పెళ్లైన పదేళ్ల తర్వాత సంతానం.. కానీ కాన్పు జరిగిన 15 రోజుల్లోనే కరోనాతో ఆ తల్లి..

ABN , First Publish Date - 2020-07-07T18:10:25+05:30 IST

తొలి కాన్పులో జన్మించిన బిడ్డతో ముద్దూ ముచ్చట తీరలేదు ఆ తల్లికి. కాన్పు జరిగిన పదిహేను రోజులకే ఆమెను కరోనా మహమ్మారి కబళించింది.

పెళ్లైన పదేళ్ల తర్వాత సంతానం.. కానీ కాన్పు జరిగిన 15 రోజుల్లోనే కరోనాతో ఆ తల్లి..

కరోనాతో బాలింత మృతి

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కలకలం

వైద్యసేవల తీరుపై విమర్శల వెల్లువ

డాక్టర్ల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆందోళన

దవాఖానాలో అమలు కాని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు

గర్భిణులు, బాలింతలకు జరగని కరోనా ముందస్తు పరీక్షలు


ఖమ్మంసంక్షేమవిభాగం/చింతకాని: తొలి కాన్పులో జన్మించిన బిడ్డతో ముద్దూ ముచ్చట తీరలేదు ఆ తల్లికి. కాన్పు జరిగిన పదిహేను రోజులకే ఆమెను కరోనా మహమ్మారి కబళించింది. వైద్యసేవల కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చిన ఓ బాలింత (31) కరోనాతో సోమవారం మృతిచెందిన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. చింతకాని మండలం కొమట్లగూడేనికి చెందిన జయమ్మకు సమీప గ్రామమైన నాగిలిగొండకు చెందిన ఓ వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వారు ఉపాధి కోసం విజయవాడకు వెళ్లారు. కాగా ఆలస్యంగా ఆమెకు  సంతానం కలగడం, మొదటి కాన్పు కావడంతో పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే పదిహేను రోజుల క్రితం జిల్లా ఆసుపత్రిలో (సిజేరియన్‌) ప్రసవించింది. తర్వాత ఇంటికి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత ఆ బాలింతకు జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో వైద్యసేవలు అందించారు.


ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో శ్యాంపిళ్లు సేకరించి పంపగా ఆదివారం రాత్రి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. వెంటనే ఆమెను మాతాశిశు విభాగం నుంచి కరోనా ఐసోలేషన్‌కు తరలించి వైద్యసేవలు ప్రారంబించగా సోమవారం ఉదయం మృతిచెందినట్టు జిల్లా ఆసుపత్రి అధికారులు ప్రకటించారు. ఆమె కరోనాతో మృతిచెందిందని నిర్ధారించారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో జయమ్మ మృతిచెందిందని భర్త, ఆమె బంధువులు... జిల్లా ఆసుపత్రి, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అయితే ప్రసవం సమయంలోనే పాజిటివ్‌ లక్షణాలున్నాయని అనుమానించిన ఆసుపత్రి అధికారులు వెంటనే ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యసేవలు అందించాల్సి ఉంది. కానీ సాధారణ బాలింతల్లా మూడు రోజులు పాటు మాతాశిశు విభాగంలో ఉంచి సాధారణ వైద్యసేవలు అందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగానే కరోనా వార్డులో ఉంచి వైద్యసేవలు అందించి ఉంటే ఆమె మృతిచెందిఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


అమలు కాని ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌...

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణులు, బాలింతల కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కాన్పుకు పది రోజులు ముందుగానే ప్రతీ గర్భిణికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఆ తర్వాతే కాన్పలు నిర్వహించాలని ఆదేశించింది. అలాగే బాలింతలకు కరోనా లక్షణాలు ఉంటే వారికి ప్రత్యేకంగా వైద్యసేవలు అందించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ జిల్లాలో మూడు నెలల కరోనా సమయంలో 2,400అపరేషన్లు చేసి రికార్డు సాధించిన జిల్లా ఆసుపత్రి అధికారులు.. బాలింతలు, గర్భిణులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేదన్న అపవాదు ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాదు ఇటు వైద్యులు, సెక్యూరిటీ సిబ్బంది, నర్సింగ్‌ ఉద్యోగులు కూడా కరోనా పాజిటివ్‌ బారిన పడుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-07-07T18:10:25+05:30 IST