెంబరులో జరిగే బోర్డు ఏజీఎంలో ఈ లీగ్‌ గురించి చర్చించాక పూర్తి వివరాలను వెల్లడిస్తారు.


ఆరు జట్లు.. 19 మ్యాచ్‌లు!

ఆరంభ మహిళల ఐపీఎల్‌ను ఆరు జట్లతో నిర్వహించే అవకాశం ఉంది. పురుషుల ఐపీఎల్‌ మార్చి చివర్లో జరగనుండగా అంతకన్నా ముందే ఈ లీగ్‌ను ముగిస్తారు. మొత్తంగా 24 రోజుల పాటు 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది కూడా ప్లేఆ్‌ఫ్సతో ముగుస్తాయి. గతంలోనే మహిళల ఐపీఎల్‌పై ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుకూలంగా మాట్లాడాయి. ఇప్పుడు ఈ లీగ్‌లో జట్లను తీసుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ప్లేయర్స్‌ వేలం జరిగే అవకాశం ఉండగా.. ప్రస్తుత ఐపీఎల్‌ జట్లకే మహిళల టీమ్స్‌ను కొనుగోలులో పాముఖ్యం ఇవ్వనున్నట్టు బోర్డు అధికారి తెలిపాడు. 

Updated Date - 2022-08-13T09:32:53+05:30 IST