అల్లుడు కట్నం డబ్బులివ్వలేదని.. కన్నకూతురికి చిత్రహింసలు

ABN , First Publish Date - 2021-12-18T22:13:29+05:30 IST

సాధారణంగా కోడలు కట్నం తీసుకురాలేదని అత్తింటి వాళ్లు వేధించడం చూస్తుంటాము. కానీ గుజరాత్‌లోని వడోదరలో పరిస్థితి విచిత్రంగా ఉంది.

అల్లుడు కట్నం డబ్బులివ్వలేదని.. కన్నకూతురికి చిత్రహింసలు

వడోదర: సాధారణంగా కోడలు కట్నం తీసుకురాలేదని అత్తింటి వాళ్లు వేధించడం చూస్తుంటాము. కానీ గుజరాత్‌లోని వడోదరలో పరిస్థితి విచిత్రంగా ఉంది. అల్లుడు కట్నం ఇవ్వలేదని కన్న కుమార్తెను తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేశారు. వడోదరలోని పంద్రాలో ఈ ఘటన జరిగింది.


జాగృతి అనే మహిళ ఇద్దరు ఆడపిల్లలను కనడంతో మగపిల్లవాడు కావాలనుకున్న ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమెకు పంద్రాలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసే కూలీకి ఇచ్చి మళ్లీ పెళ్లి చేశారు. అయితే వాళ్ల ఆచారం ప్రకారం అత్తింటివారికి అల్లుడే కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ‘దావా’ అని అంటారు. జాగృతి తల్లిదండ్రులు పెళ్లి సమయంలో రూ. 20వేలు డిమాండ్ చేశారు. అయితే పెళ్లి కొడుకు వాయిదాల వారీగా చెల్లిస్తానని మాట ఇచ్చాడు. అయితే పెళ్లి అయి నెలలు గడిచినా అల్లుడు డబ్బులు ఇవ్వకపోవడంతో జాగృతి తండ్రి కొద్ది రోజుల క్రితం ఆమెను పుట్టింటికి తీసుకొచ్చాడు. తమకు ఇస్తానన్న రూ. 20 వేల డబ్బులు ఇచ్చాకే తమ కుమార్తెను తీసుకెళ్లాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో జాగృతి భర్త గురువారం పంద్రాలోని ఆమె పుట్టింటికి వస్తాడు. అయితే జాగృతిని అతడితో పంపించడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తారు. పైగా కన్న కూతురుపై కర్కశంగా ప్రవర్తిస్తూ ఆమెను మంచానికి కట్టేశారు. అది చూసిన జాగృతి భర్త ‘181 అభయం’ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తన అత్తమామలపై ఫిర్యాదు చేశాడు. అభయం టీమ్ అక్కడికి చేరుకుని జాగృతిని విడిపించి ఆమె తల్లిదండ్రులను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న వడోదర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-18T22:13:29+05:30 IST