Abn logo
Jun 22 2021 @ 11:10AM

బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకున్న యువతికి ఊహించని షాక్.. 57 కిలోలు తగ్గింది కానీ..

బరువు తగ్గాలని చాలా మంది ఆశ పడుతుంటారు. అందుకోసం కసరత్తులు చేస్తుంటారు. మరీ అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లయితే సర్జరీలు చేయించుకునేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా సర్జరీ చేయించుకుని బరువు తగ్గిన ఓ యువతికి ఆ తర్వాతే ఊహించని చేదు అనుభవం ఎదురయింది. సర్జరీతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 కిలోల బరువు తగ్గిన ఆ యువతికి కొన్నాళ్ల తర్వాత క్రమక్రమంగా దంతాలు ఊడిపోవడం మొదలయ్యాయి. అలా ఆమె దంతాలన్నీ ఊడిపోవడంతో పెట్టుడు పళ్ల కోసం దంత వైద్యులను ఆశ్రయించాల్సి వచ్చింది. తనకు ఎదురైన అనుభవం గురించి ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన కాథీ బ్లేతీ అనే 33 ఏళ్ల మహిళకు 2011వ సంవత్సరంలో సర్జరీ జరిగింది. అధిక బరువుతో బాధపడుతున్న ఆమె తన 22 ఏళ్ల వయసులో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ  చేయించుకుంది. ఫలితంగా 57 కిలోల బరువు తగ్గింది. సర్జరీ జరిగిన రెండేళ్ల వరకు ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అంతా బాగుందనుకున్న సమయంలోనే 24 ఏళ్ల వయసులో ఆమెకు దంత సమస్యలు రావడం మొదలయ్యాయి. దంతాలు పటుత్వాన్ని కోల్పోయి ఊడిపోవడం మొదలయ్యాయి. క్రమక్రమంగా ఆమె 32 దంతాలు ఊడిపోయాయి. ఒక్కో దంతం ఊడిపోవడం, ఆమె దంత వైద్య నిపుణుల వద్దకు వెళ్లి పన్నును పెట్టించుకోవడం ఆమెకు నిత్యకృత్యమయిపోయింది. ‘ఎనిమిదేళ్లుగా నా దంతాలను కాపాడుకునేందుకు నేను ఎంతో ఖర్చు చేశా. సర్జరీకి ముందు నాకు ఎలాంటి దంత సమస్యలు లేవు. సర్జరీ తర్వాతే ఈ సమస్య మొదలయింది. చివరకు కృత్రిమ దంతాలను పెట్టించుకోవాల్సి వచ్చింది.’ అంటూ ఆ యువతి తన స్వీయ అనుభవం గురించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ అయింది.


ప్రత్యేకంమరిన్ని...