ఆమెకు ఆనాడే హక్కులు!

ABN , First Publish Date - 2020-08-28T05:30:00+05:30 IST

‘అతివకు ఆకాశంలో సగం. అవనిలో సగం. అన్నిటా సగం. ఆమె ఈ జగంలో సగం’ అని తొలిసారి ఎలుగెత్తి చాటింది బౌద్ధం. బుద్ధుని కాలానికి మహిళలకు ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక స్వాతంత్య్రం లేదు. స్త్రీ భోగవస్తువుగా మారుతున్న కాలం అది...

ఆమెకు ఆనాడే హక్కులు!

‘అతివకు ఆకాశంలో సగం. అవనిలో సగం. అన్నిటా సగం. ఆమె ఈ జగంలో సగం’ అని తొలిసారి ఎలుగెత్తి చాటింది బౌద్ధం. బుద్ధుని కాలానికి మహిళలకు ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక స్వాతంత్య్రం లేదు. స్త్రీ భోగవస్తువుగా మారుతున్న కాలం అది. ఇతర సాధారణ కుటుంబాల మాట ఎలా ఉన్నా రాచరిక కుటుంబాలు మాత్రం ఆడపిల్ల పుట్టడం అనర్థంగానే భావించేవి. తమ రాజ్యంలో ఆస్థికి కానీ, అధికారానికి కానీ ఆడపిల్లలను వారసులుగా రాచరిక వ్యవస్థ గుర్తించకపోవడమే దీనికి కారణం.


శ్రావస్తిని రాజధానిగా చేసుకొని కోసల రాజ్యాన్ని ప్రసేనజిత్తు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. ఒకామె మల్లిక. రెండో భార్య వాసవక్షత్రియ. మహారాణి మల్లిక నిండు గర్భిణి. ఆమెకు ఒక రోజు నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో బుద్ధుడు శ్రావస్తిని సందర్శించి, ప్రసేనుడి మందిరానికి వచ్చాడు. ప్రసేనుడు తన మందిరంలో ఉన్నాడు. మంత్రులూ, సేవకులూ అతని దగ్గరే ఉన్నారు. బుద్ధుడు రాగానే అందరూ లేచి, ఎదురు వచ్చి ఆహ్వానించారు. ఉచిత ఆసనం చూపించారు. మహారాణి మల్లిక ప్రసవించబోతూ ఉంది. అందరూ ఆ ఆతృతలో ఉన్నారు. అంతలో... ఒక పరిచారిక పరుగుపరుగున వచ్చి ‘‘మహారాజా! మహారాణి మల్లికాదేవి గారు ప్రసవించారు’’ అని చెప్పింది.

‘‘శుభవార్త!’’ అంటూ ఒక బంగారు గొలుసును అందించాడు రాజు.

ఆ నగను అందుకున్న ఆమె ముఖంలో సంతోషం లేదు. చేతులు కట్టుకొని, తలవంచుకొని నిలబడిపోయింది. 

ఆమె వాలకం చూసి రాజుగారికి భయం కలిగింది. ‘ఏమై ఉంటుంది?’ అనుకొని - ‘‘తల్లీ,  బిడ్డా క్షేమమా?’’ అని అడిగాడు.

‘‘క్షేమమే మహారాజా!’’ అంది పరిచారిక.

‘‘నీ విచారానికి కారణం?’’ అని ప్రశ్నించాడు రాజు.

‘‘మహారాజా! మహారాణి ఆడపిల్లకు జన్మనిచ్చారు’’ అని వెళ్ళిపోయింది.

ఆ మాట విన్న వెంటనే ప్రసేనుడు హతాశుడైపోయాడు. సింహాసనంపై కూలబడ్డాడు. అప్పుడు బుద్ధుడు ఎన్నో రకాలుగా ప్రసేనుడికి నచ్చచెప్పాడు. ఓదార్చాడు. ఓర్పుతో ఎంతో బోధించాడు.

‘‘ప్రసేనా! పుట్టుకతో ఆడ, మగ అందరూ సమానులే! అందరికీ ఒకే రకమైన శక్తియుక్తులుంటాయి. కానీ, మగ పిల్లలకు ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ఆడ పిల్లలను వాటికి దూరం చేస్తారు. అలాకాకుండా ఆడ పిల్లలకు కూడా ధార్మిక విద్యల్లో, యుద్ధ విద్యల్లో మగ పిల్లలతో సమానంగా అవకాశాలు కల్పిస్తే, వారికి తగిన శిక్షణ ఇప్పిస్తే, వారు కూడా మగ పిల్లల్లాగానే రాణిస్తారు. కచ్చితంగా చెప్పాలంటే మగ పిల్లల కన్నా మిన్నగా విజయాలు సాధిస్తారు. కాబట్టి రాజా! చింతించకు! నీ కుమార్తెను అన్ని విద్యల్లో తీర్చిదిద్దు’’ అని చెప్పాడు. 

బుద్ధుని ప్రబోధంతో విచారం నుంచి కోలుకున్నాడు ప్రసేనుడు. ఆ తరువాత తన కుమార్తెకు అన్ని విద్యలూ నేర్పించాడు. ఆమె పేరు వజ్రకుమారి. బౌద్ధ సాహిత్యంలో వజీరాగా ప్రసిద్ధి చెందింది. పాలనలో తండ్రికి ఆమె చేదోడుగా నిలిచింది. ఆ తరువాత మగధ రాజు అజాతశత్రును పెండ్లాడి, మగధ మహారాణిగా రాణించింది. ఈ దేశ చరిత్రలో కత్తి పట్టి, రాజ్య భారాన్ని మోసిన మొదటి మహిళ ఆమే! తండ్రి తదనంతరం కొంతకాలానికి తమ్ముడు, వాసవక్షత్రియ కుమారుడు అయిన విఢూఢభునికి కోసల రాజ్య బాధ్యతలు అప్పగించి, ఆమె మగధకు వెళ్ళింది. ఇదీ వజ్రకుమారి కథ!

కుటుంబంలో భార్యా భర్తల పాత్ర గురించి బుద్ధుడు ఒక సందర్భంలో వివరిస్తూ ‘‘భార్య గృహానికి అధిపతి. ఇంటి ఆర్థిక వ్యవహారమంతా ఆమె చేతుల్లోనే ఉండాలి. మగవారు వ్యవసాయం, వ్యాపారం చేసి తెచ్చిన ధనాన్ని భార్యకు అప్పగించాలి. ఇంటి వ్యవహారాలన్నీ ఆమె నేతృత్వంలోనే జరగాలి’’ అని చెప్పాడు. స్త్రీకి కేవలం ఆర్థిక స్వాతంత్రం కాదు, అసలు కుటుంబ ఆర్థిక వ్యవస్థే మహిళ చేతుల్లో ఉండాలని స్పష్టం చేశాడు.

ఇక, ఆ రోజుల్లో మహిళలకు ఆధ్యాత్మిక స్వాతంత్య్రం ఏమాత్రం లేదు. అలాంటి రోజుల్లో మహిళల కోసం బుద్ధుడు భిక్షుణీ సంఘాన్ని స్థాపించాడు. దాని ద్వారా వారికి విద్యా బోధనతో పాటు ధార్మిక ప్రబోధాలు ఇచ్చే వారిగా తీర్చి దిద్ది, సంఘంలో గౌరవ స్థానాన్ని కల్పించాడు. గురు స్థానాన్ని అందించాడు. అలా... మహిళల ఆత్మగౌరవానికీ, ఆర్థిక స్వావలంబనకూ, పాలనాధికారానికీ మార్గం వేసింది బౌద్ధం! 

‘తండ్రికి తనయ కూడా వారసురాలే!’ అని ఆనాడు ప్రసేనుడికి బుద్ధుడు జ్ఞానోదయం కలిగించాడు. 


‘తండ్రికి కూతురు కూడా వారసురాలే! కుమారులకు ఎలాంటి హక్కులు ఉంటాయో, కుమార్తెలకూ అలాంటి హక్కులే ఉంటాయి’’ అని నిన్నగాక మొన్న మన సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ మార్పును రెండువేల అయిదు వందల సంవత్సరాల క్రితమే మొదలు పెట్టాడు బుద్ధుడు.


- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-08-28T05:30:00+05:30 IST