ఊహించని సర్‌ప్రైజ్.. యవ్వనంలో కోల్పోయింది 53 ఏళ్ల తరువాత ఆమెకు దక్కడంతో..

ABN , First Publish Date - 2022-07-16T01:40:25+05:30 IST

యవ్వనంలో ఉండగా తాను కోల్పోయిన ఓ ఉంగరం దాదాపు 53 ఏళ్ల తరువాత దక్కడంతో ఓ వృద్ధురాలి ఆనందానికి అంతేలేకుండా పోయింది.

ఊహించని సర్‌ప్రైజ్.. యవ్వనంలో కోల్పోయింది 53 ఏళ్ల తరువాత ఆమెకు దక్కడంతో..

ఎన్నారై డెస్క్: యవ్వనంలో ఉండగా తాను కోల్పోయిన ఓ ఉంగరం దాదాపు 53 ఏళ్ల తరువాత దక్కడంతో ఓ వృద్ధురాలి ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఒకప్పటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చిన ఆ ఉంగరాన్ని చూసుకుని ఆమె మురిసిపోయింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉండే ఫాలీ.. 53 ఏళ్ల క్రితం కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్ హైస్కూల్‌లో చదువుకుంది. స్కూల్ చదువులు ముగుస్తున్న సందర్భాన్ని పురస్కరించుని పాఠశాలలో జరిగిన ఓ పార్టీకి ఆమె హాజరైంది. ఆ సమయంలో క్లాస్ రింగ్(class ring) అనే ఉంగరాన్ని ధరించింది. ఆమె ఏ సంవత్సరం స్కూల్ చదువు పూర్తి చేసిందో తెలిపే ఉంగరమది. ఇటువంటి సమయాల్లో విద్యార్థులు క్లాస్ రింగ్స్ ధరించడం అమెరికాలో ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే.. పార్టీలోనే ఆమె వేలికున్న ఉంగరం జారి ఎక్కడో పడిపోయింది. ఆ విషయాన్ని ఆమె గుర్తించలేదు. ఇంటికొచ్చాక ఈ విషయం గుర్తించి కన్నీటి పర్యంతమైంది. ఎంత ఆలోచించినా కూడా ఉంగరాన్ని ఎక్కడ పోగొట్టుకుందో ఆమెకు గుర్తుకురాలేదు. 


ఆ ఉంగరం కోసం ఎన్నో చోట్ల వెదికినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. కొన్నాళ్లు బాధపడ్డ ఆమె ఆ తరువాత ఆ విషయాన్ని క్రమంగా మర్చిపోయింది. ఆ తరువాత పెళ్లి అవడం.. ఆరుగురు సంతానాన్ని పెంచడంలో ఆమె నిమగ్నమైపోయింది. చూస్తుండగానే ఆమె జీవితంలో 50 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇటీవలో ఫెయిర్‌ఫీల్డ్ స్కూల్‌కు సమీపంలోని ఓ సరస్సులో సరదాగా చేపలు పట్టేందుకు ఓ కుటుంబం వెళ్లింది. ఆ సమయంలో వారికి ఈ ఉంగరం చిక్కింది. దాని యజమాని ఎవరో కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వారు ఓ రోజు ఫాలీ కొడుకును సంప్రదించారు. తమకు ఉంగరం దొరికిన విషయాన్ని చెప్పారు. వెంటనే ఫాలీ కుమారుడు తన తల్లికి ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండాపోయింది.



Updated Date - 2022-07-16T01:40:25+05:30 IST