Abn logo
Mar 2 2021 @ 01:09AM

లారీ కింద పడి మహిళ దుర్మరణం

కాకినాడ క్రైం, మార్చి 1: ట్రాఫిక్‌ పోలీసుల దూకుడు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రోడ్డుపై సడన్‌గా స్కూటీని ఆపడంతో ఓ మహిళ జారి లారీ కింద పడి మృతి చెందింది.   కాకినాడ రూరల్‌ మండలం కొవ్వాడకు చెందిన కొమ్మల వెంకటలక్ష్మీనారాయణ, సూర్యచంద్ర నాగేశ్వరమ్మ (56) భార్యాభర్తలు.  వారు సోమవారం స్కూటీపై మంచినీరు తెచ్చుకునేందుకు కాకినాడలోని కుళాయి చెరువుకు టిన్నులు పట్టుకుని వెళుతున్నారు. ఈ క్రమంలో  బైక్‌ ఇంద్రపాలెం వంతెన పైకి వచ్చేసరికి అక్కడ ఉన్న కాకినాడ ట్రాఫిక్‌ పోలీసులు సడన్‌గా బండిని ఆపారు. దీంతో బైక్‌ అదుపుతప్పింది. బైక్‌ వెనకాల కూర్చున్న సూర్యచంద్రనాగేశ్వరమ్మ కుడివైపు రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఇదే రహదారిలో వెళుతున్న లారీ వెనుక చక్రం ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భార్య నడిరోడ్డుపై విగతజీవిగా పడి ఉండటంతో భర్త వెంకటలక్ష్మీనారాయణ షాక్‌కు గురయ్యారు. ఆయన ఇటీవలే కోర్టు ఉద్యోగం నుంచి రిటైర్డ్‌ అయ్యారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు


రహదారిపై ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై  ప్రజాసంఘాలు, ప్రయాణికులు మండిపడుతున్నారు. తనిఖీల పేరుతో గుంపులు, గుంపులుగా రోడ్డుపై నిల్చుని సడన్‌గా బైక్‌లను ఆపుతున్నారని అంటున్నారు. వాహనదారులు పోలీసులను చూసి కంగారు పడి అదుపుతప్పుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఇలా చాలా ప్రమాదాలు జరిగినట్లు పలువురు చెప్పారు. సీపీఎం పార్టీ నాయకులు అజయ్‌కుమార్‌, విజయ్‌కుమార్‌తో పాటు  పలు ప్రజా సంఘాల నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement