బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.. తన సోదరిని ఎవరో కిడ్నాప్ చేశారని, డబ్బులు అడుగుతున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. ఆ మహిళ ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.. ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఆమె ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు.. ఆ మహిళ లాస్ట్ లొకేషన్ ఆగ్రాలోని తాజ్‌గంజ్ మార్కెట్.. అక్కడకు వెళ్లిన పోలీసులు మొత్తం 50 హోటల్స్ చెక్ చేశారు.. చివరకు ఓ హోటల్ రూమ్‌లో ఆమె కనిపించింది.. అసలు విషయం ఏంటంటే ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.
ఢిల్లీకి చెందిన 38 ఏళ్ల మహిళ కిడ్నాప్ అయినట్టు ఆమె సోదరుడికి బుధవారం వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న ఫొటోలు కూడా వచ్చాయి. వాటిని పోలీసులకు చూపించి అతను ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఆ మహిళ ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆమె ఒక్కతే మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లినట్టు తేలింది. ఆ తర్వాత మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి ఆమె లాస్ట్ లొకేషన్ చూస్తే ఆగ్రాలోని తాజ్‌గంజ్ మార్కెట్ అని బయటపడింది. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు.
ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం 50 హోటళ్లను జల్లెడ పట్టారు. చివరకు ఓ హోటల్‌లో ఆ మహిళ ఉన్నట్టు తెలిసింది. తీరా ఆ గదిలోకి వెళ్లి చూస్తే మహిళ ప్రశాంతంగా కనిపించింది. సోదరుడి నుంచి డబ్బులు గుంజేందుకు ఆ మహిళే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట ఆమె తన నేరాన్ని అంగీకరించింది.
ఇవి కూడా చదవండి