అమ్మాయి అందానికి ఫిదా.. రూ. 7 లక్షలు గోవిందా!

ABN , First Publish Date - 2020-10-22T22:33:18+05:30 IST

అమెరికా అబ్బాయి.. ఆకర్షణీయమైన జీతం.. పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో పెట్టిన బయోడేటా చూసింది. ఇంకేముంది ఓ పని పడదామని ఫిక్స్ అయింది. తక్షణమే గూగుల్‌లో మంచి మోడల్ ఫొటోలు డౌన్‌లోడ్ చేసింది. ఆ ఫొటోలు తనవే అంటూ రోజుకొకటి పంపింది.

అమ్మాయి అందానికి ఫిదా.. రూ. 7 లక్షలు గోవిందా!

గుంటూరు: అమెరికా అబ్బాయి.. ఆకర్షణీయమైన జీతం.. పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో పెట్టిన బయోడేటా చూసింది. ఇంకేముంది ఓ పని పడదామని ఫిక్స్ అయింది. తక్షణమే గూగుల్‌లో మంచి మోడల్ ఫొటోలు డౌన్‌లోడ్ చేసింది. ఆ ఫొటోలు తనవే అంటూ రోజుకొకటి పంపింది. అమ్మాయి అందానికి ఫిదా అయిన అమెరికా అబ్బాయి.. ఆమె మోజులో పడి అడిగినంత డబ్బులు పంపించాడు. తీరా పెళ్లి సంబంధం కోసం అబ్బాయి కుటుంబం ఆరా తీయగా మాయలాడి జంప్ అయింది. దీంతో మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


గమనిక: ఈ వార్తలో మొదట ఉపయోగించిన ఫొటోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుని ద్వారా వచ్చినవి. అవి బాధితుడు అందించిన అసలు నిందితురాలి ఫొటోలు లేదా ఫోటో మార్ఫింగ్ / ఫేక్ ఫొటోలుగా భావించి యథాతథంగా ఉపయోగించడం జరిగింది. అయితే, ఆ ఫొటోలు నిజమైన వ్యక్తులవేనని తెలియడంతో వారి వ్యక్తిగత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని తొలగించడం జరిగింది.


పెళ్ళి పేరుతో మోసం చేసిన ఓ లేడీ వ్యవహారం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. తెనాలికి చెందిన యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడికి పెళ్ళి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వివరాలు నమోదు చేసుకున్నాడు. ఇతని వివరాలు చూసిన ఓ మాయ లేడి ఆ యువకుడిని ఫోన్‌లో సంప్రదించింది. తన పేరు మైనేని సుముద్ర అని, ప్రకాశం జిల్లా ఉలవపాడు తన స్వగ్రామమని, న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి.. తాను గ్రీన్ కార్డు హోల్డర్‌నని పరిచయం చేసుకుంది. ఆ యువకుడు ఫొటోలు పంపమని అడగ్గా.. గూగుల్ నుంచి మంచి అందమైన మోడల్  ఫోటోలు పంపంది. మత్తుగా మాయమాటలు చెప్పి పెళ్ళికి యువకుడుని సిద్ధం చేసింది. సదరు యువకుడు తనకు పరిచయమైన యువతి గురించి తెనాలిలోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ లేడీ ఫోటోలు, బయోడేటా కుటుంబ సభ్యులకు పంపాడు. వాటిని  చూసిన కుటంబ సభ్యులు బయోడేటాలో కుటుంబం గురించి గొప్పగా ఉండటం అమ్మాయి అందంగా ఉండటంతో పెళ్ళికి ఓకే చెప్పారు. పెద్ద వారితో మాట్లాతామని అబ్బాయి కుటుంబ సభ్యులు అడగ్గా.. ఆ యువతి తన తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్శిటిలో ఫ్రొఫెసర్‌లుగా పని చేస్తున్నారని నమ్మించింది. తన తండ్రి పేరు శ్రీనివాస్‌గా, తల్లి పేరు దేవిగా చెప్పింది. తన తండ్రి శ్రీనివాస్ అని ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చింది. తండ్రి పేరుతో ఉన్న శ్రీనివాస్‌తో అబ్బాయి కుటుంబ సభ్యులు ఫోన్‌లో సంప్రదించారు. అమ్మాయి న్యూయార్క్‌లో గ్రీన్ కార్డు హోల్డర్ అని, ఆమె నాయనమ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో చూసి పోయేందుకు వచ్చిందని, అమ్మాయి తిరిగి వెళ్లే లోపే పెళ్ళి చూపులు, పసుపు కుంకుమ పెట్టుకుందామని నమ్మబలికారు.


ఈ నెల 21న తమ స్వగ్రామం ప్రకాశం జిల్లా ఉలవపాడుకు పెళ్ళి చూపులకు రావాలని, ఈ నెల 24వ తేదిన పసుపు కుంకుమ పెట్టుకుందామని చెప్పారు. ఈ లోపు అమ్మాయికి బంగారం, బట్టలు కోనుగోలు చేద్దామని, సమయం తక్కువగా ఉందని చెప్పారు. నిజమేనని నమ్మిన అబ్బాయి విడతల వారిగా రూ. 7 లక్షల 20 వేలు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అంతా బాగానే ఉందనుకొని ఈ నెల 21న అమ్మాయి చెప్పిన ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి అబ్బాయి కుటంబ సభ్యులు వెళ్ళారు. అయితే ఉలవపాడు వెళ్లే సరికి ఆ మాయలేడి నెంబర్, అతని తండ్రి అని చెప్పిన శ్రీనివాస్ ఫోన్ నెంబర్‌లు స్విచ్ఛాఫ్ చేశారు. ఉలవపాడు గ్రామం అంతా తిరిగి గ్రామస్తులను వాకాబు చేయగా అసలు అలాంటి ఇంటి పేరు గాని, మాద్రాస్ యూనివర్శిటిలో ఉద్యోగం చేసే వారు గానీ ఆ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా ఎవరూ లేరని స్థానికులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-10-22T22:33:18+05:30 IST