పూడివలసలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-06-24T05:07:12+05:30 IST

ఎచ్చెర్ల మండలం పూడివలసకి చెందిన పొట్నూరు హైమావతి (31) బుధవారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించడం వల్లనే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూడివలసలో వివాహిత మృతి
హైమావతి (ఫైల్‌ ఫోటో)

- కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించడమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు 

ఎచ్చెర్ల, జూన్‌ 23: ఎచ్చెర్ల మండలం పూడివలసకి చెందిన పొట్నూరు హైమావతి (31) బుధవారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించడం వల్లనే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎచ్చెర్ల ఎస్‌ఐ రాము తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 20న మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు, 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. ఈ నేపథ్యంలో పూడివలసలో హైమావతి అదేరోజు కొవిడ్‌ టీకా వేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం ఆమె మృతిచెందింది. దీంతో భర్త వైకుంఠరావు, ఇద్దరు చిన్నారులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వ్యాక్సిన్‌ వికటించడం  వల్లనే తన భార్య మృతిచెందిందని వైకుంఠరావు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాము తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే వివాహిత మృతికి గల కారణాలు వెల్లడవుతాయని వివరించారు. భర్త వైకుంఠరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయమై జేసీ సుమిత్‌కుమార్‌ దృష్టికి కూడా వెళ్లగా విచారణకు ఆదేశించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హైమావతి మృతికి గల కారణాలు బయటపడతాయని డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌ వెల్లడించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ సర్పంచ్‌ గొలివి గోవిందరావు కోరారు.


 

Updated Date - 2021-06-24T05:07:12+05:30 IST