West Bengal: పార్థా ఛటర్జీపై చెప్పు విసిరిన మహిళ

ABN , First Publish Date - 2022-08-02T21:48:49+05:30 IST

కోట్లాది రూపాయల వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన...

West Bengal: పార్థా ఛటర్జీపై చెప్పు విసిరిన మహిళ

కోల్‌కతా: కోట్లాది రూపాయల వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీకి (partha Chateerjee) మంగళవారంనాడు చేదు అనుభవం ఎదురైంది. ఈఎస్ఐ ఆసుపత్రి వెలుపల ఆయనపై ఓ మహిళ ఆవేశంగా  చెప్పు విసిరింది. ఈఎస్ఐలో చికిత్స కోసం వచ్చిన ఆమెను అంటాలా నివాసి సుభద్ర ఘార్విగా గుర్తించారు.


''ఆయనపై షూ విసిరేందుకే ఇక్కడకు వచ్చాను. పేద ప్రజలు చమటోడ్చి సంపాదించినన సొమ్మును ఆయన దండుకున్నారు. ఆయన మాత్రం లగ్జరీ కార్లలో తిరుతున్నాను. నేను విసిరిన షూ ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని'' అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగడం, రూ.55 కోట్లకు పైగా నగదు పట్టుబడటంతో పశ్చిమబెంగాల్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని ఆమె చెప్పారు. నగదు కుంభకోణం బయటపడిన తర్వాత కూడా ఎందుకు ఆయనకు (మాజీ మంత్రి) ఖరీదైన నసేవలు అందిస్తున్నారని  ప్రశ్నించారు. వీల్‌చైర్ సౌకర్యం ఎందుకు ఇస్తున్నారు? ఆయన నడవలేరా? అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేసింది.


కోట్లాది రూపాయల డబ్ల్యూబీఎస్ఎస్‌సీ కుంభకోణంలో జూలై 23న పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఆ వెనువెంటనే పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచింది. దీంతో ఆయనను నాలుగు రోజల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. కాగా, విచారణకు పార్థా ఛటర్జీ సహకరించడం లేదని, చాలా అలసటగా ఉందంటూ ప్రశ్నలకు సమాధానాలు ఎగవేస్తున్నారని ఈడీ అధికారులు తెలిపారు. పట్టుబడిన సొమ్ము తనది కాదంటూ పార్థా ఛటర్జీ చెబుతున్నందున ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు.

Updated Date - 2022-08-02T21:48:49+05:30 IST