తప్పు బటన్ నొక్కడంతో కోట్ల రూపాయల కనకవర్షం

ABN , First Publish Date - 2022-04-09T00:17:19+05:30 IST

ఏళ్ల తరబడి లాటరీ కొట్టేందుకు ప్రయత్నిస్తూ లక్కు కలిసిరాక నిరాశ చెందేవారు కోకొల్లలు. కానీ.. అమెరికాకు చెందిన ఓ మహిళకు మాత్రం అదృష్టం అనూహ్యంగా వరించింది.

తప్పు బటన్ నొక్కడంతో కోట్ల రూపాయల కనకవర్షం

ఎన్నారై డెస్క్: ఏళ్ల తరబడి లాటరీ కొట్టేందుకు ప్రయత్నిస్తూ లక్కు కలిసిరాక నిరాశ చెందేవారు కోకొల్లలు. కానీ.. అమెరికాకు చెందిన ఓ మహిళకు మాత్రం అదృష్టం అనూహ్యంగా వరించింది. ఓ పొరపాటు కారణంగా ఆమె ఏకంగా 75 కోట్ల రూపాయలు గెలుచుకుంది. అసలేం జరిగిందంటే.. లాకెడ్రా అడ్వర్డ్స్ అనే మహిళ ఇటీవల సూపర్ మార్కెట్‌లో లాటరీ టిక్కెట్టు కొనేందుకు వెళ్లింది. టిక్కెట్లు ఇచ్చే యంత్రంలో 40 డాలర్లు వేసి.. తనకు నచ్చిన నెంబర్లను ఎంచుకునేందుకు యంత్రంపై ఉన్న అంకెల బటన్లు నొక్కడం ప్రారంభించింది. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. విసురుగా ఆమెను ముందుకు తోసేసి వెళ్లిపోయాడు. 


దీంతో  ఆమె ముందుకు తూలి తప్పు బటన్ నొక్కడంతో 30 డాలర్ల విలువైన ఒకే టిక్కెట్టు వచ్చింది. ఇలా డబ్బులో చాలా భాగం ఒక్క టిక్కెట్టుకే ఖర్చైపోయినందుకు ఆమె చాలా బాధపడింది. కొన్ని రోజుల తరువాత లాటరీ చెక్ చేసుకోగా.. ఏకంగా పది మిలియన్ డాలర్ల(సుమారు రూ.75 కోట్లు) జాక్ వచ్చినట్టు తెలియడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బైపోయింది. అసలు.. తనకు జాక్ పాట్ దక్కిన విషయాన్ని తానే మొదట నమ్మలేకపోయింది. ‘‘నా టిక్కెట్ నెంబర్ పదిమార్లు సరిచూసుకున్నా. ఇది నిజమేనా అని అనిపించింది. ఆ మాటకొస్తే ఇప్పటికే ఇది నాకు పెద్ద షాక్.’’ అని ఆమె స్థానిక మీడియాతో చెప్పింది.  ఈ డబ్బుతో లాకెడ్రా.. సొంతిల్లు కొనుక్కోవడం పాటూ ప్రజలకు సేవ చేసేందుకు ఓ స్వచ్ఛంధ సంస్థ కూడా పెడతానని చెప్పింది.   

Updated Date - 2022-04-09T00:17:19+05:30 IST