గుంపుగా నగ్నంగా నిలబెట్టి..

ABN , First Publish Date - 2020-02-22T08:52:52+05:30 IST

నెలసరి సమయంలో హాస్టల్‌ వంట గదిలోకి వచ్చారని విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన మరువక ముందే గుజరాత్‌లో మరో దారుణం!

గుంపుగా నగ్నంగా నిలబెట్టి..

  • గుజరాత్‌లో యువతులకు ఫిట్‌నెస్‌ పరీక్ష
  • సూరత్‌ కార్పొరేషన్‌ ట్రైనీ ఉద్యోగినుల పట్ల దారుణం
  • ‘గతంలో గర్భం ధరించారా?’ అంటూ పెళ్లి కాని వారికీ ప్రశ్నలు
  • నిబంధనల ప్రకారమే చేశామన్న వైద్యురాలు


సూరత్‌, ఫిబ్రవరి 21: నెలసరి సమయంలో హాస్టల్‌ వంట గదిలోకి వచ్చారని విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన మరువక ముందే గుజరాత్‌లో మరో దారుణం! శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగినులను పదుల సంఖ్యలో నగ్నంగా వరుసలో నిలబెట్టి గైనకాలజీ ఫింగర్‌ టెస్ట్‌ నిర్వహించడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ విషయం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. వివరాలు.. సూరత్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో దాదాపు 100 మంది యువతులు మూడేళ్ల క్లర్క్‌ ఉద్యోగ శిక్షణ పూర్తిచేసుకున్నారు. కొలువు శాశ్వతం కావాలంటే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ తప్పనిసరి కావడంతో గురువారం సూరత్‌ మునిసిపల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌ఎంఐఎంఈఆర్‌) కు వెళ్లారు. వైద్యులు వారిని పదిమంది చొప్పున బృందంగా విభజించారు.


ఒక్కొక్కరికి విడివిడిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, పదిమందిని ఒకేసారి గదిలోకి పిలిచి దుస్తులు విప్పించారు. వైద్య సిబ్బంది తమతో దారుణంగా ప్రవర్తించారని, ‘గతంలో ఎప్పుడైనా గర్భం దాల్చారా?’ అంటూ అవివాహితలను ప్రశ్నించారని ఉద్యోగినులు వాపోయారు. దీనిపై ఉద్యోగ సంఘాల ఫిర్యాదు మేరకు మునిసిపల్‌ కమిషనర్‌ బన్‌చానిది పాణి శుక్రవారం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. కాగా, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ అశ్విన్‌ వచ్చాని తెలిపారు. 

Updated Date - 2020-02-22T08:52:52+05:30 IST