పనిమినిషిపై యజమానుల అమానుష దాడి.. ఏం చేశారో తెలుసా...

ABN , First Publish Date - 2022-05-21T00:04:21+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ఆఫీస్ ముందు ఓ మహిళ తన మూత్రపు మడుగులో పడిపోయి ఉంది.

పనిమినిషిపై యజమానుల అమానుష దాడి.. ఏం చేశారో తెలుసా...

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ఆఫీస్ ముందు ఓ 48 ఏళ్ల మహిళ తన మూత్రపు మడుగులో పడిపోయి ఉంది. ఎటూ కదల్లేని స్థితి ఆమెది. ఒంటిపై తీవ్రమైన గాయాలు. తలపై జుట్టంతా కత్తిరించి ఉన్న ఆమెను చూసిన ఏజెన్సీ యజమాని నిర్ఘాంతపోయాడు. ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్దార్‌జంగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చేర్చాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత మహిళకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. బాధిత మహిళ ఇంతటి దుస్థితిలో ఉండడానికి ఆమె పనిచేసిన ఇంటి యజమానులే కారణం. 


పశ్చిమ ఢిల్లీలో అభినీత్ అనే దంపతుల ఇంట్లో బాధిత మహిళ రజ్నీ గతేడాది సెప్టెంబర్ నుంచి పనిమనిషిగా ఉపాధి పొందుతోంది. బెంగాల్‌కు చెందిన రజ్నీ కొంతకాలం ఇబ్బందులు లేకుండానే పనిచేసింది. కానీ ఆదివారం రాత్రి యజమానులు అమానుషంగా ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. గదిలోంచి బయటకు ఈడ్చుకొచ్చి జట్టుకత్తిరించారు. బాధిత మహిళపై దాడిని ప్లేస్‌మెంట్ ఏజెన్సీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. బాధిత మహిళ తలపై తీవ్రమైన గాయమైందని పోలీసులు తెలిపారు. శరీరమంతా గాయాలే ఉన్నాయన్నారు. కేసు నమోదు చేశామని, నిందిత దంపతుల అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. 


కాగా ప్లేస్‌మెంట్ ఏజెన్సీ యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి నిందిత దంపతుల నుంచి కాల్ వచ్చింది. పనిమనిషి ఆరోగ్యం బాగాలేదని, ఇంటికి పంపించేయాలని సమాచారం ఇచ్చారని చెప్పాడు. కాగా నిందిత యజమానులు గతంలోనూ ఓ మహిళను పనిమనిషిగా కుదుర్చుకున్నారు. కానీ ఆమెపై దొంగతనం నెపంతోపాటు ఆహారంలో ఎలుకల మందు కలిపేందుకు ప్రయత్నించిందని చెప్పి తొలగించారని ప్రస్తావించాడు. కాగా బాధిత మహిళ రజ్నీ వయసు 48 సంవత్సరాలు, నెలకు 7 వేల జీతం తీసుకుంటోందని వెల్లడించారు.

Updated Date - 2022-05-21T00:04:21+05:30 IST