ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశమైపోయింది. దాదాపుగా ఆ దేశ ప్రజలందరూ మరోసారి నియంతృత్వంలో మగ్గటానికి మానసికంగా సిద్ధమైపోయారు. కానీ, కొంత మంది మహిళలు మాత్రం ఉగ్రవాద తాలిబన్ పాలకులకు వ్యతిరేకంగా ధైర్యంగా రోడ్డెక్కుతున్నారు. అంతటితో ఆగకుండా సొషల్ మీడియాలోనూ తమ నిరసన తెలుపుతున్నారు. సాధారణంగా ఎవరికైనా ఏదైనా నచ్చకపోతే నల్లటి రంగుతో తమ వ్యతిరేకత చాటుకుంటారు. ఆఫ్ఘాన్ మహిళలు మాత్రం నల్లటి బురఖాలు వద్దంటూ రంగురంగుల వస్త్రాలు ధరించి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. ‘డూ నాట్ టచ్ మై క్లోత్స్, ఆఫ్ఘానిస్థాన్ కల్చర్, ఆఫ్ఘాన్ ఉమెన్’ లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్విట్టర్లో రన్ అవుతున్నాయి. అలాగే, తాలిబన్లు తప్పనిసరి చేసిన నల్లటి బురఖా ఆఫ్ఘాన్ సంస్కృతిలో ఏనాడూ భాగం కాదని ఆ దేశ స్త్రీలంటున్నారు. కనుచూపుమేరలో తాలిబన్ల పాలన, అమానుష నిబంధనలు సడిలిపోయే అవకాశాలు లేకున్నా ఆఫ్ఘానీ వనితల తెగువకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు రోజురోజుకు పెరుగుతున్నాయి.