పనిమనిషికి 12 కండీషన్లు.. ఈమె మరో ‘గుండమ్మ’లా ఉందంటూ సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2022-06-09T01:51:14+05:30 IST

ప్రస్తుతం నెటిజన్లకు నయా గుండమ్మ కనిపించింది.తన ఇంట్లో పనిమనిషిగా చేరే మహిళ ఎలా నడుచుకోవాలో చెబుతూ ఓ వీడియో విడుదల చేసిన ఆ మహిళామణి.. నెటిజన్లకు గుండమ్మ రేంజ్‌లో షాకిస్తోంది.

పనిమనిషికి 12 కండీషన్లు.. ఈమె మరో ‘గుండమ్మ’లా ఉందంటూ సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

ఇంటర్నెట్ డెస్క్: తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేని సినిమా గుండమ్మ కథ! అందులో గుండమ్మ పాత్రధారి సూర్యకాంతం నటన అజరామరం. అందరిపై అజమాయిషీ చెలాయిస్తూ టార్చర్ పెట్టే గుండమ్మగా సీనియర్ నటి సూర్యకాంతం నాటి ప్రేక్షకులపై గాఢమైన ముద్రే వేశారు. గయ్యాళిలా పెత్తనం చెలాయించే వారిని గుండమ్మలా ఉందే అని అప్పట్లో ప్రజలు అనుకునేవారు.! అప్పుడే కాదు.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది! ఇదంతా ఎందుకంటే... ప్రస్తుతం నెటిజన్లకు నయా గుండమ్మ కనిపించింది. తన ఇంట్లో పనిమనిషిగా చేరే మహిళ ఎలా నడుచుకోవాలో చెబుతూ ఓ వీడియో విడుదల చేసిన ఆ మహిళామణి.. నెటిజన్లకు గుండమ్మ రేంజ్‌లో షాకిస్తోంది. 

ఓ మహిళ తన పనిమనిషి పాటించాల్సిన పన్నెండు రూల్స్‌ను బోర్డుపై రాసింది. ఆ బోర్డును చూపిస్తూ ఓ వీడియో తీసి ఇన్స్‌స్టాలో షేర్ చేసింది. ఇది ప్రస్తుతం నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఆమె పెట్టిన రూల్స్ ఏంటంటే.. 

  1. పని చేసే సమయంలో మొబైల్ ఫోన్లో మాట్లాడకూడదు
  2. గుర్తు తెలియని వారు తలుపు తడితే ముందూవెనుకా ఆలోచించకుండా డోర్ తెరవకూడదు
  3. అనుమతి తీసుకోకుండా ఎక్కడికీ వెళ్లకూడదు
  4. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి
  5. రాత్రుళ్లు స్నానం చేశాకే నిద్రకు ఉపక్రమించాలి. వంట చేశాక కూడా స్నానం చేయాలి. 
  6. పిల్లలు నిద్రపోయాక.. గంటపాటు మాత్రమే మొబైల్ ఫోన్ చూడాలి
  7. తాను ఉండే గదికి ఎప్పుడూ తాళం వేసుకోకూడదు
  8. రాత్రి 9.30 కల్లా నిద్రపోవాలి.. మళ్లీ పొద్దున్న 7.00 గంటలకల్లా లేవాలి. 
  9. నీళ్లు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. ఏమాత్రం వృథా చేయకూడదు
  10. శుభ్రత విషయంలో ఏమాత్రం అలక్ష్యం పనికిరాదు
  11. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. గదుల్లోని సీసీకెమెరాలకు కనిపించే ప్రదేశాల్లోనే సంచరించాలి. 
  12. ముందుగా అనుమతి తీసుకున్నాకే ఏసీ ఆన్  చేయాలి.. 

ఇలా ఆమె తన 12 నిబంధనలను వివరంగా రాసుకొచ్చింది. ఇది చదివిని నెటిజన్లు ఆమె పనిమనిషిని టార్చర్ పెట్టడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎవరు ఎప్పుడు నిద్రపోవాలి... ఎప్పుడు లేవాలనే విషయంలోనూ కండీషన్లా అంటూ షాకైపోతున్నారు. 



Updated Date - 2022-06-09T01:51:14+05:30 IST