పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-08-07T10:23:42+05:30 IST

కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌లో గురువారం ఓ మహిళ శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.

పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

ఎస్‌ఐ అవమానించారని శానిటైజర్‌ తాగిన వైనం

ఫిర్యాదు స్వీకరించకుండా దుర్భాషలాడారని ఆరోపణ

కోటబొమ్మాళిలో కలకలం

ఇరు కుటుంబాల మధ్య విభేదాలే ఘర్షణకు కారణం

నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు 


(కోటబొమ్మాళి, ఆగస్టు 6): కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌లో గురువారం ఓ మహిళ శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ..  తన ఫిర్యాదును స్వీకరించకుండా.. దుర్భాషలాడుతూ తనను అవమానించారని ఆరోపిస్తూ.. పోలీసుల కళ్లెదుటే మహిళ ఈ ఘటనకు పాల్పడడం చర్చనీయాంశమైంది. తన తల్లితో పాటు వలంటీరుగా విధులు నిర్వహిస్తున్న తనపై కొంతమంది కక్షసాధిస్తూ.. పోలీసు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో మనస్థాపానికి గురై తన తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని బాధితురాలి కుమారుడు వాపోయాడు. శానిటైజర్‌ తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం కోలుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


కోటబొమ్మాళి మండలం జీయన్నపేట పంచాయతీ తర్లిబొడ్డపాడు గ్రామానికి చెందిన పూతి యర్రమ్మ గురువారం పోలీస్‌స్టేషన్‌లోనే శానిటైజర్‌ తాగి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడింది. తర్లిబొడ్డపాడు వలంటీరు పూతి చిరంజీవిపై అదే గ్రామానికి చెందిన దళిత మహిళ పూనిగంటి కల్పన.. స్థానికంగా జరిగిన ఓ ఘర్షణ విషయమై కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ లక్ష్మణరావు చిరంజీవిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు. విచారణలో భాగంగా చిత్రహింసలు పెట్టి.. చితకబాదారని బాధితుడు వాపోయాడు.


తన కుమారుడిని అనవసరంగా కేసులో ఇరికించడంతో పాటు చిత్రహింసలు పెట్టారని పేర్కొంటూ.. చిరంజీవి తల్లి యర్రమ్మ అదే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఎస్‌ఐ లక్ష్మణరావు ఫిర్యాదు తీసుకోకుండా తనను దుర్భాషలాడి.. తనపై కూడా చేయి చేసుకున్నారని యర్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పోలీసుస్టేషన్‌లోనే శానిటైజర్‌ను తాగేసింది. దీంతో పోలీసు సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య ఆసుపత్రికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


ముదిరిన విభేదాలు

కల్పన, యర్రమ్మ కుటుంబాల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇటీవల కల్పన ఇంటికి విశాఖపట్నం నుంచి బంధువులు వచ్చారు. ఇప్పటికే విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని, అలా ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకూడదని వలంటీర్‌ పూతి చిరంజీవి(యర్రమ్మ కుమారుడు) ఆమెకు సూచించాడు. దీంతో అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా.. ఇసుక తమవైపు తుళ్లిందని కల్పన.. యర్రమ్మ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగింది.


దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్రమైంది. దుర్భాషలాడుకుంటూ.. దీనిపై ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. ముందుగా కల్పన ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ‘నా తల్లి యర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించారు. అంతేకాకుండా ఎస్‌ఐ దుర్భాషలాడారు. కొంతకాలంగా ఎస్‌ఐ ఏదో ఒక నెపంతో ఎవరో ఒకరు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులతో నన్ను కూడా తరచూ వేధిస్తున్నారు. ఇటీవల ఎస్‌ఐ చేతిలో దెబ్బలు కూడా తిన్నాను. ఇటువంటి ఘటనలతో మనస్థాపం చెంది.. నా తల్లి శానిటైజర్‌ తాగి ఉంటుంది’ అని వలంటీర్‌ చిరంజీవి తెలిపారు. 


ఈ విషయమై ఎస్‌ఐ లక్ష్మణరావు వివరణ ఇస్తూ.. ‘ప్రతిరోజూ వలంటీరు చిరంజీవి, ఆయన తల్లి యర్రమ్మ తనను దూషిస్తూ.. దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని బొడ్డపాడుకి చెందిన కల్పన అనే దళిత మహిళ ఫిర్యాదు చేసింది. వారికి మరో ఇద్దరు మద్దతు పలుకుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేశాను. ఇంతలో చిరంజీవి తల్లి యర్రమ్మ వచ్చి.. తన కుమారుడుపై ఎందుకు కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. ఆమె కూడా ఫిర్యాదు చేస్తా తీసుకోమని చెప్పారు. కేసు పూర్వపరాలు వివరిస్తున్న సందర్భంలో యర్రమ్మ తనతో తెచ్చుకున్న శానిటైజరు తాగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించా’మని ఎస్‌ఐ తెలిపారు. కల్పన ఫిర్యాదు మేరకు యర్రమ్మ, చిరంజీవితో పాటు మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని వివరించారు. ఈ ఘటనపై కాశీబుగ్గ డీఎస్పీ శ్రీలత దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2020-08-07T10:23:42+05:30 IST