భోపాల్: మంత్రగత్తె అన్న అనుమానంతో ఓ మహిళపై బంధువులు, ఇరుగుపొరుగువారే అమానుషంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మాండవి గ్రామంలో ఈ నెల 5న ఈ ఘటన జరగ్గా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహిళ ఎలాంటి ఆచ్చాదన లేకుండా కూర్చుని ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడిచేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ నెల 7న మనావర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె మంత్రగత్తె అని, చేతబడి చేయడం వల్లే తమ కుటుంబంలోని మహిళ నిత్యం అనారోగ్యంతో బాధపడుతోందని పొరిగింటి కుటుంబం అనుమానించింది. దీంతో బాధిత మహిళను ఇంట్లోంచి బయటకు ఈడ్చుకు వచ్చి దాడిచేశారు.
ఆమె దుస్తులు తొలగించి చావబాదారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను రికార్డు చేసిన వ్యక్తిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.