హైదరాబాద్/రాజేంద్రనగర్: భర్తతో విడాకులై తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఓ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం రాత్రి రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఎం పహడీ బస్తీలో జరిగింది. ఎంఎం పహడీకి చెందిన అబ్దుల్ అజీమ్ కూతురు షహజాన(25)కు అదే ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్(30)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్త ప్రవర్తన బాగాలేకపోవడంతో గత ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం షహజాన తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీనికి భర్తే కారణమని, పాలలో విషం కలిపి ఇచ్చాడని షహజాన అప్పట్లో అత్తాపూర్ ఔట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పట్లో పోలీసులు నచ్చజెప్పి పంపించివేశారు. భర్తలో మార్పు కనిపించకపోవడంతో మూడు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో మూడు సంవత్సరాల పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉండాలని, సంవత్సరంన్నర బాబు అమ్మ దగ్గర ఉండాలని మహిళా మండలి సభ్యులు సూచించారు. దీంతో మానసికంగా కుంగిపోయి షహజాన బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి అబ్దుల్ అజీమ్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ కనకయ్య తెలిపారు.
నా కుమార్తె చావుకు మాజీ భర్తే కారణం
తన కూతురు షహజాన ఆత్మహత్యకు మాజీ భర్త షేక్ ఇమ్రానే కారణమని షహజాన తండ్రి అబ్దుల్ అజీమ్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెడు అలవాట్లకు బానిసైన ఇమ్రాన్ తన కుమార్తెను వేధించేవాడని, పెద్ద కుమారుడు ఆయన దగ్గరే ఉండడంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.