మరో మహిళ హత్య

ABN , First Publish Date - 2022-08-16T07:02:07+05:30 IST

నిర్మాణంలో గల అపార్టుమెంట్‌ సెల్లార్‌లో ఓ మహిళ హత్యకు గురయ్యింది.

మరో మహిళ హత్య
అప్పికొండ లక్ష్మి (పాతచిత్రం)

సుజాతనగర్‌ నాగమల్లి లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌ సెల్లార్‌లో సంఘటన

మృతురాలు వాచ్‌మన్‌ భార్య

పోలీసుల అదుపులో అనుమానితుడు 

అతడి నుంచి హత్యకు వినియోగించినట్టుగా భావిస్తున్న ఇనుప రాడ్డు స్వాధీనం


పెందుర్తి, ఆగస్టు 15: నిర్మాణంలో గల అపార్టుమెంట్‌ సెల్లార్‌లో ఓ మహిళ హత్యకు గురయ్యింది. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతడి నుంచి హత్యకు వినియోగించినట్టుగా భావిస్తున్న ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పెందుర్తి మండలం సుజాతనగర్‌ నాగమల్లి లేఅవుట్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలేనికి చెందిన అప్పికొండ దేముడు, లక్ష్మి (45) దంపతులు పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సుజాతనగర్‌ ప్రాంతానికి వచ్చారు. దేముడు అపార్టుమెంట్లలో వాచ్‌మన్‌గా ఉంటుంటాడు. ప్రస్తుతం సుజాతనగర్‌ నాగమల్లి లేఅవుట్‌ సమీపంలో కుమారుడు సతీశ్‌ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అదే లేఅవుట్‌లో నిర్మాణంలో గల ఓ అపార్టుమెంట్‌లో ఆరు నెలల క్రితం పనిలో చేరారు. ఆదివారం ఆ అపార్టుమెంట్‌ సమీపంలో వున్న మరో అపార్లుమెంట్‌ శ్లాబ్‌ వేస్తుండడంతో సాయంత్రం వరకు అక్కడే వుండి పనులు చూసుకున్నారు. ఆ తరువాత తనకు నలతగా వుందంటూ దేవుడు ఇంటికి వెళ్లిపోగా, భార్య లక్ష్మి వారు పనిచేస్తున్న అపార్టుమెంట్‌ వద్దకు వెళ్లి నిద్రపోయింది. అయితే తెల్లవారుజామున రెండు గంటల సమయంలో దేవుడు భార్య నిద్రిస్తున్న అపార్టుమెంట్‌ వద్దకు వెళ్లి ఆమెను లేపసాగాడు. ఎంతకీ ఆమె లేవకపోవడంతో కుమారుడు సతీశ్‌ను తీసుకువచ్చాడు. అతడు వచ్చి రక్తపుమడుగులో వున్న తల్లిని చూసి భీతిల్లాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్లూస్‌టీమ్‌తో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఇటీవల చినముషిడివాడలో వృద్ధ దంపతుల హత్య జరిగిన తీరులోనే వున్నట్టు గుర్తించారు. హత్య జరిగి కొద్దిసేపే  అవుతుందని గ్రహించి, హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


పోలీసుల అదుపులో అనుమానితుడు  

ఈ క్రమంలో అక్కడికి సమీపంలోని కొండపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని గుర్తించారు. పోలీసులను చూసిన అతడు తుప్పల్లోకి వెళ్లిపోయాడు. దీంతో ఓ కానిస్టేబుల్‌ టార్చ్‌లైట్‌ సాయంతో అక్కడికి వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అనుమానితుడు ప్రతిఘటించడంతో మిగిలిన సిబ్బంది చుట్టూ వలయంలా ఏర్పడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా ఇనుపరాడ్డు లభ్యమయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదుచేశారు. కాగా హత్యకు గురైన లక్ష్మి బంధువులు అపార్టుమెంట్‌ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి అమ్మగారి గ్రామం సరిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - 2022-08-16T07:02:07+05:30 IST