స్త్రీ నిధి రుణాలు.. అభ్యున్నతికి బాటలు

ABN , First Publish Date - 2022-06-29T05:52:56+05:30 IST

పొదుపు సంఘాలు మహిళా సాధికారితకు దోహదపడుతున్నాయి. మహిళలు తాము దాచుకున్న డబ్బుకు తోడుగా బ్యాంకు రుణాలు పొంది స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబ పోషణలో భాగస్వాములవుతున్నారు

స్త్రీ నిధి రుణాలు.. అభ్యున్నతికి బాటలు

ఈ ఏడాది పంపిణీ లక్ష్యం రూ.190.47 కోట్లు

సంగారెడ్డి జిల్లాలో 25,648 ఎస్‌హెచ్‌జీలు, 2.50 లక్షల మంది సభ్యులు


సంగారెడ్డిటౌన్‌,జూన్‌28: పొదుపు సంఘాలు మహిళా సాధికారితకు దోహదపడుతున్నాయి. మహిళలు తాము దాచుకున్న డబ్బుకు తోడుగా బ్యాంకు రుణాలు పొంది స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ కుటుంబ పోషణలో భాగస్వాములవుతున్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తుండడంతో సంఘాల్లోని సభ్యులకు రుణాలు సులభంగా అందుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం స్ర్తీ నిధి రుణ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కార్యాచరణను మొద లుపెట్టారు. స్ర్తీనిధి ద్వారా రుణాలు పొందిన ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు 11శాతం (నూటికి 90 పైసల) వడ్డీతో సులభ వాయిదాల ప్రకారం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 

పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు స్త్రీ నిధి ద్వారా ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.190.47 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్షాన్ని నిర్దేశించారు. గతేడాది కంటే ఈసారి రూ.45.47 కోట్లు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 3 నెలల్లో రూ.15.50 కోట్లు ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.155 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంలో రూ.147.50 కోట్లు పంపిణీ చేసి 94 శాతం లక్ష్యాన్ని సాధించారు. 


జిల్లాలో 2.50 లక్షల మంది సభ్యులు

జిల్లాలో 25,548 స్వయ సహాయక సంఘాలున్నాయి. వీటిలో మొత్తం 2 లక్షల 50వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 16,450 ఎస్‌హెచ్‌జీలు ఉండగా లక్షా 80 వేల మంది సభ్యులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 9,198 స్వయం సహాయక సంఘాలుండగా 70 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అర్హత గల మహిళలందరినీ సంఘాల్లో చేర్పించేందుకు కొత్త ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. 


ఈసారి కొత్త రుణాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు వారి కుటుంబ సభ్యులకు సైతం రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. పాడిగేదెలు, నాటు కోడిపిల్లల పెంపకం, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, ఈ-ఆటోలు, ఈ-బైక్‌లు తీసుకునే వారికి 11శాతం వడ్డీలతో రుణాలు ఇవ్వనున్నారు. ఈ-బైక్‌లు తీసుకుంటే రూ.75 వేలు, ఈ-ఆటోలకు రూ.3లక్షల రుణాలు ఇవ్వనున్నారు. పాడిగేదెలకు రూ.75 వేల చొప్పున రుణం ఇస్తున్నారు. అలాగే కొత్త ఇంటి మరమ్మతుల కోసం రూ.75 వేలు, పాత ఇంటి మరమ్మతుల కోసం రూ.50వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. నాటు కోడి పిల్లల (మదర్‌ డెయిరీ) పెంపకం కోసం వెయ్యి నుంచి 2 వేల పిల్లలకు రూ.3లక్షల చొప్పున ఇస్తారు. ఈ రుణాలు పొందాలంటే సంఘాల్లో ఉన్న మిగిలిన సభ్యులందరూ తిర్మాణించాల్సి ఉంటుంది. 


పైలట్‌ ప్రాజెక్టు కింద సోలార్‌ పవర్‌ ప్లాంట్లు

ఈసారి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద మహిళలకు సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట, పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌, నందికంది, రామచంద్రాపురం మండలంలోని విద్యుత్‌నగర్‌ గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో 125 మంది మహిళలకు రూ1.25 లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. ఈ స్కీం కింద రుణాలు పొందిన సభ్యులు 5 సంవత్సరాల్లోగా 60 నెలల వాయిదాల ప్రకారం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు 25 సంవత్సరాల వారంటీతో రుణాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రుణాలు పొందే మహిళలను ఎంపిక చేసే ప్రక్రియను స్ర్తీ నిధి, డీఆర్‌డీఏ అధికారులు చేపట్టారు. వీటితో పాటు న్యూ ఎంప్లాయిమెంట్‌ ప్రాజెక్టు కింద మహిళలకు టెంట్‌ హౌజ్‌, బ్యూటీ పార్లర్‌, ఎంబ్రాయిడరీ, టైపింగ్‌ శిక్షణ, పిండి, మిర్చి గిర్నీల కోసం రూ.లక్షకు పైగా రుణం ఇవ్వనున్నారు. 


దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆర్థికసాయం

పొదుపు సంఘాల్లో ఉండి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మహిళలకు కమ్యూనిటీ ఫైనాన్స్‌ కింద ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌, పక్షవాతం, ఎయిడ్స్‌, క్షయ, కుష్టు తదితర వ్యాధులతో బాధపడుతున్న మహిళలకు రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు ఉచితంగా ఆర్థిక సహాయాన్ని అందజేయాలని సంకల్పించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల్లో ఈ సాయం అందజేసేందకు డీఆర్‌డీఏ, స్ర్తీనిధి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతాం

- మోహన్‌రెడ్డి, స్త్రీనిధి రీజనల్‌ మేనేజర్‌

2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతాం. అధికారులు, సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో వ్యవహరిస్తాం. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ బ్యాంకు రుణాలకు తోడు స్త్రీనిధి రుణాలు అందజేసి ఆర్థికంగా ఎదిగేలా మహిళలకు అవగాహన కల్పిస్తాం.

Updated Date - 2022-06-29T05:52:56+05:30 IST