భూమి పట్టా ఇవ్వాలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-10-17T06:14:34+05:30 IST

తమ భూమి పట్టా ఇవ్వకుండా తమభూమిని ఇతరులకు పట్టా ఇచ్చారని, ఆ పట్టా రద్దుచేయకుండా అధికారులు నిర్లక్ష్యం

భూమి పట్టా ఇవ్వాలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

ఇల్లెందు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన


ఇల్లెందుటౌన్‌, అక్టోబరు 16: తమ భూమి పట్టా ఇవ్వకుండా తమభూమిని ఇతరులకు పట్టా ఇచ్చారని, ఆ పట్టా రద్దుచేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఇల్లెందు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇల్లెందు మండలం, సుభాస్‌నగర్‌కు చెందిన కోరం వెంకటేశ్వర్లు బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీలోని మొట్లగూడెం వద్ద 1982లో సర్వేనెంబర్‌ 510కి చెందిన  8.32 ఏకరాల భూమిని కోనుగోలు చేయగా అభూమి పట్టాకోసం దరఖాస్తు చేయగా 2006లో కేవలం మూడు ఏకరాలకు మాత్రమే పట్టా ఇచ్చారు. మిగిలిఉన్న  మిగతా భూమిని కూడా తనకు పట్టా ఇవ్వాలని కోరుతూ ఇల్లెందు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు తన భూమిని తన కుటుంబసభ్యులకు అక్రమంగా పట్టాఇచ్చారని ఈ పట్టాను రద్దుచేయాలని గతంలోనే  ఫిర్యాదులు చేశారు. అప్పటి  వీఆర్‌వో, ఆర్‌ఐలు రద్దు పరుస్తున్నట్లు ఆర్డీవోకు సైతం లేఖలు రాశారని, అలేఖలను ఇప్పటివరకు అమలు చేయలేదని వాపోయారు.


అనేక పర్యాయాలు తమను కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారని, ప్రస్తుత ఆర్‌ఐ లక్ష్మీపతితో పాటు అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదనతో  మనస్తాపంతో వెంకటేశ్వర్లు భార్య కోరం నిర్మల శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను వంటిపై పోసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంతకిరోసిన్‌ అమె వంటిపై పడటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై ఇల్లెందు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈవిషయమై ఇల్లెందు తహసీల్దార్‌ మస్తాన్‌రావు మాట్లాడుతూ సర్వే నెం బరు 510లో గల భూమి విషయంపై పూర్తి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. బాధితులకు తగిన న్యాయం చేస్తానని ప్రకటించారు. 


Updated Date - 2020-10-17T06:14:34+05:30 IST